“పవన్ కు మా సాయం అవసరం లేదు. ఆయన ఒంటరిగానే బరిలో నిలుస్తారు. నిజంగా మా వంతు సాయం మేం చేయాలనుకుంటే, పవన్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఆయన ఆదేశించడమే ఆలస్యం రంగంలోకి దూకుతాం. కానీ ఈసారి అంత అవసరం రాకపోవచ్చు.” పవన్-జనసేనకు మద్దతుపై మెగాహీరోలంతా రకరకాలుగా స్పందించారు. అందరి మాటల్లోని కామన్ పాయింట్ ఇదే.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పవన్ కల్యాణ్ కు, ఆయన స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా మెగా హీరోలు బయటకు వస్తారా రారా అనే సందిగ్దత కొన్ని రోజులుగా నెలకొని ఉంది. ఇప్పుడా సస్పెన్స్ కు సగం తెరపడింది. పవన్ కల్యాణ్ కు మెగా మద్దతు లభించింది. స్వయంగా చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించి తన మద్దతు తెలిపారు. పార్టీకి కొంత డబ్బు విరాళంగా కూడా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే..
“అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను.”
ఇలా పవన్ కు ఆర్థికంగా, నైతికంగా మద్దతు పలికారు చిరంజీవి. మెగా మద్దతుతో ఇప్పుడు ఆ కాంపౌండ్ లో హీరోలకు పరోక్షంగా లైన్ క్లియర్ అయినట్టయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలోకి మెగా హీరోలు అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చిరంజీవి మద్దతు దీనికి ఓ కారణమైతే, పవన్ ఆరోగ్యం ఎప్పటికప్పుడు దెబ్బతినడం మరో కారణం.
ఈమధ్య తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు పవన్. వరుసగా 2 కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇలాంటి టైమ్ లో మెగా హీరోలుంటే పవన్ కు చేదోడువాదోడుగా ఉంటుంది. ఆ రోజు త్వరలోనే రాబోతుందనేది విశ్లేషకుల మాట. బన్నీ సంగతి పక్కనపెడితే.. చరణ్, వరుణ్, సాయి దుర్గ తేజ్ లాంటి వాళ్లంతా ప్రచారంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.