“ఏపీలో రాక్షస పాలన…త్వరలో జనంలోకి వస్తాః బాలకృష్ణ” శీర్షిక చూడగానే …అబ్బో విషయం ఏదో చాలానే ఉన్నట్టుందే అనే అభిప్రాయం కలిగింది. బాలయ్య సార్ పొలిటీషియన్‌గా కంటే కూడా ఆయన సినీ అగ్రహీరో కావడంతో, మ్యాటర్ ఏంటో తెలుసుకుందామనే కుతూహలం కలిగింది.
ఏపీ సర్కార్‌పై సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారనే మొదటి వాక్యం చదవగానే… ఫర్వాలేదే సార్‌కు రాజకీయాలు మాట్లాడ్డం కూడా తెలుసే అనే ప్రశంస. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, మన దురదృష్టమని వాపోయినట్టు రెండో వాక్యం చదవగానే అయ్యో…పాపం అనే జాలి కలిగింది.
ఆ తర్వాత వాక్యంలోకి వెళ్లగానే ఎవరికైనా ఒళ్లంతా కోపం రాక మానదు. నెల్లూరు జిల్లా నాయకులతో ఆదివారం ఫోన్లో మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారనేది ఆ వార్త సారాంశం. పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని బాలయ్య ఫోన్లో నిర్వహించారట.
ఈ సందర్భంగా కావలి మండలం రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫోన్‌తో కార్యకర్తలు, అభిమానులతో బాలయ్య మాట్లాడారట! కార్యకర్తలు, అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని సినిమా డైలాగ్‌లు చెప్పారాయన.
ఎవరికి ఇబ్బంది వచ్చినా సహించనని ఆయన ఫోన్లో హెచ్చరించి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్లమీదకి వస్తానని, ప్రజలందర్నీ కలుసుకుంటానని చెప్పి ముగించారాయన. ఏదో విధంగా మీడియాలో కనిపించాలనే యావ తప్ప.,.. మరో ఉద్దేశం ఏదీ అందులో కనిపించదు.
ఫోన్ సంబరానికి ఇంత బిల్డప్ ఎందుకు బాలయ్యా? అనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా షూటింగ్ అయిపోయేదెన్నడు? ఆయన జనంలోకి వచ్చేదెన్నడు? ఈ నెల 21తో పంచాయతీ ఎన్నికల ప్రక్రిమ ముగుస్తుంది.
ఎన్నికల సందర్భంగా జనంలోకి వచ్చి కార్యకర్తలకు భరోసా ఇస్తే ఓ అర్థముంది. అలా కాకుండా తనకు తీరిక దొరికినప్పుడు రోడ్డు మీదకి వస్తానని బాలయ్య చెప్పడం విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.