ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో బలం పెంచుకోవడానికి జనసేన చూస్తోంది. టీడీపీతో జట్టు కట్టి బీజేపీని కూడా చేర్చి కూటమిగా 2019లో జనసేన 21 సీట్లకు పోటీ చేసి కొన్ని విజయాలు సాధించింది. అయితే, అధికారంలోకి వచ్చాక సొంతంగా బలపడాలన్న ఆలోచన జనసేనలో ఉంది. జనసేన తన విస్తరణకు ఎక్కడ అవకాశం ఉందో చూసుకుంటూ, ఆ దిశగా మెల్లగా అడుగులు వేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మన్యం ప్రజలు, గిరిజనుల మీద మొదటి నుంచి ప్రత్యేక దృష్టి ఉంది. 2018లో ఆయన ప్రజాపోరాట యాత్ర చేసినప్పుడు ఎక్కువగా మన్యం ప్రాంతాలలోనే పర్యటించారు.

మన్యంలో జనసేనకు ఇతర పార్టీలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో మంచి ఓట్లు వచ్చాయి. 2024లో ఏజెన్సీలోని పాలకొండ సీటును పొత్తు భాగంగా తీసుకుని గెలిచి, మన్యం ప్రాంతంలో తొలిసారి జెండా పాతిన జనసేన, ఇప్పుడు అక్కడ మరింత ఎదగాలన్న కాంక్షతో ఉన్నట్లు కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏజెన్సీ బాట పట్టారు. పట్టుబట్టి వాన కురుస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. అల్లూరి జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. గిరిజనులతో మమేకం అయ్యి ధింసా నృత్యం చేస్తూ, తాను వారికి అండగా ఉంటానని మాట ఇచ్చారు.

గిరిసీమలకు రోడ్లు వేస్తామని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. తాను ఇక మీదట ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి, వారి సమస్యలను తెలుసుకుని పూర్తిగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. పవన్ ఆలోచనలు చూస్తే, ఆయనకు ఈ ప్రాంతం మీద మక్కువ మాత్రమే కాకుండా వారిని అక్కున చేర్చుకుని, ఆ దిశగా జనసేన జెండాను మరింత చేరువ చేయాలన్న సంకల్పం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే, మన్యం వాసులు ఎవరినైనా ఆదరిస్తారు. వారి కోసం తపన పడే వారిని గుండెల్లో పెట్టుకుంటారు. ఏజెన్సీలో మొదట కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీకి పట్టు ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రాంతంలోకి వెళ్లి, జనసేనను పటిష్ఠం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయన వరుసగా అక్కడ పర్యటనలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, గాజు గ్లాస్‌తో గిరిజనులు కనెక్ట్ కావడం విశేషం కాదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే, వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

3 Replies to “ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!”

  1. కోస్తాలో అయన హిందూ sc లను ఆకర్షించే విధంగా కూడా ప్లాన్ చేస్తే వైసీపీ మూత పడటం జనసేన టీడీపీ ప్రధాన పక్షాలుగా ఉంటాయి

Comments are closed.