సాధారణంగా విజయవంతమైన జట్లలో మార్పు చేర్పులు పెద్దగా ఉండవు. అది కూడా గొప్ప విజయాలు సాధించిన జట్టును వెంటనే మార్చేందుకు ఏ యాజమాన్యం రెడీ కాదు! అయితే టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాలను సాధించిన టీమిండియాకు సంబంధించి తదుపరి సీరిస్ కే బోలెడన్ని మార్పులు జరిగేలా ఉండటం గమనార్హం.
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించి, గబ్బా టెస్టులో అనితర సాధ్యమైన విజయాన్ని సాధించిన ప్లేయర్లకు స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగే తొలి టెస్టులో కనీసం సగం మందికి కూడా స్థానం దక్కేలా లేకపోవడం గమనార్హం.
శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు సంబంధించి.. ప్రాబబుల్స్ లో వినిపిస్తున్న పేర్లు పాతవే అయినా, ఇప్పుడు మాత్రం కొత్తవి. ఆస్ట్రేలియాలో బాగా రాణించిన సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లు ఇంగ్లండ్ తో తొలి టెస్టుకు స్థానం దక్కడం కష్టమే అంటున్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్, సైనీ ల పరిస్థితి అంతేనట!
ఆస్ట్రేలియాతో సీరిస్ ఆడిన వాళ్లలో ఇప్పుడు కచ్చితంగా స్థానం దక్కుతున్నది రహనే, పుజారా, అశ్విన్ లకు మాత్రమేనట. పంత్ కూడా డౌటే అంటున్నారు. పంత్ కన్నా సాహాకే వికెట్ కీపర్ గా ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి.
పంత్ ను తీసుకున్నా.. స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ హోదాలో తీసుకోవచ్చంటున్నారు. కొన్ని దశాబ్దాల పాటు స్పెషలిస్ట్ కీపర్ లేక సతమతమైన టీమిండియా.. టెస్టుల్లో ఒకే మ్యాచ్ లో ఇద్దరు స్పెషలిస్ట్ కీపర్లతో ఆడితే అది సాధించిన గొప్ప మార్పే అవుతుంది! వన్డేల్లో, టీ20ల్లో అయితే ధోనీ, కార్తీక్ ల రూపంలో అనేక మ్యాచ్ లలో ఇద్దరు స్పెషలిస్టు కీపర్లు ఫైనల్ 11లో ఆడారు. ఇప్పుడు టెస్టుల వంతు వచ్చేలా ఉంది.
ఇక ఆస్ట్రేలియాతో టెస్టు సీరిస్ కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాంత్ కు ఇంగ్లండ్ తో మాత్రం అవకాశం దక్కడం ఖాయమని అంచనా. బుమ్రా, ఇషాంత్ లు పేస్ అటాక్ లో ఉంటారని, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా రంగంలోకి దిగవచ్చంటున్నారు. అశ్విన్ కు తోడు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉంటారట. మరి వాషింగ్టన్ సుందర్ పరిస్థితి ఏమిటంటే.. ఆసీస్ లో తొలి టెస్టులోనే అద్భుతంగా రాణించినప్పటికి ఇప్పటి లెక్కల ప్రకారం.. సుందర్ కన్నా అక్షర్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కు అవకాశం ఇవ్వాలనే లెక్కలతో అక్షర్ తీసుకుంటున్నారట. అలాంటప్పుడు కుల్దీప్ ను ఎందుకు తీసుకుంటున్నట్టు? బ‌్యాటింగ్ కూడా చేయగల సుందర్ కు కుల్దీప్ స్థానంలో అయినా ఛాన్స్ ఇవ్వొచ్చు కదా.. అనే సగటు అభిమాని ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు.
మొత్తానికి టీమిండియా ఫైనల్ 11 ఎంపికకు ఇప్పుడు ఛాయిస్ లు బాగా పెరిగినట్టున్నాయి. మూడు అంతర్జాతీయ జట్లకు తగిన స్థాయిలో ప్రతిభావంతమైన ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చిన వైనం స్పష్టం అవుతోంది. విజయాలు పూర్తి అలవాటుగా మారడమే జరగాలిక.