కమలం దందాలే అయోధ్య ఓటమికి కారణం

అయోధ్యలో రామాలయం పూర్తయినప్పుడు ఈ దేశంలోని భాజపా వాదులు అందరూ కూడా.. రామాలయం నిర్మాణం అనేది ఈ దేశవాసుల యొక్క అయిదువందల సంవత్సరాల నాటి సుదీర్ఘమైన కల అంటూ విపరీతంగా ఎమోషనల్ ప్రచారం సాగించారు.…

అయోధ్యలో రామాలయం పూర్తయినప్పుడు ఈ దేశంలోని భాజపా వాదులు అందరూ కూడా.. రామాలయం నిర్మాణం అనేది ఈ దేశవాసుల యొక్క అయిదువందల సంవత్సరాల నాటి సుదీర్ఘమైన కల అంటూ విపరీతంగా ఎమోషనల్ ప్రచారం సాగించారు.

అయిదు వందల సంవత్సరాల సుదీర్ఘమైన కల అనేది కేవలం దేశవాసులకు మాత్రమేనా? అయోధ్య ప్రజలకు కాదా? అయోధ్య స్థానిక వాసులకు కూడా రామాలయం మీద అంత మమకారం ఉన్నప్పుడు ఎందుకు అయోధ్యలో బిజెపి ఓడిపోయింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న!

అయోధ్య, ఫైజాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడ మోడీ ఎంతగా ప్రచారం చేసినా.. బిజెపి హడావుడి చేసినా.. రామాలయం ప్రారంభం సమయంలో మోడీ కి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టినా వారు ఓట్లు మాత్రం వేయలేదు. అక్కడ సమాజవాదీ పార్టీ గెలిచింది. అయితే బిజెపి పార్టీ వారి లోకల్ దందాలే ఇక్కడ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అని పలువురు అంటున్నారు. 

అయోధ్యలో రామాలయాన్ని చాలా విశాలమైన స్థలంలో నిర్మించారు. ఇందుకు గాను.. రామాలయ ప్రాంతం ఉన్న పరిసరాల్లోని దుకాణాలు అన్నింటినీ కూలగొట్టించి ఆ స్థలం స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి అప్పట్లో రెండు లక్షల రూపాయల పరిహారం మాత్రం చెల్లించారు. అది కేవలం నామమాత్రపు చెల్లింపుమాత్రమేనని, దుకాణాలు ఇచ్చిన వారందరికీ ఆలయనిర్మాణం పూర్తయిన తర్వాత.. కొత్త దుకాణాలు కేటాయిస్తామని కూడా మాట ఇచ్చారు. ఈ మాటలు నమ్మి.. దుకాణ దారులంతా కేవలం రెండు లక్షలకు తమ దుకాణాలు వదలుకున్నారు. 

తీరా ఆలయం పూర్తయి, కొత్త దుకాణాల కేటాయింపు పర్వం వచ్చేసరికి బిజెపి నాయకలు ఒక్కోదుకానానికి 15 లక్షలనుంచి, 20 లక్షల వరకు తమకు ముడుపు కట్టాలని దందా చేస్తున్నారట. దీంతో అక్కడి దుకాణదారులు, ప్రజలు విసిగిపోయారు. బిజెపి వారి దందాలకు చెక్ పెట్టడానికి ఓటు అస్త్రాన్ని ప్రయోగించారు. బిజెపి అభ్యర్థిని మట్టి కరిపించారు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

దేశవాసుల అందరి కల రామాలయం అంటూ నరేంద్రమోడీ ఆ తురుపు ముక్కను దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. కానీ.. అదే అయోధ్యలో మాత్రం ఓటమి పాలయ్యారు. ఈ వైఫల్యానికి కేవలం వారి దందాలే కారణం అని ఆయన తెలుసుకోవాలి.