ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా వుండాలని సమాజం కోరుకుంటుంది. రాజకీయాల్లో పరస్పరం కత్తులు దూసుకునే నాయకులు సైతం వ్యక్తిగతంగా బాగుండాలనే ఆకాంక్షిస్తుంటారు. జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే… ఆయన పిఠాపురంలో అడుగు పెడితే చాలు, అనారోగ్యం గురించి జనసేన ప్రకటన విడుదల చేస్తుంది.
పిఠాపురంలో శనివారం ఆయన అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే జనసేన విడుదల చేసిన ప్రకటనలో రికరెంట్ ఇన్సుయం కారణంగా ఉపిరితిత్తుల్లో నెమ్ముజేరి రోజూ ఏదో ఒక సమయంలో జ్వరంతో పవన్‌కల్యాణ్ బాధపడుతున్నట్టు వెల్లడించడం గమనార్హం. పవన్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆ ప్రకటనలో వెల్లడించడం విశేషం.
పిఠాపురానికి, ఆయన అనారోగ్య సమస్యకు ఏదో సంబంధం ఉన్నట్టుంది. రికరెంట్ ఇన్సుయం సమస్య అని జనసేన చెబుతోంది. దీంతో పాటు ఆయనకు మానసిక ఇబ్బందులేవో ఉన్నట్టున్నాయి. మరీ ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్‌ను గెలుస్తానో, లేదో అనే భయం కూడా వెంటాడుతున్నట్టుంది. అందుకే ఆయనకు పిఠాపురంలో అడుగు పెట్టగానే మనసంతా భయం ఆవరించి, ఆయన ఏదోలా అయిపోతున్నారనే అభిప్రాయం లేకపోలేదు.
ఈ ఎన్నికలు జనసేన అధ్యక్షుడు పవన్‌కు రాజకీయంగా చావుబతుకుల సమస్య. ఒకవేళ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక శాశ్వతంగా సినిమాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే జనసేన ఖాళీ అయిపోయింది. ఇక మిగిలిందల్లా కేవలం టికెట్ వచ్చిన నాయకులు మాత్రమే. పొత్తు పెట్టుకుని పార్టీని చేజేతులా సర్వనాశనం చేసుకున్నారనే చర్చకు తెరలేచింది. పవన్ ఆరోగ్యంగా వుండాలంటే, పిఠాపురాన్ని గుర్తు తెచ్చుకోకపోవడం మంచిది. అలాగే పిఠాపురంలో అడుగే పెట్టకపోవడం మరీ మంచిది. పవన్ ఆరోగ్యం ఆయన చేతల్లోనే వుంది. ఇక ఏం చేయాలనేది ఆయన ఇష్టం.