ఏపీలో కూటమికి చెప్పుకోడానికి ఒక పథకం వుంది. అదేంటంటే పెన్షన్ల పెంపు. గత ప్రభుత్వం నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందించేది. తాము అధికారంలోకి వస్తే మూడు నెలల అరియర్స్‌తో సహా జూలై 1న రూ.7000 అందిస్తామని చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఎన్నికల్లో ఆయనకు పెన్షనర్ల మద్దతు లభించింది. దీంతో రూ.7 వేల కోసం పింఛన్‌దారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన ఐదు సంతకాల్లో పెన్షన్ల పెంపు ఫైల్ కూడా వుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కీలకమైంది. హామీని నెరవేరస్తామని చెప్పడానికి పెన్షన్ల పంపిణీ పథకం టీడీపీ నేతలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుపై ఇంత వరకూ చంద్రబాబు సర్కార్ ఇంకా ఏమీ చెప్పలేదనే నసుగుడు జనం నుంచి మొదలైంది.
రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని చెప్పడానికి పెన్షన్ల పంపిణీ టీడీపీ నేతలకు ఆయుధంగా మారింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 65 లక్షల పేద కుటుంబాలకు మంచి జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు.
చంద్రబాబు తన హామీని నెరవేర్చారన్నారు. జూలై 1న పెంచిన పెన్షన్ రూ.4 వేలు ఇస్తామన్నారు. ఈ రూ.4 వేలకు మూడు నెలల బకాయి కూడా కలిపి రూ.7 వేలు చొప్పున ఇస్తామని మంత్రి ఆనం తెలిపారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.