ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కక్షతో రగిలిపోతున్నారు. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పాపానికి సీఎం జగన్‌కు రఘురామ తగిన గుణపాఠం నేర్పుతున్నారు. నిత్యం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇది చాలదన్నట్టు ఆయనపై న్యాయ స్థానాల్లో కేసులు వేసి ఏదో చేయాలని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని రఘురామ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఏపీలో పథకాల పేరుతో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, సీబీఐతో విచారణ జరపాలని పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు. అయితే రఘురామకు పిటిషన్ వేసే అర్హతే లేదని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ గట్టిగా వాదనలు వినిపించారు.
రఘురామ పిటిషన్లో ప్రజా ప్రయోజనం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే వేశారని కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. అందుకే పిటిషన్‌కు విచారణ అర్హతలేదని ఏజీ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం సీఎం జగన్‌తో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులకు… మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
తాజాగా సుప్రీంకోర్టులో కూడా జగన్ అక్రమాస్తుల కేసుపై ఆలస్యంగా విచారణ సాగుతోందని రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నీ ఏమవుతాయో మరి!