చాలాకాలంగా రాజకీయాలను, రాజకీయనాయకులను గమనిస్తున్నాను. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తారో, ఎటువంటి ప్రకటనలు చేస్తారో కాస్తయినా ఊహకు అందుతుంది. కానీ పవన్ చేసేదానికి కారణాలు కనుక్కోవడం అసాధ్యంగా ఉంది. అసలు ఆయన మాటలే అర్థం కావు. ఒకసారి ఒకలా మాట్లాడతాడు. కొన్నాళ్లకు దానికి విపర్యంగా మాట్లాడతాడు. దేన్ని సీరియస్‌గా తీసుకోవాలో బోధపడదు. ఇక చేతలకు వస్తే, ఎన్నో వైరుధ్యాలు. నిలకడ లేదని పేరు తెచ్చుకున్నారు. నిలకడ లేకపోవడం రాజకీయాల్లో పెద్ద విశేషమేమీ కాదు. సిద్ధాంతాలు పట్టుకుని వేళ్లాడకుండా ఎవరు గెలుస్తారని తోస్తే వాళ్ల పార్టీలోకి మారిపోతూ ఉంటారు. కానీ ఏం చేసినా, ప్రజల్లోకి చొచ్చుకుని పోయి, నాయకుడిగా ముద్ర వేయించుకోవడమే అంతిమ లక్ష్యం. దానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదలుకోరు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెళ్లి ఓదార్చేస్తూ ఉంటారు. వాళ్ల యిళ్లల్లో శుభాశుభ కార్యక్రమాలకు హాజరవుతారు. వేదిక ఎక్కడానికి, ఉపన్యాసాలు దంచడానికి ఎదురు చూస్తూ ఉంటారు. సందు దొరికితే చాలు, ముందుకు దూకుతారు.
కానీ తెలంగాణలో పవన్ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీ అభ్యర్థులు 8 మంది శాసనసభకు పోటీ చేస్తున్నా మొన్నటివరకు కదిలి రాలేదు. ప్రచారం చేయాలంటే కేవలం వారం రోజులు మిగిలి ఉందనగా యిప్పుడు దిగారు. నియోజకవర్గంలో ఏదో ఒక చోట సభ పెడితే సరిపోయిందా? వారాహి వేసుకుని కలయ దిరగవద్దా? నియోజకవర్గంలో కాలినడకన తిరుగుతూ టీ స్టాల్స్‌లో టీ తాగడాలు, వీలైతే కాచడాలు, ఇస్త్రీ బడ్డీలో ఇస్త్రీ చేయడాలు లేకపోయినా, రోడ్‌సైడ్ షోలు, ప్రజల్ని పలకరించడాలు, మన రాజ్యం వస్తే కష్టాలుండవని ఓదార్చడాలు, బంగారు కాలం ముందుందని ఊరించడాలు తప్పవు కదా! ఈ 8 మందే వచ్చే ఎన్నికల నాటికి 80 మంది అవుతారని దంబాలు పలకవద్దా? వీళ్లు గెలిస్తే తెలంగాణలో తక్కిన రాజకీయ నాయకులకు కూడా ఆశ పుట్టి, జనసేన ఆఫీసు దగ్గర క్యూ కట్టే విధంగా ప్రవర్తించాలి కదా!
