మ‌లయాళీ సూప‌ర్ హిట్, తెలుగు, హిందీల్లో డిజాస్ట‌ర్!

దేవా పేరుతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడినే తీసుకెళ్లి తీశారు! అయితే బాక్సాఫీస్ ఫ‌లితం మాత్రం డిజాస్ట‌ర్ గా తేలిపోయింది!

మ‌ల‌యాళీ సినిమాల‌కు ఓటీటీలో గిరాకీని చూసి.. పాత మ‌ల‌యాళీ సినిమాల‌ను రీమేక్ చేస్తే వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే ఫార్ములాను కూడా కొంద‌రు ఫాలో అవుతూ ఉన్నారు. ఈ త‌ర‌హాలో ఒక మ‌ల‌యాళీ సినిమాను తెలుగు వాళ్లు రీమేక్ చేసి ఇప్ప‌టికే చేతులు కాల్చుకోగా.. ఆ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా హిందీ జ‌నాలూ అదే ప‌ని చేసి డిజాస్ట‌ర్ ను మూట‌గ‌ట్టుకున్నారు!

దాదాపు పుష్క‌ర‌కాలం కింద‌ట మ‌ల‌యాళంలో ఒక కాప్ థ్రిల్ల‌ర్ వ‌చ్చింది. అదే ముంబై పోలిస్. 2013లో పృథ్విరాజ్ హీరోగా ఈ సినిమా రూపొందింది. థ్రిల్ల‌ర్ అంటే, ఒక రేంజ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ఏమీ కాదు. ఒక కేసు ఇన్వెస్టిగేష‌న్ లో పురోగ‌తి సాధించిన ఒక పోలీసాఫీస‌ర్, ఆ కేసు ఒక కొలిక్కి వ‌చ్చాకా యాక్సిడెంట్ కు గుర‌వుతాడు. గ‌తాన్ని అంతా మ‌రిచిపోకుండా.. ఆ కేసులో త‌ను సాధించిన పురోగ‌తి ఒక్క‌టీ మ‌రిచిపోతాడు! దీంతో త‌ను సాధించింది ఏమిటో అత‌డు తిరిగి ఇన్వెస్టిగేష‌న్ చేయాల్సి వ‌స్తుంది, ఇలా స్క్రిప్ట్ ప‌రంగా లిబ‌రేష‌న్ తీసేసుకుని కాస్త విన్యాసాలు చేస్తుంది ఈ సినిమా. ఇక క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ ఆ కాలంలో మ‌ల‌యాళీల‌కు భిన్నంగా అనిపించి హిట్ చేసిన‌ట్టుగా ఉన్నారు!

అప్ప‌టికి పృథ్విరాజ్ ఇమేజ్ ప‌రిమితం. అలాగే అలాంటి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లు మ‌ల‌యాళీ హీరోలు చేస్తే చెల్లుతాయి కానీ ఇత‌రుల‌కు అవి అంత న‌ప్ప‌వేమో కూడా! అది తెలుగులో రుజువు అయ్యింది కొన్నాళ్ల కింద‌ట‌. ఆ మ‌ల‌యాళీ ముంబ‌యి పోలిస్ ను తెలుగులో హంట్ పేరిట రెండేళ్ల సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఆ సినిమా ఒక‌టి వ‌చ్చి వెళ్లింద‌ని కూడా చాలా మందికి తెలియ‌ని రీతిలో అది డిజాస్ట‌ర్ అయ్యింది. మ‌ల‌యాళీ వెర్షన్ ను ఐదు కోట్ల‌తో తీసి ఆ బ‌డ్జెట్ స్థాయికి మంచి హిట్ కొట్టారు. తెలుగు వెర్ష‌న్ ను 14 కోట్ల‌తో తీస్తే, రెండు కోట్ల రూపాయ‌లు కూడా రాలేద‌ట థియేట‌రిక‌ల్ రిలీజ్ తో. ఈ సబ్జెక్ట్ హిందీ వెర్ష‌న్ ప‌రిస్థితి తీసిపోలేదు.

ఇప్ప‌ట్లో హిందీ సినిమా అంటే, అందులో షాహిద్ క‌పూర్ హీరో అంటే బ‌డ్జెట్ వంద కోట్ల‌కు ఏమీ త‌క్కువై ఉండ‌దు. అయితే అందులో స‌గం స్థాయి క‌లెక్ష‌న్లను కూడా ఆ సినిమా సాధించ‌లేదు! దేవా పేరుతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడినే తీసుకెళ్లి తీశారు! అయితే బాక్సాఫీస్ ఫ‌లితం మాత్రం డిజాస్ట‌ర్ గా తేలిపోయింది! ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుద‌లకు సిద్ధం అయ్యింది. ఆల్రెడీ మ‌ల‌యాళీ, తెలుగు వెర్ష‌న్లు ఓటీటీలో ఉన్నాయి. ఇప్పుడు హిందీ వెర్ష‌న్ వాటికి తోడు కాబోతోంది!

మ‌ల‌యాళీ సినిమాల‌ను అలానే చూడాలి త‌ప్ప‌, రీమేక్ లు చేస్తే.. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితాలు మాత్రం అంత చెప్పుకోద‌గ్గ‌గా ఉండ‌టం అరుదుగా జ‌రిగే ప‌ని అని మ‌రో సినిమా రుజువు చేసింది. ఆఖ‌రికి దృశ్యం రీమేక్ లు కూడా.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయాయి. తెలుగు దృశ్యం కూడా ప్ర‌శంస‌లే అందుకున్నా.. మూడో రోజుకే ఆ సినిమా థియేట‌ర్ల వ‌ద్ద జ‌నాలు లేరు అప్ప‌ట్లో! హిందీ దృశ్యం కూడా క‌మ‌ర్షియ‌ల్ గా తొలి వారంలో చెప్పుకోద‌గిన వ‌సూళ్లేమీ పొంద‌లేదు. ఆ త‌ర్వాత దృశ్యం సీక్వెల్స్ కూడా రీమేక్ అయ్యాయంటే.. అవ‌న్నీ వేరే లెక్క‌! ఓటీటీ మార్కెట్ టార్గెట్ గా అవి విడుద‌ల అయ్యాయి.

One Reply to “మ‌లయాళీ సూప‌ర్ హిట్, తెలుగు, హిందీల్లో డిజాస్ట‌ర్!”

Comments are closed.