సినిమాపై ఇప్పుడు రెండుసార్లు రివ్యూలు జరుగుతున్న రోజులివి. థియేటర్లలోకి వచ్చినప్పుడు ఓసారి, ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరోసారి సమీక్షలు నడుస్తున్నాయి. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంతు వచ్చింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఫెయిలైన సంగతి తెలిసిందే. రిలీజైన 2 వారాలకే ఓటీటీకి ఇచ్చేశారు. థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు, ఓటీటీలో కూడా సేమ్ రిజల్ట్ ఎదురైంది.
ఓటీటీలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసిన నెటిజన్లు మరోసారి మూవీపై విమర్శలు చేస్తున్నారు. సినిమా స్క్రీన్ ప్లేతో పాటు కొన్ని సన్నివేశాల్ని ఏకి పడేస్తున్నారు.
ఫస్టాఫ్ చూసిన తర్వాత ఆపేశానని, అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాలేదని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ పేలవంగా ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
గోదావరి యాసను, తెలంగాణ స్టయిల్ లో విశ్వక్ సేన్ చెబుతున్నాడని కొందరు అభిప్రాయపడితే.. మరీ అంత తీసిపారేసే సినిమా కాదని ఇంకొందరు చెబుతున్నారు. సినిమా ఆసక్తికరంగా సాగలేదని కొందరు అంటుంటే, అంజలి కోసం చూడొచ్చని మరికొందరంటున్నారు.
టైమ్ పాస్ కు కూడా చూడలేకపోయామని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. స్క్రీన్ ప్లేలో లోపాల వల్ల విశ్వక్ సేన్ మంచి హిట్ మిస్సయ్యాడని కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తమ్మీద ఓటీటీలో కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మంచి రెస్పాన్స్ రాలేదు. కృష్ణ చైతన్య డైరక్ట్ చేసిన ఈ మూవీలో నేహ శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. కొన్ని డైలాగ్ క్లిప్స్, విశ్వక్-నేహాశెట్టిపై తీసిన ఓ సాంగ్ క్లిప్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.