తెలంగాణలో తన పార్టీ ఏమైపోయినా ఫర్వాలేదు, తనను నమ్మి వచ్చిన అభ్యర్థులు ఓడిపోయినా, డిపాజిట్ దక్కకపోయినా చింత లేదు అనుకున్నా, పిలిచి పెద్ద పీట వేసిన భాగస్వామి బిజెపి కోసమైనా పని చేయాలి కదా! మాట్లాడితే మోదీ, అమిత్ షా నాకు స్నేహితులు. ఫోన్ చేస్తే పలుకుతారు, కేంద్ర నిఘా వర్గాల వారు నాకు రహస్య సమాచారం చేరవేస్తారు, నేను తలచుకుంటే మా ‘బిగ్ డాడీ’తో చెప్పి జగన్‌కు శిక్ష వేయించగలను అని చెప్తారు కదా. మరి వాళ్లు స్వయంగా పిలిచి, పొత్తు పెట్టుకోమని కోరి, వాళ్ల ఎన్నికల పోస్టర్ల మీద మీ ఫోటో కూడా వేసి గౌరవమిస్తే స్నేహధర్మంగా వాళ్ల అభ్యర్థుల కోసమైనా ప్రచారం చేయాలి కదా! వాళ్ల 111 స్థానాల్లోనూ తిరగ లేకపోవచ్చు. కనీసం ఎంపీలుగా ఉంటూ అసెంబ్లీకి పోటీ చేస్తున్న వారి, ముఖ్య నాయకుల స్థానాల్లోనైనా తిరగాలి కదా! కెసియార్‌తో తలపడుతున్న ఈటలకు మద్దతుగా వెళ్లాలి కదా!
బేరసారాలు సాగిసాగి, పొత్తు కుదరడానికే లేటయింది. అభ్యర్థుల నిర్ణయానికి యింకా లేటయింది. వెంటనే ప్రచారంలో దిగవద్దా? తక్కిన అన్ని పార్టీ నాయకులందరూ పగలనకా, రాత్రనకా తిరుగుతూ ఉంటే పవనేమిటి, అరుగు దిగకుండా యిన్నాళ్లు వ్యర్థం చేశారు? ఊళ్లు పట్టుకుని తిరగడం కుదరకపోతే మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలి, విరివిగా యింటర్వ్యూలు యివ్వాలి. అదీ చేయలేదు. ఆయనే కాదు, ఆయనకు డిప్యూటీలుగా ఉన్న నాగబాబు కానీ, నాదెండ్ల కానీ వాళ్లూ చేయలేదు. టీవీ చర్చల్లోకి జనసేన వాళ్లు ఎవరూ రావటం లేదు. ఎన్నికల సమయం అంటే ప్రజలు చెవి ఒగ్గే సమయం. తక్కిన సమయాల్లో మీటింగు పెడితే పెద్దగా రారు. ఎలక్షన్ సీజన్లో ఎవరేం చెప్పినా వచ్చి వింటారు. ఫైనల్‌గా ఎవరికి ఓటేయాలో ముందే నిర్ణయించుకున్నా, ప్రతి పార్టీ చెప్పేది ఆలకిస్తారు. అందుకే తమ భావాల వ్యాప్తికి ఎన్నికలు సరైన సమయంగా పార్టీలు భావిస్తాయి. పవన్ దాన్ని వదులుకోవడం ఆశ్చర్యకరం.
మిగతా సమయాల్లో ప్రభుత్వం చేసే పనులను మెచ్చుకున్నా సరే, ఎన్నికల సమయంలో మాత్రం ప్రతిపక్షాలు, అధికారంలోకి వద్దామనుకునే పక్షాలు అధికార పక్షాన్ని తిట్టి పోస్తాయి. తాము అధికారంలోకి వాళ్ల కంటె మెరుగ్గా ఎలా చేస్తామో చెప్పి ఒప్పించడానికి చూస్తాయి. సాటి ప్రతిపక్షాలు పనికి మాలినవని, చేవ లేనివని కూడా చెప్తాయి. కానీ పవన్ తీరే వేరుగా ఉంది. మోదీతో కలిసి పాల్గొన్న సభలో అధికార పక్షమైన తెరాసను, సాటి ప్రతిపక్షమైన కాంగ్రెసును తిట్టలేదు. బిజెపిని మెచ్చుకోలేదు. కేవలం మోదీ గొప్పవాడని మాత్రం చెప్పి ఊరుకున్నారు. అప్పుడే దీనిపై విమర్శలు వచ్చాయి. అయినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. రెండు వారాల పాటు స్తబ్దంగా ఉండి యిప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మొదటి రోజు బిజెపి గురించి గొప్పగా చెప్పారు కానీ తెరాసను తిట్టలేదు. ఎవరికి పాఠం నేర్పాలో మీకే తెలుసు అంటూ ప్రజలకు వదిలేశారు. వాళ్లకే అన్నీ తెలిసిపోతే యిక నాయకులెందుకు వాహనాలెక్కి తిరగడం? నాకున్న జ్ఞానంతో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను, మిమ్మల్ని జాగృతం చేస్తున్నాను అంటూ చెప్తారు కదా నాయకులు!
