జనసేన బీఫామ్ పంపిణీలో సినిమాను తలపించే ట్విస్ట్‌ను పవన్‌కల్యాణ్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్‌కల్యాణ్ పిలిపించారు. వాళ్లందరికీ బీఫామ్‌లు పంపిణీ చేశారు. అభ్యర్థులతో ప్రమాణం కూడా చేయించారు. దీంతో అభ్యర్థులు నామినేషన్లలో మునిగితేలుతున్నారు. అయితే తిరుపతి జనసేన అభ్యర్థికి పంపిణీ చేసిన బీఫామ్ ఉత్తుత్తిదే అని తాజాగా వెలుగు చూసింది.
తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి తదితరులను పిఠాపురానికి పవన్ పిలిపించారు. వీరితో పాటు తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కుమారుడిని కూడా పిఠాపురం రావాలని ఆదేశించారు. వాళ్లందరి చేతుల్లో ఆరణి శ్రీనివాసులుకు సంబంధించి బీఫామ్ పెట్టి, గెలిపించుకుని రావాలని పవన్‌కల్యాణ్ ఆదేశించడం గమనార్హం.
ఒకవేళ ఆరణి శ్రీనివాసులుకు మద్దతుగా సొంత పార్టీ నేతలే చేయలేదని భావిస్తే, వారిని పిలిపించుకుని గట్టి హెచ్చరించో, బుజ్జగించి పంపడం పద్ధతి. అదేంటో గానీ, ఇప్పటికే ఆరణికి పంపిణీ చేశామంటున్న బీఫామ్‌ను రెండోసారి జనసేన నేతలకు అందజేయడం రాజకీయాల్లో పవన్ కొత్త ఒరవడిని నెలకొల్పారనే చర్చకు తెరలేచింది.
ఇప్పటికే పవన్‌కల్యాణ్ తిరుపతికి ప్రత్యేక విమానంలో వెళ్లి కూటమి నేతలందరితో చర్చించి, తిరుపతిలో జనసేన జెండా ఎగురవేసేలా పని చేయాలని హితబోధ చేశారు. అయినప్పటికీ ఇంకా పని చేయలేదని పవన్ అనుకోవడం విచిత్రంగా వుంది. ఈ నేపథ్యంలో 23వ తేదీన తిరుపతి జనసేన అభ్యర్థి నామినేషన్ వేయనున్నారు. ఇక ఫలితం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.