తాను ఆశించిన వక్ర రాజకీయ ప్రయోజనాలు తప్ప మరొకటి ఆయనకు అక్కర్లేదు. తన ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆయన నరబలులు ఇవ్వడానికైనా సిద్ధమే. ఇప్పుడు అదే జరుగుతోంది. కేవలం పింఛనుదారులకు ఇళ్ల వద్దకు పెన్షన్లు తీసుకువెళ్లి ఇవ్వకుండా వాలంటీర్లపై నిషేధాజ్ఞలు వచ్చేలా చేయడం ద్వారా చంద్రబాబునాయుడు ప్రజల మీద కక్షసాధిస్తున్నారు.
అసలే రాష్ట్రమంతా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వయసు మళ్లిన వృద్ధులను ఆ పింఛను డబ్బులకోసం ఎండలో నడిపించి సచివాలయాలకు వచ్చేలా చేస్తున్నారు. ఎండదెబ్బకు ముసలి ప్రాణాలు రాలిపోతున్నాయి. ఈ చావులు చూసి అయినా చంద్రబాబు కళ్లు చల్లబడ్డాయో లేదో. అయినా, ఇలా ఎండదెబ్బకు విలవిల్లాడిపోతున్న అవ్వాతాతల ఉసురు నీకు తగలకుండా ఉంటుందా చంద్రబాబూ.. వారి శాపం నీకు తగలకుండా ఉంటుందా.. అది నీకు మంచి చేస్తుందా? అని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత.. పెన్షనర్లు అందరూ ఈ 58 నెలలపాటూ ఆత్మగౌరవంతో బతికారు. వారందరూ డబ్బుకు పేదవాళ్లే కావొచ్చు గానీ.. గట్టిగా చెప్పాలంటే రాజాల్లా బతికారు. ఒకటో తేదీ తెల్లవారే సరికి వాలంటీరు వచ్చి ఇంటి తలుపు తట్టి మరీ పెన్షను డబ్బులు చేతిలో పెట్టి.. ముద్ర వేయించుకుని వెళ్లే పరిస్థితి. అవ్వాతాతల సంక్షేమం, నిరుపేదల సంక్షేమం తన పరమావధి అన్నట్టుగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి.. వారికోసం చేసిన అద్భుతమైన ఏర్పాటే వాలంటీర్ల వ్యవస్థ.
దేశంలో మరెక్కడా లేని విధంగా నిరుపేదలను రాజాల్లాగా ట్రీట్ చేసిన వ్యవస్థ. అయితే జగన్ కారణంగా ఉద్యోగాలు పొందిన వాలంటీర్లు, పేదల సేవలో పనిచేస్తున్న వాలంటీర్లు.. జగన్ పట్ల సానుకూల అభిప్రాయంతో ఉంటారనే అనుమానం చంద్రబాబునాయుడుది. ఆయనలోని విషపుటాలోచనలు చెలరేగాయి. తన చేతికి మట్టి అంటకుండా తన వర్గీయుల్లో ఒకరైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అస్త్రంగా ప్రయోగించాయి. వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షను ఇవ్వడానికి వీల్లేదని ఉత్తర్వులు వచ్చాయి.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల వద్ద పరిస్థితులను గమనిస్తే.. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎన్నెన్ని యాతనలు పడుతున్నారో గమనిస్తే గుండె తరుక్కుపోతోంది. చక్రాల కుర్చీల్లో వస్తున్న వాళ్లు, మనుషుల సాయంతీసుకుని మండే ఎండలో వస్తున్న వారు కనిపిస్తున్నారు. ఓ వృద్ధురాలు ఎండతాకిడికి వడదెబ్బకు ఏకంగా ప్రాణాలే కోల్పోయింది.
ఒకవైపు అందరూ ఇలా ఇబ్బందులు పడుతోంటే.. పెన్షన్లు ఇళ్లవద్దకే ఇవ్వాలంటూ సచివాలయాల వద్ద తెలుగుదేశం కార్యకర్తలు ఆడుతున్న డ్రామా మరొక ఎత్తు. అందుకే.. ఈ దుర్మార్గాలను గమనించిన ప్రజలు మాత్రం.. చంద్రబాబూ.. నీకు ఈ ఉసురు తగలకుండా ఉంటుందా? అని వ్యాఖ్యానిస్తున్నారు.