ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి తన అన్న కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చినట్టు జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిపారు. తెలంగాణలో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచార సభలో పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వీహెచ్ హనుమంతరావు బాగా తెలుసన్నారు. కానీ రాజకీయం వేరు, స్నేహం వేరని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తన కుటుంబ సభ్యులు, అన్న మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే బంధాలు, రాజకీయాలు వేర్వేరని ఆయన స్పష్టం చేశారు.
ఎవరితో స్నేహం ఉన్నా మోదీ నాయకత్వాన్నే తాను బలపరుస్తానని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణలో మార్పేమీ లేదన్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. గత పాలకులు చేసిన తప్పులే తెలంగాణలో పునరావృతం అవుతున్నాయని ఆయన విమర్శించారు.
తెలంగాణలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. బీజేపీ అభ్యర్థులకు జనసేన శ్రేణులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో మూడు రాజధానుల ఏర్పాటు, ఇతరత్రా అంశాల్లో వైసీపీ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకడాన్ని పవన్ పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. ఏపీ సీఎం జగన్‌తో తన అన్న సత్సంబంధాలు నెరపడాన్ని పవన్ గుర్తు చేసినట్టైంది. అయితే తనకే సీఎం జగన్‌తో విభేదాలని చెప్పకనే చెప్పారు.