రెండో రోజుకి వచ్చేసరికి తెరాస గురించి కాస్త వ్యతిరేకంగా మాట్లాడారు కానీ అది ఉద్యమ పార్టీ కాబట్టి పెద్దగా ఏమీ అనలేనంటూ సంజాయిషీ చెప్పుకున్నారు. నాయకులు స్నేహితులు కాబట్టి ఏమీ అనలేనంటే ఎలా? రాజకీయాలకు వచ్చేసరికి వ్యక్తిగతమైన మొహమాటాలను, బంధుత్వాలను, స్నేహాలను కూడా పక్కన పెట్టి ప్రజాశ్రేయస్సు కోసం నిలదీస్తున్నా అనే ధోరణిలో మాట్లాడాలి. కాంగ్రెసు గురించి ఏమీ అన్నట్లు లేదు. బిజెపి నాయకులు కాంగ్రెసును తిట్టిపోస్తూనే మాట్లాడతారు. వారితో పొత్తు పెట్టుకున్నాక, కాస్తయినా అనకపోతే ఎలా? తెరాసను విమర్శించి వదిలేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెసుకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది కదా! తెరాస వైఫల్యాల గురించి చెప్పడానికి పేపర్ల లీకు తప్ప మరే విషయమూ దొరకలేదా?
అయినా ఎవర్నీ పెద్దగా తిట్టకపోవడం అనే లక్షణం యీయనకు ఎప్పణ్నుంచి అబ్బింది? అది చిరంజీవి అలవాటు. ప్రజారాజ్యంతో ముందుకు వచ్చినపుడు వైయస్సార్‌ను, చంద్రబాబును యిద్దర్నీ మెచ్చుకుని, మాక్కూడా అవకాశం యివ్వండి అనే పద్ధతిలో మాట్లాడేవారాయన. కానీ తమ్ములుంగారు మాత్రం అధికారపక్షమైన కాంగ్రెసును అడ్డమైన తిట్లూ తిట్టేవారు. పంచెలూడదీసి కొట్టడం అని అప్పట్లో ఆయన కాయిన్ చేసిన పదబంధమే అలాఅలా పాప్యులర్ అయి, యిప్పుడు నాయకులందరికీ ఊతపదమై పోయింది. వారి కంటె యింకో మెట్టు పైకెక్కాలని పవన్ చెప్పు తీసి కొట్టడాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ పరుషభాషంతా ఆంధ్రలోనే వినియోగించాలని, తెలంగాణలో సాధుజీవిగా ఉండాలని పవన్ నిశ్చయించుకుంటున్నట్లు కనబడుతోంది.
