టెక్కలిలో వరసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కావాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చూస్తున్నారు. ఆయన ఇప్పటికి మూడు సార్లు టెక్కలి నుంచి పోటీ చేస్తే గెలిచింది రెండు సార్లు. 1996లో ఉప ఎన్నికల ద్వారా తన అన్న ఎర్రన్నాయుడు వదిలేసిన హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచిన అచ్చెన్నాయుడు 1999, 2004లో కూడా అక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు.
2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో హరిశ్చంద్రపురం మాయం అయింది. దాంతో అచ్చెన్నాయుడు సొంత ఊరు ఉన్న సంతబొమ్మాళి మండలం టెక్కలిలో కలవడంతో ఆయన టెక్కలి నుంచి పోటీ చేశారు. అలా 2009లో టెక్కలి నుంచి రంగంలోకి దిగితే ఓటమి చవి చూశారు. 2014, 2019లలో అచ్చెన్నాయుడుకు మెజారిటీ ఎనిమిది వేల వరకూ మాత్రమే వచ్చింది.
టెక్కలిలో బలమైన కాళింగ సామాజిక వర్గం ఈసారి టెక్కలి సీటులో పాగా వేయాలని చూస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను టెక్కలి లోనే ముగించారు. ఈ సందర్భంగా ఆయన జనాలకు ఇచ్చిన పిలుపు ఏమిటి అంటే టెక్కలిలో అచ్చెన్నను ఈసారి మార్చేయండి అని. అంటే ఆయనను ఓడించి మాజీ ఎమ్మెల్యేను చేయాలని కోరారు.
టెక్కలిలో 2009లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దాంతో వైసీపీ బలం ఇంకా పెరిగింది. ఈసారి అచ్చెన్నను ఓడించాలని వైసీపీ కసిగా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ కి టికెట్ ఇచ్చింది. టెక్కలి వైసీపీలో ప్యాచ్ వర్కులు అన్నీ పూర్తి చేశారు. లోపాలు లేకుండా చూసుకుంటున్నారు.
అచ్చెన్నాయుడు పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత ఈసారి దువ్వాడకు కలసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. సంక్షేమ పధకాలు ప్రతీ గడప చేరాయి కాబట్టి టీడీపీ ఓటు బ్యాంక్ కూడా తమ వైపు తిరుగుతుందని కూడా లెక్క వేసుకుంటున్నారు. టెక్కలిలో అచ్చెన్న వ్యూహాలు చాతుర్యం తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే రాజకీయం అంటే ఎంతటి వారు అయినా ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే. ఎర్రన్నాయుడే 2009లో శ్రీకాకుళం ఎంపీగా ఓటమి పాలు అయ్యారు. అచ్చెన్నాయుడు తన పొలిటికల్ కెరీర్ లో ఒకసారి ఒటమి చూసారు. కాబట్టి ఆయన్ని ఓడించడం అసాధ్యం కాదు అని అంటోంది వైసీపీ.
టెక్కలిలో చూస్తే జగన్ సభకు జనాలు విరగబడి వచ్చారు. మండే ఎండను లెక్క చేయకుండా సీఎం కి స్వాగతం పలికారు. టెక్కలిలో వైసీపీ బలంగా ఉంది. రానున్న రోజులలో ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తే విజయం తధ్యమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.