రెంటికీ చెడ్డ రేవడి అనే సామెత చందాన…జనసేనాని పవన్‌కల్యాణ్ తయారవుతున్నాడా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర విభజన సమయంలో 10 రోజులకు పైగా అన్నపానీయాలు ముట్టలేదని, అంతగా ఆవేదన చెందానని చెప్పారు. అలాగే తెలంగాణలో ఏపీ ప్రజానీకంపై దాడులు జరిగినా జగన్‌కు చీమకుట్టినట్టైనా లేదని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పవన్ ఘాటు విమర్శలు చేశారు.
తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అందుకు పూర్తి విరుద్ధంగా పవన్ మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే తన రోమాలు నిక్కపొడుచుకొస్తున్నాయన్నారు. రెండు దశాబ్దాలు తెలంగాణ కోసం పోరాడుతానని ప్రకటించారు. జన్మనిచ్చిన తెలంగాణకు జై అన్నారు. పోరాట స్ఫూర్తినిచ్చిన తెలంగాణ, అణగారిన తెలంగాణ కోసం అండగా వుంటానన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ, వరంగల్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్‌లో గూండాలు, రౌడీలతో పోరాడుతున్నానని చెప్పారు.
ఇలా తెలంగాణపై విపరీతమైన ప్రేమను ప్రదర్శించడం పవన్‌కే చెల్లింది. పవన్ మాటలు ఎలా వున్నాయంటే… అసలు ఆంధ్రప్రదేశ్ గడ్డ స్ఫూర్తిదాయకమే కాదని చెప్పినట్టుగా వుంది. ఏపీలో పోరాటవీరులు లేరని, అంతా అవకాశవాదులు, స్వార్థపరులు, ఖూనీకోరులు ఉన్నారని చెప్పినట్టుగా వుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కొందరు తెలంగాణ నాయకులు నిత్యం ఆడిపోసుకుంటుంటారు.
దోపిడీదారులని, నరహంతకులని, ఏపీలోని విద్యావంతుల రాకతోనే తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయాయని తిట్టిపోస్తుంటారు. ఏపీపై విషం చిమ్మే నాయకుల విమర్శలకు బలం చేకూర్చేలా పవన్ కామెంట్స్ ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, పవన్ వ్యవహారశైలిని ఏపీ సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. తెలంగాణలో కూడా ఏపీ సమాజాన్ని చులకన చేసేలా మాట్లాడ్డంపై సహజంగానే అక్కడి ప్రజానీకం ఆగ్రహంగా వుంటారు.
ఏపీ సమాజం తన కోపాన్ని బయటికి ప్రదర్శించకపోవచ్చు. కానీ ఎన్నికల్లో తప్పకుండా పవన్‌పై ఆ నెగెటివ్ పని చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే పౌర సమాజం చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్యంలో మహామహులకు గుణపాఠం నేర్పిన చరిత్ర మన సమాజానిది. అలాంటిది పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటానని చెప్పుకుంటున్న పవన్… ఇంత వరకూ కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కలేదు. అలాంటి నాయకుడు ప్రజలతో ఆడుకుంటానంటే, అది అజ్ఞానం తప్ప మరొకటి కాదు.
పవన్‌ను గమ్యంలేని ఆయన రాజకీయ ప్రయాణమే రోజురోజుకూ బలహీనపరుస్తోంది. రానున్న రోజుల్లో పవన్ ఇటు ఏపీకి, అటు తెలంగాణ… రెంటికీ చెడ్డ పొలిటీషియన్‌గా మిగులుతాడనే చర్చకు తెరలేచింది.