దేశాన్ని బట్టి వేషం, భాష అంటారు. వేషంలో యింకా మార్పు తేలేదు కానీ తెలంగాణకు వచ్చేసరికి పవన్ భాష చాలా సంస్కరించుకున్నారు. ఆవేశకావేషాలు, అరుపులు, ఊగిపోవడాలు, శత్రువుని ఊహించుకుని ఏకపాత్రాభినయాలు.. యివేవీ యిప్పటిదాకా చూపలేదు. పారితోషికం బాగా యిస్తే నటుడు ఫుల్ స్వింగ్‌లో నటిస్తాడు. తర్వాత యిస్తాం లెండి, వచ్చి షూటింగు చేయండి అంటే సెట్స్‌పైకి లేటుగా వచ్చి, బద్ధకం ప్రదర్శిస్తూ ‘మీ మొహానికి యిది చాల్లెండి’ అన్నట్లు అరకొరగా నటిస్తూ, నీరసంగా, డైలాగులు వప్పచెప్పి ఊరుకుంటాడు. తెలంగాణలో పవన్ పెర్ఫామెన్స్ చూస్తే బిజెపి చేత బలవంతపు బ్రాహ్మణార్థానికి ఒప్పించ బడినట్లుగా తోస్తోంది. ఓటర్లను కాదు కదా, అభిమానులను కూడా ఉత్సాహపరిచే జోష్ కనబడటం లేదు.
ఉన్న సమయం తక్కువైనప్పుడు ‘దేర్ ఆయా, పర్ దురుస్త్ ఆయా’ అన్నట్లు ఉండాలి. జాతీయ నాయకులు చూడండి, సమయాభావం వలన చివర్లో సుడిగాలి పర్యటనకు వచ్చినపుడు చెణుకులతో, చమక్కులతో ఓటర్లలో, కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతారు, అలా ఉండాలి. ఇక యిక్కడ ఆంధ్ర గురించి ప్రస్తావన ఎందుకు? అసలే ఆంధ్ర ముద్ర ఉన్న నాయకుడు. రాష్ట్రం విభజనకు గురైనప్పుడు ఆవేదనతో 11 రోజులు అన్నం మానేసినానని చెప్పుకున్న సమైక్యవాది. ఆంధ్రలో రోజుల తరబడి తిరుగుతాడు కానీ తెలంగాణను పట్టించుకోడని యిక్కడివారు కినుక వహించే ప్రమాదం ఉంది. తెలంగాణలో ప్రచారానికి వచ్చినా మెదడులో ఆంధ్రే తిరుగుతోంది అని అనిపించుకునేట్లా, ఆంధ్ర బాగోగుల గురించి మాట్లాడడం దేనికి? జాతీయ పార్టీలే ఆ పని చేయవు కదా! తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి నినాదం బిజెపిది. దాన్ని పవన్ ఎత్తుకుంటే, ఆంధ్రలో బిసిలు ‘ఆంధ్రలో మాత్రం బిసి సిఎం వద్దా? మేం చేసుకున్న పాపమేమిటి?’ అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తాడు?
30 పై చిలుకు సీట్లు అడిగితే బిజెపి 8 మాత్రం యిచ్చింది. వాటిల్లో సగమైనా గెలిస్తే తెలంగాణ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే అంటూ కొందరు కనబడతారు. టిడిపికి దక్కని భాగ్యం తమకు దక్కుతుంది! రేపు ఆంధ్రలో కూడా కొన్ని గెలిస్తే వైసిపి, టిడిపిలకు లేని రెండు రాష్ట్రాలలో ఉనికి అనే ప్రత్యేకత తనకు దక్కుతుందిగా! ఎన్నికలలో ఫలితం మాట అటుంచి, కనీసం గెలుపు కోసం గట్టి ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? తన కిష్టం లేని పనిని తన చేత చేయిస్తున్న బిజెపిపై కోపం చేతనా? సెలవు రోజుల్లో పిల్లల చేత లెక్కలు చేయించడానికి ప్రయత్నించండి. పుస్తకం కనబడ లేదంటాడు, పెన్సిలు పోయిందంటాడు, ముల్లు విరిగిపోయిందంటాడు, ఉక్క పోస్తోందంటాడు, లెక్క అర్థం కాలేదంటాడు, కడుపులో నొప్పి వస్తోందంటాడు, సాటి పిల్లలు ఆటలాడుకుంటూంటే తనకీ ఖర్మేమిటని తల్లి దగ్గర గొణుక్కుంటాడు. చివరకు తండ్రి చేత లెక్కలూ వద్దు, పాడూ వద్దు, బయటకు ఫోరా బాబూ అనిపిస్తాడు.
