బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన ఆస్తుల్ని ఎటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ ఈరోజు ప్రకటించింది. ఈ ఆస్తుల విలువ 97.79 కోట్ల రూపాయలు ఉంటుందని సంస్థ ప్రకటించింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ ఆస్తుల్ని తాత్కాలికంగా ఎటాచ్ చేసినట్టు తెలిపిన ఈడీ, ఆ ఆస్తుల వివరాల్ని కూడా వెల్లడించింది. ఎటాచ్ అయిన ఆస్తుల్లో ముంబయిలోని జుహూ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ శిల్పాషెట్టి పేరిట ఉంది. ఇక పూణెలోని నివాస సముదాయం కూడా శిల్పాషెట్టి పేరిట ఉంది. వీటితో పాటు.. కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను ఎటాచ్ చేసినట్టు సంస్థ వెల్లడించింది.
బిట్ కాయిన్ పెట్టుబడి మోసానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈ తాత్కాలిక జప్తు జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అమిత్ భరధ్వాజ్, అజయ్ భరధ్వాజ్, మహేందర్ భరధ్వాజ్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమెటెడ్ అనే సంస్థను ఏర్పాటుచేసారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే నెలకు కనీసం 10శాతం రాబడి వస్తుందని నమ్మబలికారు. చెప్పినట్టుగానే ప్రారంభంలో కొన్నాళ్లు చెల్లింపులు చేశారు, ఆ తర్వాత దుకాణం సర్దేశారు.
దీంతో ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదుచేసింది ఈడీ. 6600 కోట్ల రూపాయల బిట్ కాయిన్లు వీళ్లు సేకరించినట్టు గుర్తించి, అరెస్టులు చేసింది. ముందుగా 2018లో అమిత్, వివేక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నితిన్, నిఖిల్ అనే మరో ఇద్దర్ని గతేడాది అరెస్ట్ చేశారు. కీలకమైన వ్యక్తులు అజయ్, మహేందర్ ను ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు.
ఉక్రెయిన్ లో బిట్ కాయిన్ మైనింగ్ ఫోరమ్ ఏర్పాటుచేయడానికి అమిత్ భరధ్వాజ్ నుంచి 285 బిట్ కాయిన్లు పొందాడు రాజ్ కుంద్రా. వీటి విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు. ఈ కేసుకు సంబంధించి కుంద్రా, శిల్పాశెట్టికి చెందిన దాదాపు 98 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ ఎటాచ్ చేసింది.
రాజ్ కుంద్రా ఇప్పటికే ఓసారి జైలుకు వెళ్లొచ్చాడు. అయితే ఈ కేసుకు సంబంధించి కాదు, అది పోర్నోగ్రఫీ కేసు. అప్పట్లో 2 నెలలు జైళ్లో గడిపి బయటకొచ్చిన కుంద్రా, ఆ తర్వాత తన జైలు జీవితంపై బయోపిక్ కూడా తీశాడు.