తనది నలభై యేళ్ల అనుభవం అని.. తను విజనరీ అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు .. తన ముందు జగన్ ఒక బచ్చా అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల వేళ జస్ట్ జగన్ పాలనను కొనసాగిస్తానంటున్నారు తప్ప కొత్తగా చెప్పేదీ చేసేదీ ఏమీ లేకుండా పోయింది! ఇన్నాళ్లూ జగన్ పాలనను చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా విమర్శించారు. ఏ విమర్శా సహేతుకమైనవి ఏమీ కావు. ఊరికే అడ్డంగా మాట్లాడేస్తే ఐపోతుందనుకున్నట్టుగా మాట్లాడారు!
తీరా ఎన్నికల సమయానికి వస్తే.. అమ్మ ఒడి డబ్బులు పెంచుతాం, సంక్షేమ పథకాలను ఇంకా భారీ స్థాయిలో అమలు చేస్తాం, వలంటీర్లకు జీతాలు పెంచుతాం.. అంటూ మాట్లాడుతున్నారు! ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్థూలంగా చెబుతున్నది.. ఇప్పుడు తనకో అవకాశం ఇస్తే జగన్ ను అనుసరించి పాలిస్తానంటూ చెప్పుకు తిరుగుతున్నారు!
వలంటరీ వ్యవస్థను తెలుగుదేశం తీవ్రంగా విమర్శించింది. చంద్రబాబు నాయుడే నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. వలంటీర్లు ఉన్నదే వ్యర్థమని తెలుగుదేశం వాళ్లు అనేక రకాలుగా విమర్శించింది. తెలుగుదేశం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్లు, ఆ పార్టీ సానుభూతి పరులు.. వలంటీర్లపై విచక్షణా రహితమైన దాడి చేశారు. ఇప్పటికీ వలంటీర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నట్టుగానే తెలుగుదేశం నేతలు క్షేత్ర స్థాయిలో మాట్లాడుతున్నారు.
ఎన్నికల వేళ వృద్ధాప్య పించన్లను వలంటీర్లు వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వకూడదంటూ చంద్రబాబు అనుంగు ఒకరు కోర్టుకు వెళ్లి అనకున్నది సాధించారు. వృద్ధులకు నరకం చూపించారు మండుటెండలో! అయితే చెప్పేది ఒకటి, చేసేది మరోటి అనేది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విధానాల్లో ఒకటే!
ఇక తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామంటూ ప్రకటించి ఉంటే.. అదీ చంద్రబాబు తను తీసుకొచ్చే మార్పు అయ్యేది! జగన్ కు భిన్నంగా తను మునుపటిలా వలంటీర్ల ఊసు లేకుండా చేస్తానంటూ ప్రకటించి ఉంటే.. ఏదో మార్పు అని చెప్పుకునేందుకు అయినా ఉండేది! అయితే.. తనకు అంత సీన్ లేదని చంద్రబాబు తేల్చి చెప్పుకున్నారు. వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసేంత దృశ్యం లేదని వీరాభిమానులకు కూడా క్లారిటీ ఇచ్చారు!
మరి మొన్నటి వరకూ వలంటీర్లపై జోకులేసిన వారు ఇక వారిని పొగడాలి! ఇక జగన్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలతో జనాలు సోమరులు అయిపోతారనే బ్యాచ్ ఇంకోటి ఉంది. అలాగే జగన్ పథకాల వల్ల ఏపీ దివాళా తీస్తుందని, శ్రీలంక మాదిరి పరిస్థితి అయిపోతుందంటూ కూడా గట్టిగా ప్రచారం చేశారు! జగన్ పరిమితికి మించి అప్పులు చేసేశారంటూ కూడా వాపోయే బ్యాచ్ ఉంది! మరి చంద్రబాబు చెబుతున్న ప్రకారం చూస్తే.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాల స్థాయిని మూడు నాలుగు రెట్లు పెరిగిపోతాయి! జగన్ ఐదు వేలు ఇస్తున్న చోట టీడీపీ హామీ 15 నుంచి 20 వేల వరకూ ఉంది!
మరి అంత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. ఏపీ మరింత వేగంగా దివాళా తీయదా? జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఏపీ పరిస్థితి శ్రీలంక అవుతుందంటున్నారు కదా, చంద్రబాబు చెప్పేవన్నీ అమలు చేస్తే.. ఏపీ పరిస్థితి సోమాలియా కాదా? టీడీపీ వీరాభిమానవర్గం అర్జెంటుగా చేయాల్సిన ప్రచారం గతంలో తాము మాట్లాడిన దానికంత విరుద్ధంగా మాట్లాడటం!
వలంటీర్లను వేస్ట్ అన్నారు, సంక్షేమంతో శ్రీలంక అన్నారు.. అయితే ఇప్పుడు అయితే జగన్ ను అనుసరించడం, లేకపోతే అంతకు మించి అనడం ఇదీ చంద్రబాబు చేస్తున్నది! తనకు అధికారం ఇస్తే తన గత పాలనను తిరిగి తెస్తాననడం కానీ, లేదా జన్మభూమి కమిటీలను తెస్తానంటూ కానీ, జగన్ పాలనకు విరుద్ధంగా వెళ్తానంటూ కానీ చంద్రబాబు పల్లెత్తు మాట మాట్లాడలేకపోతున్నారు! ఇదీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి!