విప‌రీత‌మైన క్రికెట్.. విర‌క్తిని పెంచగ‌ల‌దు!

వ‌ర‌స పెట్టి మ్యాచ్ లు, ఒక‌దాని త‌ర్వాత ఇంకోటి రెడీ! నిత్యం సొమ్ము చేసుకోవాలి! ఎక్క‌డైనా గ్యాప్ వ‌స్తే ఏ జ‌ట్టునో, బీ జ‌ట్టునో ఇంకో దేశానికి పంపేసి మ్యాచ్ లు నిరంత‌ర ధారావాహిక‌లా…

వ‌ర‌స పెట్టి మ్యాచ్ లు, ఒక‌దాని త‌ర్వాత ఇంకోటి రెడీ! నిత్యం సొమ్ము చేసుకోవాలి! ఎక్క‌డైనా గ్యాప్ వ‌స్తే ఏ జ‌ట్టునో, బీ జ‌ట్టునో ఇంకో దేశానికి పంపేసి మ్యాచ్ లు నిరంత‌ర ధారావాహిక‌లా కొన‌సాగాలి! బీసీసీఐ, ఐసీసీ తీరు ఇలానే ఉంది! గ‌తంలో ఒక్కోసారి నెల‌, నెల‌న్న‌ర పాటు కూడా ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు లేని రోజులు ఉండేవి అంటే ఈ త‌రం న‌మ్మ‌డం కూడా క‌ష్ట‌మేనేమో! 2007 వ‌ర‌కూ దాదాపు ప‌రిస్థితి అలానే ఉండేది!

ఒక సుదీర్ఘ‌మైన సీరిస్ ఏదైనా జ‌రిగిందంటే.. ఆ త‌ర్వాత నెల‌, నెల‌న్న‌ర పాటు కూడా నో క్రికెట్! స్పోర్ట్స్ పేజీల్లో అప్పుడు క్రికెట్ కాకుండా వేరే క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త ద‌క్కేది! హ‌కీ గురించి రాసే వారు, మ‌రో అథ్లెటిక్స్ గురించి రాసే వాళ్లు, టెన్నిస్, ఫుట్ బాల్.. ఇలా భార‌తీయుల‌కు ఆస‌క్తి త‌క్కువ అయిన క్రీడ‌ల గురించి అప్ప‌ట్లో ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చేవి. ప్ర‌త్యేకించి క్రికెట్ మ్యాచ్ లు లేని స‌మ‌యాల్లో మిగ‌తా క్రీడ‌ల వార్త‌ల‌కు ప‌త్రిక‌లు ప్రాధాన్య‌త‌ను ఇచ్చేవి! అయితే ఆ రోజులు పోయి చాలా కాలం అయ్యింది.

ఎక్క‌డైనా క్రికెట్ గ్యాప్ ఇస్తే క‌దా? మీడియా అయినా ఇత‌ర క్రీడ‌ల గురించి కాస్త చ‌ర్చించ‌డానికి! క్రికెట్ గురించి రాస్తేనే సేల్ అవుతుంద‌నే నిశ్చితాభిప్రాయాలు ఎలాగూ ఉన్నాయి కాబ‌ట్టి.. ఇండియాలో క్రికెట్ ఎలాగూ గ్యాప్ ఇవ్వ‌కుండా అన్నింటినీ తొక్కేస్తూ త‌ను ప్ర‌వ‌ర్ధమానంగా త‌న హ‌వాను కొన‌సాగిస్తూ ఉంది. అయితే నిరంత‌రం ఈ మ్యాచ్ లు కొన‌సాగించ‌డం మాత్రం క్రికెట్ పై విర‌క్తిని పెంచుతోంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు!

ఇప్పుడు ఐసీసీ ఈవెంట్లే వ‌ర‌స పెట్టి జ‌రుగుతూ ఉన్నాయి. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌తి నాలుగేళ్ల‌కూ, ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ను రెండేళ్ల‌కు ఒక‌సారి నిర్వ‌హిస్తూ ఉన్నారు, ఆ పై ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ఇవ‌న్నీ గాక టెస్టు ఛాంపియ‌న్స్ షిప్ ఇవ‌న్నీ ఐసీసీ ఈవెంట్లే! 2000 వ‌ర‌కూ దాదాపుగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఒక్క‌టే పెద్ద ఈవెంట్.

ఐసీసీ నాకౌట్ టోర్నీ అంటూ ఛాంపియ‌న్స్ ట్రోఫీని తెర‌పైకి తెచ్చినా దాని నిర్వ‌హ‌ణ‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా చేసే వాళ్లు ఏమీ కాదు! ఇప్పుడు ఐసీసీ ఈవెంట్ల త‌ర్వాత బీసీసీఐ ఈవెంట్లు స‌రేస‌రి! ఏడాదికి నెల‌న్న‌ర పాటు ఏక‌ధాటి క్రికెట్ ను బీసీసీఐ ఐపీఎల్ రూపంలో స‌మ‌ర్పించుకుంటూ ఉంది! ఆ స‌మ‌యంలో అంత‌ర్జాతీయ క్రికెట్ బంద్ అయిపోయింది.

