జగన్ పై ఇష్టమొచ్చినట్టు వాగుతున్నారు. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వీళ్లకు ఏం అర్హత ఉంది? లోకేష్ ఏమైనా ఎమ్మెల్యేనా? పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి గెలిచారు? అసలు లోకేష్ రాజకీయ అనుభవం ఏంటి? పవన్ కు కనీసం క్షేత్రస్థాయి రాజకీయాలైనా తెలుసా? మరి వీళ్లిద్దరు ఏం చూసుకొని జగన్ పై ఈ రేంజ్ లో వాగుతున్నారు. వీళ్లకు ఎందుకు ఎల్లో మీడియా ఇంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీలో సగటు ఓటరు ఆవేదన.
దేనికైనా సమఉజ్జీ ఉండాలంటారు. జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తే దానికో అర్థం ఉంది. ఆయన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్. కనీసం అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గోరంట్ల లాంటి వాళ్లు విమర్శలు చేసినా ఓ అర్థం ఉంది. ఎందుకంటే, వాళ్లంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. శాసనసభలో ప్రజాప్రతినిధులుగా అడుగుపెట్టారు.
మరి లోకేష్, పవన్ కు ఏం అర్హత ఉంది? కనీసం జిల్లా స్థాయిలోనైనా వీళ్లు గెలిచారా? పైపెచ్చు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయారు. శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నమాట. మరి వీళ్ల కామెంట్స్ ను ఎల్లో మీడియా ఎందుకు హైలెట్ చేస్తోంది?
భ్రమల్లోకి నెడుతున్న ఎల్లో మీడియా
తెలుగుదేశం పార్టీకి లోకేష్ ను పెద్ద దిక్కుగా చేసేందుకు ఎల్లో మీడియా పన్నుతున్న కుట్ర ఇది. జగన్ పై రోజుకో విమర్శ చేయించి, పంచాయతీ స్థాయి కూడా లేని లోకేష్ ను రాష్ట్ర స్థాయి నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా తెగ కష్టపడుతున్నారు. పిల్లికి పులిచారలు వేయించి సింహాసనంపై కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పవన్ కల్యాణ్ విషయానికొస్తే..
ప్రస్తుతం ఎల్లోమీడియా ఎజెండా ఒక్కటే. జగన్ పై విమర్శలు చేస్తే ప్రతి ఒక్కరు వీళ్లకు ఆప్తులే. అలా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఎల్లోమీడియాకు ఆప్తమిత్రుడు అయిపోయాడు. ఒకప్పుడు ఇదే పవన్ వ్యక్తిత్వంపై రాళ్లువేసిన ఈ ఎల్లో మీడియా, ఇప్పుడు అదే పవన్ పల్లకీ మోస్తోంది. దానికి కారణం పవన్, జగన్ ను తిట్టడమే.
ఈ సంగతి పక్కనపెడితే.. లోకేష్ లానే పవన్ కు కూడా ఎలాంటి అర్హత లేదు. కాకపోతే లోకేష్ మీద కొంచెం బెటర్. పవన్ బయటకొస్తే కనీసం చూడ్డానికి కొంతమంది జనాలైనా వస్తారు. అది చూసుకొని విర్రవీగుతున్నారు జనసేన అధ్యక్షుడు. అంతకుమించి అతడికి జగన్ పై ఆరోపణలు చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన పరాజిత నాయకుడతడు.
గెలిచి విమర్శలు చేస్తే బాగుంటుంది
ఇలాంటి వ్యక్తుల్ని ఎల్లో మీడియా ఆకాశానికెత్తేస్తోంది. జగన్ పై వీళ్లు విమర్శలు చేస్తే హెడ్ లైన్స్ పెడుతోంది. పత్రికల్లో బ్యానర్లు కడుతోంది. కనీసం వీళ్ల స్థాయి ఏంటనేది కూడా ఆలోచించడం లేదు. పచ్చ మీడియా భ్రమల్లో బతుకుతూ, తమనుతాము రాష్ట్ర స్థాయి నాయకులుగా అంచనా వేసుకుంటున్న ఈ ఇద్దరు నేతలు ముందుగా తమ స్థాయి తెలుసుకుంటే మంచిది.
కనీసం ఎమ్మెల్యేగా గెలిచి తమనుతాము నిరూపించుకొని, అప్పుడు జగన్ పై విమర్శలు చేస్తే దానికో విలువ, అర్థం ఉంటుంది. లేకపోతే గ్రామాల్లో గట్టుపై కూర్చొని కామెంట్స్ చేసే సోమలింగానికి, ఎల్లో మీడియాలో గొంతు చించుకుంటున్న పవన్-లోకేష్ కు పెద్ద తేడా ఉండదు.
ముందుగా మేల్కోవాల్సింది ప్రజలే
ఈ విషయంలో ఎల్లో మీడియాది, లోకేష్-పవన్ ది ఎలాంటి తప్పు లేదు. వాళ్ల ఆక్రోషం వాళ్లది. ఇక్కడ మేల్కోవాల్సింది ప్రజలు మాత్రమే. ప్రభుత్వం ఏం చేస్తోంది.. దానికి ఎల్లో మీడియా ఎలాంటి వక్రభాష్యాలు చెబుతోంది.. ఎలాంటి వ్యక్తులు జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు లాంటి విషయాల్ని ప్రజలే బేరీజు వేసుకోవాలి. సొంతంగా ఆలోచించాలి.