డీకేశి, శశిథ‌రూర్.. కాంగ్రెస్ నేత‌ల‌పై క‌మ‌లం కన్నా!

కేర‌ళ‌లో కాంగ్రెస్ ప‌రిణామాల‌పై శ‌శిథ‌రూర్ చేసిన కామెంట్ల‌తో వ్య‌వ‌హారం ఊపందుకుంది.

మొన్న‌టి వ‌ర‌కే కాదు, ఇప్పుడు కూడా అదిగో ఇదిగో డీకే శివ‌కుమార్ వ‌చ్చి క‌మ‌లం పార్టీతో క‌ల‌వ‌బోతున్నాడు అనే టాక్ ఒక‌టి నిత్యం కొన‌సాగుతూనే ఉంటుంది! దీనిపై డీకేశి ని మీడియా అడ‌గ‌ని రోజంటూ ఉండ‌దు, ఈ ఊహాగానం ఎన్న‌టికీ ఆగ‌దు కూడా!

ఇప్పుడు సౌత్ లో మ‌రో కాంగ్రెస్ నేత విష‌యంలో సేమ్ ప్ర‌చారం మొద‌లైంది, అదే శ‌శిథ‌రూర్ విష‌యంలో. కేర‌ళ‌లో కాంగ్రెస్ ప‌రిణామాల‌పై శ‌శిథ‌రూర్ చేసిన కామెంట్ల‌తో వ్య‌వ‌హారం ఊపందుకుంది. మ‌ల‌యాళీ గ‌డ్డ‌పై కాంగ్రెస్ లో నాయ‌క‌త్వ లోపం ఉంద‌ని, వ్యాక్యూమ్ ఉందంటూ శ‌శి ఇటీవ‌ల కామెంట్లు చేశారు. దాన్ని ఫిల్ చేయాల‌ని, ఈ విష‌యంపై అధిష్టానం దృష్టి సారించాల‌ని, నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకునేందుకు కార్య‌కర్త‌లు చాలా మంది ఉత్సాహంగా ఉన్నార‌ని, అందుకు సంబంధించి అధిష్టానం చ‌ర్య‌లు మొద‌లుపెట్ట‌క‌పోతే వ‌ర‌స‌గా మూడో సారి కూడా కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష వాసానికి ప‌రిమితం కావాల్సి వ‌స్తుందంటూ కూడా శ‌శి అన్నారు. అలాగే ఈ చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే త‌ను కూడా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకుంటాన‌న్నారు. ఆ ప్ర‌త్యామ్నాయ మార్గాలు పుస్త‌కాలు రాసుకోవ‌డం, స్పీచ్ లు ఇచ్చుకోవ‌డం అన్న‌ట్టుగా శ‌శి మాట్లాడారు!

అయితే శ‌శిథ‌రూర్ ప్ర‌త్యామ్నాయ మార్గాలు అవి కావ‌ని, ఆయ‌న‌ను బీజేపీ బుట్ట‌లో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని టాక్ ఇప్ప‌టికే ఊపందుకుంది. కేర‌ళ‌లో పాగా వేయ‌డానికి బీజేపీ ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసింది. గతంలో గెల‌వ‌లేక‌పోయిన న‌టుడు సురేష్ గోపికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చింది. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంపీగా నెగ్గారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేదు. ఇలాంటి నేప‌థ్యంలో శ‌శిథ‌రూర్ ను సీఎం ఫేస్ గా ప్ర‌క‌టించి బీజేపీ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అయితే శ‌శి మాత్రం ప్ర‌స్తుతానికి కాంగ్రెస్ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఇప్పటికే వ‌ర‌స‌గా నాలుగు సార్లు తిరువ‌నంత‌పురం నుంచి ఆయ‌న ఎంపీగా నెగ్గారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న‌ట్టుగా ఉన్నారు. ఇటీవ‌ల ప్ర‌త్యామ్నాయం అంటూ మాట్లాడిన‌ప్ప‌టికీ త‌ను కాంగ్రెస్ లోనే ఉన్న‌ట్టుగా, పార్టీ మీటింగుల‌కు హాజ‌ర‌వుతున్న‌ట్టుగా శ‌శి తాజాగా ప్ర‌క‌టించుకున్నారు. మ‌రి శ‌శిథ‌రూర్ ను వ‌దులుకుంటే కాంగ్రెస్ కు ఎంతో కొంత న‌ష్టం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ వాళ్లు ఆయ‌న‌ను కేర‌ళ సీఎం అభ్య‌ర్థిగా చూస్తారా లేక , బీజేపీకి సీఎం అభ్య‌ర్థిగా మారుస్తారో చూడాల్సి ఉంది.

ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో సీఎం క్యాండిడేట్ స్థాయి వారిని కోల్పోయి కాంగ్రెస్ క‌కావిక‌లం అయ్యింది. మ‌రి ఆ అనుభ‌వాల నుంచి రాహుల్ పాఠాలు నేరుస్తారో లేక‌, పార్టీ తునాతున‌క‌లు అయిపోయినా ధిక్కారాన్ని స‌హించేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారో కొంత‌కాలంలో క్లారిటీ రావొచ్చు!

2 Replies to “డీకేశి, శశిథ‌రూర్.. కాంగ్రెస్ నేత‌ల‌పై క‌మ‌లం కన్నా!”

Comments are closed.