దేశంలో చట్ట సభలలో ప్రమాణాలు దిగజారాయి. విలువలు తగ్గిపోయాయి. సభ్యులు బజారు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. చట్ట సభల సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయన్న సోయి కూడా లేకుండా పోయింది.
భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్‌ను హోం మంత్రి అమిత్ షా అవమానించారంటూ ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించగా, ఆయన అంబేడ్కర్‌ను ఏమీ అనలేదని, అనవసర ఆరోపణలు చేస్తున్నారని అధికార ఎన్డీయే ఎంపీలు ప్రబలంగా ప్రతిస్పందించారు.
చివరకు ఈ వివాదం రణరంగంగా మారింది. ఒకరిపై ఒకరు తోసుకోవడం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ తోసేయడంతో తమ ఎంపీ గాయపడ్డారని ఎన్డీయే ఆరోపించగా, ఎన్డీయే ఎంపీల కారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాయపడ్డారని ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు.
రాహుల్ గాంధీపై హత్యా యత్నం కేసు కూడా నమోదైంది. రెండు కూటముల ఎంపీలు పరస్పరం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. పార్లమెంటు చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. ప్రధాన నేతలతో కూడిన ఈ కూటముల ప్రవర్తన దిగజారిన స్థాయిని ప్రతిబింబిస్తుంది.
ఇక తెలంగాణా అసెంబ్లీలో జరిగిన మరో ఘటన కూడా ఇలాంటి పరిస్థితులనే చూపించింది. శుక్రవారం అసెంబ్లీ రణరంగంగా మారింది. దీనికి మూలం కేటీఆర్‌పై కేసు నమోదు కావడం. సభ ప్రారంభమైన వెంటనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. నల్ల బ్యాడ్జీలతో సభకు వచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న కారణంగా కేటీఆర్‌పై కేసు పెట్టారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్ష సభ్యులు ఒక ఎమ్మెల్యే చెప్పు చూపించాడని ఆరోపించగా, ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.
సభలో గందరగోళం, తోపులాటలు చోటుచేసుకున్నాయి. సభ్యులు ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసరడం, పేపర్లు చించటం వంటి దృశ్యాలు కనిపించాయి. ఎంతటి జటిలమైన సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సభల్లో ఇలాంటి ప్రవర్తన సిగ్గుచేటు.
చట్ట సభల గౌరవాన్ని, మర్యాదను, హుందాతనాన్ని సభ్యులు ఇలా బజారుకీడుస్తున్నారు. ప్రజలు ఎన్నుకుంటున్న ఈ నాయకులు సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, గొడవల ద్వారా కాదు. చట్ట సభల పరిరక్షణకు నైతికత, విలువలు అనుసరించాల్సిన అవసరం ఉంది.
రాచరికం కొ యధారాజ తథాప్రజ.. ప్రజాస్వామ్యం లో యధాప్రజ తథారాజ…
రౌడీ లని ఎన్నుకొని పార్లీమెంట్ కి పంపితే ఇదే జరుగుతుంది జరిగేది