తన కెరీర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో నటిస్తూ వచ్చాడు రజనీకాంత్. ఆ తర్వాత రజనీ డైరెక్ట్ బాలీవుడ్ సినిమాలకు బ్రేకులు పడ్డాయి. కేవలం డబ్బింగులతోనే మార్కెట్ నడిచింది. అనువాద మార్కెట్ తో బాలీవుడ్ నుంచి కూడా రజనీ సినిమాలు వీలైనంతా పిండుకుంటున్నాయి.
గత కొన్నేళ్లలో రోబో, రోబో 2 సినిమాలు హిందీలో మంచి వసూళ్లు సాధించిన రజనీ సినిమాలుగా నిలిచాయి. మిగతా సినిమాలు అంత చెప్పుకునేంత విజయాలను నమోదు చేయలేదు. మరి ఇప్పుడు చాలా యేళ్ల తర్వాత అమితాబ్- రజనీ కాంత్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం ఆసక్తిదయాకంగా మారింది.
ఈ విషయాన్ని స్వయంగా రజనీ అనౌన్స్ చేశారు. 33 సంవత్సరాల తర్వాత తన మెంటర్ అమితాబ్ తో సినిమా చేయబోతున్నట్టుగా రజనీకాంత్ ప్రకటించారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఇది వరకూ జై భీమ్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడితను. ఇప్పుడు రజనీకాంత్, అమితాబ్ కాంబినేషన్ ఈ దర్శకుడితో రిపీట్ అవుతోంది. 33 యేళ్ల కిందట రజనీకాంత్, అమితాబ్, గోవిందా కాంబినేషన్ లో హమ్ సినిమా వచ్చింది.
ఆ సినిమా కథ ఇన్ స్పిరేషన్ తోనే ఆ తర్వాత భాషా సినిమా రూపొందడం గమనార్హం. హమ్ సినిమా షూటింగ్ లో అమితాబ్, గోవింద, రజనీకాంత్ కాంబోలో సీన్ల రూపకల్పనకు దాని దర్శకుడు చాలా కష్టాలు పడ్డాడట! ముగ్గురి కాంబినేషన్లో అనుకున్న కొన్ని సీన్లను అయితే తెరకెక్కించలేకపోయాడట! అలా మల్టీస్టారర్ కష్టాలను ఆ సినిమా ఎదుర్కొంది.
ఆ తర్వాత మళ్లీ అమితాబ్- రజనీకాంత్ కాంబో అయితే రిపీట్ కాలేదు. దాదాపు మూడున్నర దశాబ్దం తర్వాత ఇప్పుడు జై భీమ్ దర్శకుడు ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయగలుగుతున్నట్టుగా ఉన్నాడు.