వైఎస్ షర్మిల మాటలు చాలా తమాషాగా ధ్వనిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమరంలో తలపడుతున్న నాయకులలో పవన్ కళ్యాణ్ అతివాగుడు తర్వాత అంతగా ఆవేశపూరితంగా రెచ్చిపోయి మాట్లాడే మరొక నాయకుడు ఎవరయ్యా అంటే ముందుగా షర్మిల పేరే మనకు జ్ఞప్తికి వస్తుంది.
అలాంటి షర్మిల సదరు ఆవేశపూరిత ప్రసంగాలతో నిజాలు మాట్లాడితే ప్రజలలో నిజంగానే ఒక కొత్త ఆలోచన రేకెత్తించగలుగుతారు. తన పట్ల ప్రజలలో సానుకూలతను పెంచుకోవడం సాధ్యమవుతుంది. అలాగే ఆమె విజయం సాధించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.
కానీ, వైయస్ షర్మిల అలాంటి పని చేయడం లేదు. ఆవేశం తప్పితే ఆమె మాటల్లో ఆలోచన గానీ, వాస్తవంగానీ, నిజాయితీగానీ, చిత్తశుద్ధి గానీ ఏమీ కనిపించడం లేదు పైగా షర్మిల తన ఆరోపణలు మొదలుపెట్టిన నాటి నుంచే ప్రజలలో తన క్రెడిబిలిటీ అని పూర్తిగా కోల్పోయారు.
ఎలాగంటే ఆమె వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనే ఏకైక అంశాన్ని తీసుకుని ఆ ఒక్క మాట మీద అవినాష్ రెడ్డిని, జగన్‌ని ఇరుకునపెట్టేసి రాజకీయ లబ్ధి పొందాలని, తాను ఎంపీగా గెలవాలని ఆశిస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య అనేది 2019 మార్చి లో జరిగింది. అవినాష్ రెడ్డి హంతకుడు అని ఆరోజే షర్మిలలకు తెలిసినట్టే మాట్లాడుతున్నారు. మరి ఆనాడే హంతకుడు ఎవరో తెలిసినప్పుడు షర్మిల ఎందుకు బయటకు ఆ మాట చెప్పలేకపోయారు.
ఇప్పుడు ఆమె ఏ అవినాష్ రెడ్డిని అయితే హంతకుడు.. హంతకుడు అని పదే పదే అంటున్నారో అదే వ్యక్తి కదా ఆనాడు కూడా ఎన్నికలలో పోటీ చేశారు. అదే వ్యక్తిని పార్లమెంటుకు పంపడానికే కదా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ ఎన్నికలలో జగన్ తరఫున రాష్ట్ర వ్యాప్త ప్రచారం నిర్వహిస్తూ జగనన్నను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు వేడికోళ్లు పంపిన షర్మిల ఇప్పుడు ఆ కాంబినేషన్ అలాగే ఉండగా ఒకరు హంతకుడని, మరొకరు హంతకుడికి మద్దతిస్తున్నారని ఆరోపిస్తూ విమర్శలు చేయడం పూర్తిగా అవకాశవాదంలాగా, అబద్ధం లాగా, దుర్మార్గంగా కనిపిస్తోంది.
ఆరోపణలతో ప్రధానంగా తన ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడే ఆమె క్రెడిబిలిటీ పూర్తిగా కోల్పోయారు. తెలంగాణలో తాను తెలంగాణ బిడ్డనంటూ పార్టీని స్థాపించి, నడపడం చేతకాక కాంగ్రెసులో కలిపేసివచ్చి ఏపీలో పిసిసి సారథ్యం తీసుకున్నప్పుడే ఆమె క్రెడిబిలిటీ కోల్పోయారు. అలాంటిది ఇప్పుడు తన క్రెడిబిలిటీ లేని నోటితో కొత్త ఆరోపణలు చేస్తున్నారు.
అక్రమాస్తులకు సంబంధించిన జగన్ మీద కేసులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును నిందితుల జాబితాలోకి స్వయంగా జగన్ చేర్పించారనేది ఆమె తాజా ఆరోపణ. చార్జిషీట్లో నిందితుడిగా పేరు చేర్పించడం అనేది బయటి వ్యక్తులు చేయగలిగే పని కాదు అని అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్న వివరణ. వ్యక్తులు చేసే ఫిర్యాదుల వలన సిబిఐ ఇతరుల పేర్లను నిందితులుగా చేర్చదు. అలా చేర్చేట్లయితే ప్రతి ఒక్కరూ నిందితులే అని అందరూ కలిసి నిరూపిస్తూ చాటి చెబుతూ ఉంటారు.. అని ఆయన వివరణ కూడా ఇస్తున్నారు.
అయితే షర్మిల మాత్రం ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తన అన్న జగన్ ద్రోహం చేశాడు’ అనే ప్రచారం చేస్తే తప్ప కడప ఎంపీగా తన విజయం సాధ్యం కాదని అనుకున్నారో ఏమో తెలియదు గానీ అందుకోసం విచ్చలవిడిగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మరి వీటి ద్వారా ఆమె ఏం సాధిస్తారో ఎప్పటికి సాధిస్తారో.. లేదా, క్రెడిబిలిటీ లేని నేతగా ప్రజలు నమ్మజాలని నేతగా శాశ్వతంగా ముద్రపడి ఇక్కడితో తన రాజకీయ జీవితానికి తానే గోయి తవ్వుకుంటారో వేచి చూడాలి.