తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన చేతికి మట్టి అంటకుండా, ఎలాంటి పనైనా ఇతరులతో చేయించాలని అనుకుంటారు. బాబు కుట్రలకి ఎల్లో మీడియా ముద్దుగా చాణక్యం అని పేరు పెట్టింది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను గద్దె దించడం కూడా బాబు చాణక్య నీతిలో భాగమే. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో ఆయన తనయులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్‌ను కూలదోయడంలో ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే కారణమయ్యారు. కానీ అధికారాన్ని మాత్రం హస్తగతం చేసుకుని, టీడీపీని తానే స్థాపించినట్టు, ఇప్పుడు ఆ పార్టీకి వారసుడిగా తన కుమారుడు లోకేశ్ ప్రమోట్ చేసుకుంటున్న తీరు… వారెవ్వా బాబు అనేలా చేసుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే .. కీలకమైన ఎన్నికల సమయంలో ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ఇచ్చి, సక్సెస్ ఫుల్‌గా పని చేయాలని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు వారికి కావాల్సిన వనరుల్ని సమకూరుస్తున్నారు. 66 లక్షల మంది పింఛన్‌దారులకు వలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకునే టాస్క్‌ను తనకెంతో నమ్మకస్తుడు, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు అప్పగించారు. ఈయన గతంలో ఏపీ ఎన్నికల అధికారిగా పని చేశారు.
చంద్రబాబు ఇచ్చిన టాస్క్‌ను విజయవంతంగా నిమ్మగడ్డ పూర్తి చేశారు. అయితే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే చందంగా తయారైంది. ఇప్పుడు నిమ్మగడ్డ ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. పాపం ఆయన్ను తిట్టడం వల్ల ప్రయోజనం లేదు. బాబు ఇచ్చిన పనిని పూర్తి చేశారంతే.
ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి వంతు వచ్చింది. రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరినీ తొలగించడం ఆమెకు బాబు ఇచ్చిన టాస్క్. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుండడం, ఏపీలో ఆ పార్టీకి అధ్యక్షురాలిగా తన వదిన పురందేశ్వరి వుండడాన్ని రాజకీయంగా వాడుకోవాలని బాబు చూస్తున్నారు. అంతేకాదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే వ్యవస్థల సహకారం కోసం. ఏపీలో అరసున్న ఓటు బ్యాంక్ వున్న బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడానికి తానేమైనా పిచ్చోడినా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.
కావున సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రరెడ్డి, నాన్ కేడర్ అధికారులతో సహా 22 మందిని తొలగిస్తేనే ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘానికి పురందేశ్వరి లేఖ రాశారు. ఇప్పటికే ఆమె లేఖలో ప్రస్తావించిన ఆరుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ముగ్గురు కలెక్టర్లను కూడా మార్చింది. మరో వారంలోపు సీఎస్, డీజీపీలను కేంద్ర ఎన్నికల సంఘం మారుస్తుందని ప్రచారం జరుగుతోంది.
మోదీ ప్రభుత్వం చేతిలో వ్యవస్థలు కీలు బొమ్మలు అయ్యాయనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కావున ఇది జరగదని అనుకోడానికి లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే… బీజేపీ చేతుల మీదుగా ఏపీలోని ఉన్నతాధికారులందరినీ లేపేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేయడానికి పురందేశ్వరి సిద్ధంగా ఉన్నారు. మరిది కళ్లల్లో ఆనందం చూడడానికి వదిన గారు తనకిచ్చిన టాస్క్‌ను ఏ మేరకు సక్సెస్ చేస్తారో చూడాలి.