పవన్ వ్యవహారం చూస్తే అలాగే ఉంది. ఆంధ్రలో టిడిపితో కలిసి పొత్తుకు రండి అని బిజెపి అధిష్టానాన్ని అడిగితే ఆ సంగతి చెప్పకుండా, తెలంగాణలో పని చూడు అన్నారు వారు. అది కూడా టిడిపి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే బాధ్యత అప్పగించారు. సిన్సియర్‌గా చేస్తే టిడిపితో ఆంధ్రలో చెడుతుంది, చేయకపోతే పార్టీ పేరు చెడుతుంది. ఇలాటి డైలమాలోకి నెట్టారు. రేవంత్ రెడ్డి అనేశారు కూడా – జనసేన తెలంగాణలో పోటీ చేయడం పొరపాటు, యిక్కడి వైఫల్యం ప్రభావం ఆంధ్రపై పడి నష్టపోతారు. టిడిపి ఆ పొరపాటు చేయడం లేదు, సంతోషం అని. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే తన అభ్యర్థులు గెలిస్తే సంతోషించాలో, మానాలో పవన్‌కు తెలియకుండా పోతుంది. టిడిపికి, అది లోపాయికారీగా మద్దతిస్తున్న కాంగ్రెసుకు పట్టున్న స్థానాల్లోనే బిజెపి జనసేనను నిలబెట్టింది. గెలవాలంటే వాళ్ల ఓట్లను చీల్చి నెగ్గాలి.
మొహమాటానికి పోయి, చీల్చకపోతే ‘8 సీట్లలోనే తన అభ్యర్థులను గెలిపించుకోలేని వాడికి మనం యిక్కడ 30, 40 సీట్లు యివ్వడం అవసరమా?’ అని ఆంధ్రలో టిడిపి నాయకులు తమ అధిష్టానాన్ని అడుగుతారు. ముఖ్యంగా జనసేన తనకు బలముందని చెప్పుకుంటూ అడుగుతున్న స్థానాలపై ఆశ పెట్టుకున్న టిడిపి అభ్యర్థులు వాదిస్తారు. ‘బలం లేక కాదు, కేవలం మన కోరికపై బలం లేనట్లు అలా యాక్టింగు చేశాడు’ అని బాబు వాళ్లకు చెప్పలేరు కదా! అది లీక్ అయితే ఎంత ప్రమాదం! జనసేన కాంగ్రెసు పట్ల ఔదార్యం చూపుతోంది సరే, మరి కాంగ్రెసు చూపుతుందా? జనసేన పోటీ చేసే చోట్ల జనసేనను తిడుతుందా? లేదా? తిడితే రేవంత్ అభిమాన పార్టీ ఐన టిడిపికి ఆంధ్రలో దెబ్బ పడుతుందనే శంక చేత తిట్టకపోతే అది మరీ అవమానం. ఇప్పుడే ఆటలో అరటి పండు అంటున్నారు. అప్పుడు మరీ కనాకష్టంగా చూస్తారు.
పవన్ పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా, యాక్టివ్ పాలిటిక్స్‌లో కొత్త కాబట్టి యింతటి గందరగోళానికి తాను గురై, పరిశీలకులను కూడా గురి చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ టిడిపి వ్యవహారం కూడా యింతే గందరగోళంగా తయారైంది. ఆంధ్రలో సేమ్ పేజ్‌పై ఉన్న టిడిపి, జనసేన, తెలంగాణకు వచ్చేసరికి వేర్వేరు పేజీల్లో, వేర్వేరు గంపల్లో కనబడుతున్నారు. ఒక రాష్ట్రంలో సఖ్యంగా ఉన్నవారు పొరుగు రాష్ట్రంలో పోటీపడడం రాజకీయాల్లో వింతేమీ కాదు. కానీ యిక్కడ అస్పష్టత కనబడుతోంది. కెసియార్‌ను తిట్టడానికి పవన్ వెనుకాడుతున్నారు కానీ తెలంగాణలో టిడిపి అభిమానులు వెనకాడటం లేదు. వారు గతంలో కెసియార్ ఆంధ్రులను రాక్షసులని అన్న వీడియోను పంపిస్తూ ‘బిఆర్ఎస్ను సపోర్టు చేస్తున్న ఆంధ్రోళ్లు సిగ్గుపడాలి’ అనే వ్యాఖ్య జోడిస్తున్నారు. 2009లో టిడిపి తెరాసతో పొత్తు పెట్టుకున్నపుడు, అమరావతి శంకుస్థాపన ఫలకంగా కెసియార్ పేరు రాసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారో తెలియదు.
