జనసేన పార్టీ ఒక గుర్తింపు లేని పార్టీ. అటువంటి గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తుగా ‘గాజు గ్లాసు’ను ఎన్నికలు సంఘం కేటాయించింది. ఉమ్మడి గుర్తు అంటే ఆ పార్టీ పోటీ చేసే అన్ని నియోజకవర్గాలలో వారి అభ్యర్థులకు అదే గుర్తు ఇవ్వాలనేది నిబంధన. అలాంటప్పుడు ‘ఆ పార్టీ పోటీ చేయని చోట ఆ గుర్తులు ఎవరికీ ఇవ్వకూడదు’ అనేది ఎన్నికల సంఘం నిబంధనల్లో లేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న ‘గాజు గ్లాసు గుర్తు వివాదం’ గురించి మాట్లాడుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక సంగతి ఇది. ఇప్పుడు గ్లాసు ముక్కలు పగిలి కూటమిలోని తెలుగుదేశం భాజపా మిత్రులకు గుచ్చుకుంటున్నాయి, ప్రమాదంగా మారుతున్నాయి.
జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ‘ఫ్రీ సింబల్’గా అందుబాటులో ఉంచినందుకు ఆ గుర్తును ఇతర నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించినందుకు ఉడికిపోయిన జనసేన దానిని రద్దు చేయాలంటూ తాజాగా హైకోర్టులో పిటిషన్ వేసింది.
తమ పార్టీకి కేటాయించిన తర్వాత ఆ గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా ఉంచవద్దంటూ ఎన్నికల సంఘానికి ముందే వినతిపత్రం ఇచ్చామని దానిని ఫ్రీ సింబల్ జాబితాలో తొలగించాలని మరో లేఖ కూడా ఇచ్చామని జనసేన తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. మరోవైపు జనసేన ఇచ్చిన వినతి పత్రం మీద 24 గంటల్లోగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. దరిమిలా బుధవారానికి కేసు వాయిదా పడింది.
అదలా ఉండగా కోర్టుకెళ్ళినంత మాత్రాన జనసేన కోరుకున్నట్టుగా జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ఎందుకంటే ఒకసారి గుర్తుల కేటాయింపు పూర్తి అయిపోయిన తర్వాత ఆ గుర్తును మార్చడం అనేది అసాధ్యమైన విషయాల్లో ఒకటి-అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్న.
ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును రాష్ట్రంలో అనేకమంది ఇండిపెండెంట్ లు తీసుకున్నారు. ఇలా చేయవద్దని బుధవారం హైకోర్టు చెప్పినా కూడా వారి గుర్తులను రద్దు చేయడం వారికి మరో గుర్తును కేటాయించడం అనే ప్రక్రియ గురువారానికి జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆ ఇండిపెండెంట్లు అందరూ కూడా ఇలా నాలుగు రోజుల తర్వాత తమకు గుర్తు మార్చడం అనేది చాలా పెద్ద నష్టాన్ని కలుగజేస్తుందని ఇప్పటికే ఆ గుర్తుతో విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసేసుకున్నామని కాబట్టి గుర్తు మార్పు అనుమతించవద్దంటూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అది కూడా చాలా న్యాయ సమ్మతమైన కోరిక.
ఒకసారి ఇచ్చిన గుర్తును మార్చడం అనేది చాలా కష్ట సాధ్యం. పైగా మేం ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టేసాం అని వారు చెప్పుకుంటారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి హైకోర్టు మళ్లీ వారికి గ్లాసు గుర్తులే ఇచ్చేలా మరో ఆదేశాలను జారీ చేయవచ్చు. ఇలాంటి సంభావ్యతల దృష్ట్యా గ్లాసు ఏనాడైతే ఫ్రీ సింబల్ జాబితాలోకి వచ్చిందో ఆనాడే కూటమి పార్టీల బతుకు బజారున పడిందని వారికి చేటు తప్పదని పలువురు భావిస్తున్నారు.