అమాత్య రేస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎలిమినేషన్ జరిగింది. కొత్త కేబినెట్ కొలువుదీరనున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే తమకు పదవి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందని విస్తృత ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చెవిరెడ్డి సన్నిహితంగా మెలగడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
గత రెండు రోజులుగా చెవిరెడ్డి విజయవాడలో మకాం వేసి అమాత్య పదవి కోసం ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమైందని ఆయన అనుచరులు నమ్మకంగా చెబుతూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ కోసం పని చేయాలని జగన్ ఆదేశించారనే ప్రచారం జరగడం, ఆయన ప్లేస్‌లో చెవిరెడ్డికి తప్పక పదవి వస్తుందని రాష్ట్రమంతా అనుకున్నారు.
అయితే ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. పాత కేబినెట్‌లోని పలువురు సీనియర్ మంత్రులను కొనసాగించాలని నిర్ణయించడంతో చెవిరెడ్డి ఆశలు సన్నగిల్లాయి. తిరిగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరపైకి వచ్చారు. పెద్దిరెడ్డిని కొనసాగిస్తారనే ప్రచారం జరగడంతో చెవిరెడ్డికి మంత్రి పదవి చేజారిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ … తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని మరో రెండేళ్లపాటు కొనసాగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు రెండు రోజుల ముందు ఈ పరిణామం చెవిరెడ్డికి, ఆయన అనుచరులకు నిరుత్సాహం కలిగించేదే.