జనసేనాని పవన్‌కల్యాణ్ ఎప్పుడేం మాట్లాడ్తారో ఆయనకే తెలియదు. పవన్‌లో గొప్పతనం ఏంటంటే తన అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వెనుకాడరు. తన అజ్ఞానం, అమాయకత్వానికి జనం నవ్వుకుంటారనే బిడియం ఆయనలో ఏ మాత్రం లేదు. అందుకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆంగ్ల మాధ్యమంపై పదేపదే ఆయన నోరు పారేసుకుంటుంటారు. నాదెండ్ల మనోహర్ తనను ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారో ఆయనకు అసలు అర్థం కావడం లేదు.
పవన్ అవగాహన రాహిత్యంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్స్ విసిరారు. ఇటీవల మీడియా సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా మంత్రి బొత్స గురించి ప్రస్తావించారు. బొత్స అంటే తనకు గౌరవం వుందంటూనే ఆంగ్ల మాధ్యమం వెనుక పెద్ద అవినీతి వుందని విమర్శించారు. దీనిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఇవాళ మంత్రి బొత్స మాట్లాడుతూ తనదైన స్టైల్‌లో పవన్‌కు చురకలు అంటించారు. పవన్‌కు తెలియక మాట్లాడుతున్నారన్నారు. తెలియకపోతే ట్యూషన్ చెప్పించుకోవాలని దెప్పి పొడిచారు. కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని పవన్‌కు చురకలు అంటించారు. కాంగ్రెస్ పాలనలో కూడా తాను విద్యాశాఖ మంత్రిగా పని చేయడాన్ని బొత్స గుర్తు చేశారు. అప్పట్లో తమపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ తన పార్టనర్ మీద సీబీఐ విచారణ అడగాలని బొత్స డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. అయితే ఆ కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తనకు తెలియదని మంత్రి తనదైన స్టైల్‌లో వ్యంగ్యంగా అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని తమ నాయకుడు వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పింది నిజమే అన్నారు. అయితే సీపీఎస్ రద్దు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. చేయలేని విషయాన్ని ఉద్యోగులకు చెప్పామని, జీపీఎస్ తీసుకొచ్చామన్నారు.