వైఎస్సార్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డి టీడీపీ వీడడానికి సిద్ధమయ్యారు. టీడీపీలో చేరడమే ఆలస్యం, అంత కంటే వేగంగా ఆయన రిటర్న్ అవుతున్నారు. కమలాపురం టికెట్‌ను వీరశివ, ప్రొద్దుటూరు సీటును ఆయన తమ్ముడి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి ఆశించారు. అయితే వాళ్లిద్దరికీ చంద్రబాబు మొండిచేయి చూపారు.
మూడేళ్లుగా ప్రొద్దుటూరులో ప్రవీణ్‌రెడ్డి పార్టీకి ఎవరూ దిక్కులేనప్పుడు ఆ పార్టీ జెండాను మోశారు. కానీ ఎన్నికల సమయంలో యాక్టీవ్ అయిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని విమర్శించారు.
కడపలో మాధవీరెడ్డికి కేవలం డబ్బు వుందన్న ఏకైక కారణంతో టికెట్ ఇచ్చారని విమర్శించారు. అలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డికి డబ్బు లేదనే కారణంతోనే కడప సీటు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. లక్ష్మిరెడ్డి మొదటి నుంచి టీడీపీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. తాను మూడు సార్లు కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన గుర్తు చేశారు. కానీ నాలుగు సార్లు ఓడిపోయిన పుత్తా కుటుంబానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారని విమర్శించారు.
ప్రజాదరణ కలిగిన తనకు కాకుండా పుత్తా కుటుంబానికి ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. కడప జిల్లాలో గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచినట్టుగానే, ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని వీరశివారెడ్డి జోస్యం చెప్పడం గమనార్హం. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వీరశివారెడ్డి తెలిపారు.