తెరాసకు ఓటేయకండి అంటే బిజెపికి ఓటేయమనా? అది కాదు వీళ్ల భావం! కాంగ్రెసుకు వేయమని!! కొన్ని చోట్ల కాంగ్రెసు, టిడిపి జండాలు కలిసి తిరుగుతున్నాయి. ఆంధ్రమూలాల వారు కాంగ్రెసుకు ఓటేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎందుకు వేస్తారట? విభజన సమయంలో ఆంధ్రకు ఘోరమైన అన్యాయం చేసిన ప్రథమ ముద్దాయి కాంగ్రెస్సే. తెలంగాణలోనే గెలుస్తాం, ఆంధ్రలో గెలవము కాబట్టి అక్కడ ఏమిచ్చినా దండగే అనే భావంతో, కసితో ఆంధ్రకు ఏమీ లేకుండా గొరిగేశారు. ఐఐటీ మే బీ గివెన్, వైజాగ్ జోన్ మే బీ కన్సిడర్డ్.. యిలా అన్నీ మేబీ..లతో నింపేశాడు జైరాం రమేశ్. ప్రత్యేక హోదా యిద్దామనుకుంటే అది బిల్లులో ఎందుకు పెట్టలేదు? బిజెపి వాళ్లు అడిగేదాకా ఎందుకు తోచలేదు? ఆంధ్రకు చెంది ఉండనవసరం లేదు. ఆంధ్రపై అభిమానం లేకపోయినా జాలి ఉన్నా చాలు, హస్తం పార్టీకి రిక్తహస్తం చూపించాల్సిందే.
ఈ ద్రోహంలో బిజెపికి కూడా చాలా పాత్ర ఉంది. ప్రత్యేక హోదా ఎగ్గొట్టడంలో, వెనకబడిన జిల్లాలకు సాయం చేయకపోవడంలో, మొదటి సంవత్సరం బజెట్ లోటు చాలా ఆలస్యంగా పూరించడంలో.. యిలా చాలా రకాలుగా! కానీ ఎంతైనా దానిది ద్వితీయ స్థానమే. దానికే ఆంధ్రలో కాలూనడానికి వీలు లేని పరిస్థితిలో బిజెపి ఉన్నపుడు తెలంగాణలోని ఆంధ్రమూలాల వారు కాంగ్రెసు పార్టీని నెత్తికి ఎత్తుకుంటా రనుకోవడం విచిత్రం. కానీ టిడిపి ఆలా జరగాలని కోరుకుంటోంది. ఎందుకు? కాంగ్రెసు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిడిపికి ఆప్తుడు కాబట్టి!
