బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ముందు టఫ్ టార్గెట్ నిలిచింది. చివరి రోజు ఆట మిగిలిన ఉన్న తరుణంలో 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది ఆసీస్ జట్టు. అయితే నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు 23 ఓవర్ల ఆట రద్దు అయ్యింది. దీంతో ఐదో రోజు కూడా వర్షం అంతరాయం కలిగిస్తుందా? అనేది కీలకమైన ప్రశ్నగా మారింది.
రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ జట్టును 294 పరుగులకు ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. ఓవర్ నైట్ స్కోర్ తో వికెట్లేమీ కోల్పోకుండానే నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఆస్ట్రేలియను కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారత ఫాస్ట్ బౌలర్లు నియంత్రించారు. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లను సాధించి, తన కెరీర్ లో తొలిసారి ఐదు వికెట్ల స్పెల్ ను సాధించాడు. బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లను సాధించి సత్తా చూపించాడు. మరో వికెట్ ను వాషింగ్టన్ సుందర్ పొందాడు.
స్థూలంగా 328 పరుగుల టార్గెట్ టీమిండియా ముందు ఉంది. నాలుగోరోజు 1.5 ఓవర్ల పాటు మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కింది భారత ఓపెనర్లకు. నాలుగు పరుగులు చేశారు. చివరి రోజు ఆటలో 324 పరుగులు సాధిస్తే టీమిండియా గొప్ప విజయాన్ని నమోదు చేసినట్టుగా అవుతుంది.
బ్రిస్బెన్ లో ఏ జట్టు కూడా నాలుగో ఇన్నింగ్స్ లో అంతటి భారీ లక్ష్యాలను సాధించిన చరిత్ర లేదు. 250 పరుగులకు మించి ఏ స్కోర్ అయినా ఆస్ట్రేలియా సేఫ్ జోన్లో ఉన్నట్టే అని ఆ దేశ విశ్లేషకులు విశ్లేషించారు. అయితే.. క్రికెట్ లో అసాధ్యాలు ఒక్కోసారి సుసాధ్యం అవుతూ ఉంటాయి. బ్రిస్బెన్ లో ఇంత వరకూ టీమిండియా ఎప్పుడూ గెలవలేదు కూడా. అయితే తొలిసారి ఆ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
వాతావరణం అనుకూలిస్తే చివరి రోజు కనీసం 98 ఓవర్ల ఆట మిగిలి ఉంటుంది. గెలుపుకు ఇక 324 పరుగులు అవసరం. వీలైతే విజయం లేకపోతే డ్రా కోసం టీమిండియా ఆడే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం.. మ్యాచ్ డ్రాగా ముగిసినట్టే. సీరిస్ ప్రస్తుతం 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. సీరిస్ ను డ్రా చేసినా.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని టీమిండియానే నిలబెట్టుకున్నట్టుగా అవుతుంది. 328 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తే మాత్రం.. టీమిండియా సరికొత్త చరిత్రను సృష్టించినట్టే.