నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పి.నారాయణపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలను నారాయణ మోసగించారనే ఆయన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకూ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన విజయసాయి… మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతున్నారు.
అది కూడా నిన్నమొన్నటి వరకు ఒకే పార్టీలో సహచర ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో విజయసాయిరెడ్డి ఢీ అంటే ఢీ అని ఫైట్ చేస్తున్నారు. ఇవాళ నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా అన్నారు. వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారని విమర్శించారు.
అత్యంత ధనికుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నాసిరకం పనులు చేసి పరోక్షంగా ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. అలాగే నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ విద్యను వ్యాపారం చేసి, మహిళలను మోసగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ తరపున పెత్తందారులు పోటీ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరులో పుట్టి పెరిగిన పేదవాడైన ఖలీల్ అహ్మద్‌కు టికెట్ ఇచ్చారని ప్రశంసించారు. పెత్తందారులో కావాలో, మీతో కలిసి వుండేవారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నారాయణ నెల్లూరు విడిచిపెట్టి వ్యాపారాలు చేసుకుంటారని ఆయన అన్నారు. తాను మాత్రం నెల్లూరులో స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే వుంటానని విజయసాయిరెడ్డి అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను వెనక్కి తీసుకుంటామని టీడీపీ, బీజేపీ చెప్పాయని ఆయన అన్నారు.