ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ప్రక్రియ రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది. పాత కేబినెట్లోని మంత్రుల్లో దాదాపు 8 నుంచి 10 మంది వరకూ తిరిగి కొనసాగించాలని నిర్ణయించడంతో కొత్తగా దక్కేది 14 నుంచి 17 మందికే అని తేలిపోయింది. మరోవైపు ఆశావహులు పదింతలు ఉండడంతో సహజంగానే జగన్ నిర్ణయంపై సర్వత్రా టెన్షన్ నెలకొంది.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంత రించుకుంది. మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సజ్జల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎంతో భేటీ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ నూతన కేబినెట్ కూర్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారన్నారు.
పాత, కొత్త కలయికతో కేబినెట్ ఉంటుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ కేబినెట్ కూర్పుపై కసరత్తు వుంటుందని సజ్జల చెప్పడం గమనార్హం. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై సీఎం జగన్ ఇంకా పూర్తిస్థాయిలో ఒక నిర్ణయానికి రాలేదని స్పష్టమైంది.
కేబినెట్లో బీసీలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని సజ్జల చెప్పడంతో, ఎంత మందికి? ఎవరెవరికి ఇస్తారనే చర్చకు తెరలేచింది. గతంలో బీసీలు ఏడుగురికి, మహిళలు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఈ దఫా సముచిత స్థానం ఇస్తారని ప్రభుత్వ సలహాదారు చెప్పిన నేపథ్యంలో బీసీలకు కనీసం 10, మహిళలకు కనీసం ఐదుగురికి తక్కువ కాకుండా కేబినెట్లో స్థానం కల్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.