బాబును భ్ర‌ష్టు ప‌ట్టించిన అను’కుల’ మీడియా

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై టీడీపీ అను”కుల” మీడియాకు విప‌రీత‌మైన ప్రేమ. బాబును సీఎంగా చూడాల‌ని త‌మ క‌ల‌ను టీడీపీ మీడియా నెర‌వేర్చుకుంది. బాబును ఓ రేంజ్‌లో చూపించాల‌నే అత్యుత్సాహంలో, విచ‌క్ష‌ణ మ‌రిచిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ…

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిపై టీడీపీ అను”కుల” మీడియాకు విప‌రీత‌మైన ప్రేమ. బాబును సీఎంగా చూడాల‌ని త‌మ క‌ల‌ను టీడీపీ మీడియా నెర‌వేర్చుకుంది. బాబును ఓ రేంజ్‌లో చూపించాల‌నే అత్యుత్సాహంలో, విచ‌క్ష‌ణ మ‌రిచిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చంద్ర‌బాబు చొర‌వ చూపారు.

చంద్ర‌బాబు లేఖ రాయ‌డం, ఆ వెంట‌నే రేవంత్‌రెడ్డి సానుకూల స్పందించ‌డం తెలిసిందే. హైద‌రాబాద్ ప్ర‌జాభ‌వ‌న్‌లో ఈ నెల 6న ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్ర‌బాబు, రేవంత్‌రెడ్డి భేటీపై మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం చేశారు. ఈ క్ర‌మంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో భాగం అడుగుతున్నారంటూ టీడీపీ మ‌ద్ద‌తుదారైన మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఈ మీడియాలో ఆంధ్రలో చంద్ర‌బాబుకు, తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డికి మ‌ద్ద‌తు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

రెండు రాష్ట్రాల మ‌ధ్య ప‌దేళ్లుగా అప‌రిష్కృత స‌మ‌స్య‌ల సంగ‌తి ప‌క్క‌న పెడితే, తాజాగా రేవంత్‌రెడ్డి టీటీడీలో భాగం అడుగుతున్నార‌నే ప్ర‌చారాన్ని తెర‌పైకి తేవ‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. తిరుమ‌ల శ్రీ‌వారు అంటే ఓ సెంటిమెంట్‌.  తిరుమ‌ల “మాది” అని ఏపీ స‌మాజం గ‌ర్వంగా చెప్పుకుంటుంది. అలాంటి తిరుమ‌ల‌ను రేవంత్‌రెడ్డితో స్నేహం కార‌ణంగా ఎలా ఇవ్వాల‌ని అనుకుంటున్నారంటూ ఏపీ స‌మాజం ఫైర్ అవుతోంది.

నిన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును స‌మ‌ర్థించిన వారు కూడా, తిరుమ‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి భ‌గ్గుమంటున్నారు. తిరుమ‌ల‌లో భాగం అడ‌గ‌డానికి రేవంత్‌రెడ్డి ఎవ‌రు? అలాగే ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు ఎవ‌ర‌ని సామాన్య ప్ర‌జానీకం సైతం నిలదీస్తున్నారు. ఇద్ద‌రు సీఎంల భేటీలో టీటీడీ అంశం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిందో , రాలేదో అధికారికంగా ఎవ‌రికీ తెలియ‌దు.

కానీ చంద్ర‌బాబు అనుకూల మీడియా అత్యుత్సాహం మాత్రం ఆయ‌న రాజ‌కీయ కొంప ముంచేలా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సున్నిత‌మైన తిరుమ‌ల అంశాన్ని మొర‌టుగా టీడీపీ మీడియా ప్ర‌చారం చేయ‌డం రాజ‌కీయంగా న‌ష్టం తెచ్చింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.