ఐపీఎల్ హ‌డావుడి ఏకంగా అలా సంవ‌త్స‌రంలో రెండు నెల‌ల పాటు సాగుతూ ఉంది. గ‌తంలో ఏడాదంతా క‌లిపినా రెండు నెల‌ల వ్య‌వ‌ధికి స‌రిపడ క్రికెట్ జ‌రిగేది కాదు, అయితే ఇప్పుడు ఐపీఎల్ రెండు నెల‌ల పాటు సాగుతుంది.

అది ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అంటూ అంత‌ర్జాతీయ క్రికెట్ వేచి చూస్తూ ఉంటుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కూ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు ఆరు నెల‌ల మ‌ధ్య వ్య‌వ‌ధి ఉంటే… అందులో ఏకంగా రెండు నెల‌ల పాటు ఏక‌ధాటి ఐపీఎల్ జ‌రిగింది. అంత‌క‌న్నా ముందు మ‌రి కొన్ని మ్యాచ్ లు జ‌రిగాయి, మ‌ళ్లీ ఇంకో టోర్నీ రెడీగా ఉంది. ప్లేయ‌ర్లు అలిసిపోతార‌నే భ‌యం ఏమీ లేదు! ఎలాగూ రెండు మూడు జ‌ట్ల స్థాయి స‌భ్యులు అందుబాటులో ఉన్నారు. ఎవ‌రు అందుబాటులో ఉంటే వారి చేత ఆడించ‌డం! ఆప‌కుండా మ్యాచ్ లు జ‌రుగుతూ ఉండాలంతే!

మ‌రి ఎంత మ‌ధుర‌మైన‌ది అయినా.. రోజూ పెడితే విర‌క్తే వ‌స్తుంది. క్రికెట్ ఈ ద‌శ‌కు ఎప్పుడో చేరుకుంది! గ‌తంతో పోలిస్తే వీక్ష‌కాద‌ర‌ణ క్ర‌మంగా త‌గ్గుతూ ఉంది. విజ‌యం అయినా, ప‌రాజ‌యం అయినా గ‌తం నాటి భావోద్వేగాలు ఇప్పుడు లేవు! ఏదైనా రెండు మూడు రోజులే. నాలుగో రోజు నుంచి వేరే మ్యాచ్ లు వ‌చ్చేస్తాయి, ఆడేవాళ్ల‌కు, చూసే వాళ్ల‌కూ ఇప్పుడు ఎమోష‌న్ల‌కు తావు లేదు! 2003 ప్రపంచ‌కప్ ఫైన‌ల్లో ఇండియా ఓట‌మి ఆ ఏడాది చివ‌రి వ‌ర‌కూ క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు! 2007లో ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన‌ప్పుడు మ‌ళ్లీ ఆ ఈవెంట్ జ‌రిగే వ‌ర‌కూ ఫైన‌ల్ మ్యాచ్ ఫ్యాన్స్ క‌ళ్ల ముందే ఉంది! అయితే ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు.

గ‌త ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో ఓట‌మి కూడా రోజుల వ్య‌వ‌ధిలో మానిపోయింది, ఐపీఎల్ తో బీసీసీఐ బిజీ అయ్యింది. ఇంత‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ రావ‌డం, గెల‌వ‌డం అంతా అయిపోయింది. ఈ ఏడాదిలోనే ఇంకా సీరిస్ లు ఎదురుచూస్తూ ఉన్నాయి!

అయితే క్రికెట్ కు వీక్ష‌కాద‌ర‌ణ విప‌రీతంగా పెరుగుతోంద‌ని బీసీసీఐ నంబ‌ర్లు చెబుతూ ఉన్నాయి. హాట్ స్టార్ లో వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ను ఏకంగా ఐదు కోట్ల మంది వీక్షించార‌ని… ఇంత‌క‌న్నా వీక్ష‌కాదార‌ణ పెరుగుతోంద‌ని అన‌డానికి రుజువేం కావాల‌నే వాద‌నా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్ర‌తి మ‌నిషి చేతిలోనూ సెల్ ఫోన్ ఉంది.

ఎవ‌రికి వారు త‌మ ఫోన్లో మ్యాచ్ చూసుకుంటారు, ప్ర‌యాణంలో ఉన్నా, మ‌రెక్క‌డ ఉన్నా.. ఇప్పుడు ఒక వ్యూ ఒక మ‌నిషికే ప‌రిమితం! అయితే గ‌తంలో ఒక క్రికెట్ మ్యాచ్ జ‌రిగితే టీవీ ముందు కూర్చుని కొన్ని ప‌దుల మంది చూసే వారు. అప్పుడు క్రికెట్ అంటే ఒక ఎమోష‌న్. ఇప్పుడు వ్యూస్ విప‌రీతంగా రావ‌డంలో బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్ రాయుళ్ల కృషి కూడా అపార‌మైన‌ది! బెట్టింగ్ వ్యామోహం కూడా ఈ వ్యూస్ వెనుక గ‌ట్టి పాత్ర పోషిస్తూ ఉంది.

ఐపీఎల్ అంటే.. న‌గ‌రాల నుంచి ప‌ల్లెల వ‌ర‌కూ బెట్టింగ్ జాత‌రే త‌ప్ప‌, ఇంకో ముచ్చ‌ట లేదు. మ‌రి అలాంటి వ్యామోహాలే అధికంగా క‌నిపిస్తున్నాయి త‌ప్ప‌, గ‌తంలా క్రికెట్ ఇప్పుడు ఎమోష‌న్ కాదు!