ఇక్కడ తమాషా ఏమిటంటే, ఆంధ్రలో ఎటు చూసినా రెడ్లే కనబడుతున్నారు. వారి ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి అంటూనే తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం! ఎందుకలా అంటే అతను ‘మన రెడ్డి’ కాబట్టి! రేవంత్ టిడిపివారికి ఆప్తుడు కావచ్చు కానీ ఆంధ్రులకు, ఆంధ్రమూలాల వారికీ కాదు. ఉద్యమసమయంలో నానా అవాకులూ మాట్లాడడమే కాదు, రెండు రోజుల క్రితం కెసియార్‌ను తిడుతూ ‘సమైక్యపాలనలో ఆంధ్రపాలకుల్లాగానే ఉన్నాడు కెసియార్’ అన్నాడు. తిట్టాలంటే ఆంధ్ర పదం తప్పదు మరి! తెలంగాణలో కాంట్రాక్టులన్నీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే అనే రేవంత్ ఘోష ఎప్పణ్నుంచో ఉంది.
రేవంత్ మొహం చూసి కాంగ్రెసును గెలిపించిన దాకా ఉండి కాంగ్రెసు అధిష్టానం అతన్ని సిఎంగా చేయకపోతే! చేసి తీరుతుందన్న రేవంత్ ధీమా చూస్తే, డిసెంబరు 9న సిఎంగా ఫలానా చోట ప్రమాణస్వీకారం చేయబోతున్నానన్న దంబాలు వింటూంటే, బయటివాళ్లం మనకే ఒళ్లు మండితే సాటి కాంగ్రెసు నాయకులకు ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే! అసలు రేవంత్‌కు ఉన్న స్టాండింగ్ ఏమిటి? 2018లో సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయినవాడు. 2019లో ఎంపీగా అయినప్పుడు అతని మెజారిటీ 11వేలు! ఇతనో పెద్ద లీడరంటే కాంగ్రెసులో తక్కిన నాయకులు ఒప్పుకుంటారా? ఇలాటి రేవంత్‌పై ఆశలు పెట్టుకుని టిడిపి కాంగ్రెసుతో కలిసి పని చేయడంలో విజ్ఞత ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కాంగ్రెసును గెలిపించిన, లేదా గెలుపుదాకా తీసుకెళ్లిన బాబును మోదీ ఆంధ్రలో దగ్గరకు తీస్తారా? ‘అబ్బే బాహాటంగా మద్దతు యివ్వలేదు కదండీ’ అంటే ఒప్పుతుందా? పాలు తాగే పిల్లి కళ్లు మూసుకోవచ్చు కానీ లోకమంతా కళ్లు తెరుచుకుని చూస్తూనే ఉంది కదా!
బాబే యింత అయోమయంగా, తికమకగా ప్రవర్తిస్తున్నపుడు ఆయన వద్ద తర్ఫీదు పొందుతున్న పవన్ వింతవింతగా ప్రవర్తించడంలో అసంబద్ధత లేదనుకోవాలి. నిజానికి అందర్నీ ప్రశ్నలడుగుతానంటూ రంగంలోకి దిగిన పవన్ అడుగుదా మనుకున్న ప్రశ్నల కంటె జవాబు చెప్పవలసిన ప్రశ్నలే ఎక్కువయ్యేట్లున్నాయి. ముఖ్యంగా ఆయన పాత అనుచరుల దగ్గర్నుంచి! పార్టీల్లోంచి కొందరు అసంతృప్తులు బయటకు వచ్చేయడం, వచ్చాక నాయకత్వం గురించి విమర్శలు చేయడం చాలాకాలంగా చూస్తూనే ఉన్నా. కానీ జనసేన లోంచి బయటకు వచ్చినవారిలో ఉన్నంత బిట్టర్నెస్ వేరెక్కడా చూడలేదు. ఏవేవో కబుర్లు చెప్పి మమ్మల్ని మూర్ఖుల్ని చేశాడు, యువతీయువకులారా, మాలాగ మీరెవ్వరూ మోసపోవద్దు అనే టోన్‌లోనే అందరూ మాట్లాడుతున్నారు. కొత్తగా నాయకులు, కార్యకర్తలు ఎవరూ చేరటం లేదు సరే, పాతవాళ్లనే ప్రత్యర్థులుగా చేసుకోవడంలో కూడా పవన్ విలక్షణత కనబడుతోంది.