టాలీవుడ్‌ హైదరాబాద్‌కే పరిమితమా?

ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో మనుగడ సాగించలేదు…అని ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదే సూత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంటే టాలీవుడ్‌కు కూడా వర్తించినట్లుగా కనబడుతోంది. …

ఏ ప్రాంతీయ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో మనుగడ సాగించలేదు…అని ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదే సూత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంటే టాలీవుడ్‌కు కూడా వర్తించినట్లుగా కనబడుతోంది. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు, రాష్ట్రం విడిపోవడం తథ్యమని నిర్థారణ అయినప్పుడు టాలీవుడ్‌  ఏపీకి తరలిపోతుందని చాలామంది అనుకున్నారు. అప్పుడు ఇలా అనుకోవడానికి ప్రధాన కారణం ఆంధ్రా, తెలంగాణ మధ్య  ద్వేషభావం విపరీతంగా ఉండటం. 

సినిమా పరిశ్రమ తొంభై శాతం ఆంధ్రావారి చేతుల్లో ఉంది. 24 క్రాఫ్ట్‌ల్లో వారిదే ఆధిపత్యం. తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులో ఆంధ్రా వారు మనుగడ సాగించడం కష్టమని, ఇక్కడ బతుకు భారమవుతుందని కేవలం సామాన్యులేకాదు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, విద్యా వ్యాపారులు, సినిమా పరిశ్రమవారు …ఇలా చాలా రంగాలవారు భయపడ్డారు.

ఉద్యమం ఉధృతంగా ఉండటంతోపాటు ఆనాడు  ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌, ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ప్రకటనలు, ప్రసంగాలు కూడా హైదరాబాదులోని ఆంధ్రులను భయాందోళనలకు గురిచేశాయి. అప్పట్లో కేసీఆర్‌ రామోజీ ఫిల్మ్‌సిటీని వెయ్యి నాగళ్లతో దున్నిస్తామంటూ ప్రకటించారు. 

హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌ మీద ఉన్న ఆంధ్రా కవుల, కళాకారుల, ఇతర ప్రముఖుల విగ్రహాలను తొలగించి, వాటిని ప్యాక్‌ చేయించి ఆంధ్రాకు పంపుతామని అన్నారు. ఇలాంటి ప్రకటనలు సినీ ప్రముఖులకు కూడా భయం కలిగించాయి. ఆంధ్రాలో భూములు కొనుగోలు చేసి అక్కడే స్టూడియోలు, ఇతర నిర్మాణాలు చేయాలని అనుకున్నారు. 

రాష్ట్రం విడిపోయాక ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నిర్మించేటప్పుడు నవ నగరాలు అంటూ ప్లాన్‌ చేశారు. వాటిల్లో సినిమా, టీవీ రంగాల కోసం ఓ నగరం నిర్మిస్తామని చెప్పారు. అంటే ఎంటర్‌టైన్మెంట్‌ సిటీ అన్నమాట.

అప్పట్లో చాలామంది సినిమా ప్రముఖులు వైజాగ్‌ మీద కన్నేశారు. ఉమ్మడి ఏపీలోనే వైజాగ్‌ సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన నగరంగా పేరు పొందింది. చాలా సినిమాల్లో వైజాగ్‌ అందాలను చూపించారు. కొందరు దర్శకులకు ఆ నగరమంటే పిచ్చి. ఇలా ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి రకరకాల చర్చలు జరిగాయి. ఊహాగానాలు మొదలయ్యాయి. 

తెలంగాణ ఉద్యమ సమయంలో భయపడిన టాలీవుడ్‌ ప్రముఖుల్లో క్రమంగా భయం తొలగిపోయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తాము ఉద్యమం చేసింది తెలంగాణను దోచుకున్న రాజకీయ నాయకులకు వ్యతిరేకంగానే కాని, సామాన్యులకు వ్యతిరేకంగా కాదని, టాలీవుడ్‌కో, వ్యాపారులకో, పారిశ్రామికవేత్తలకో వ్యతిరేకం కాదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టబోమని, ఎవరి పనులు వారు చేసుకోవచ్చని చెప్పారు. దీంతో టాలీవుడ్‌ ప్రముఖులు కుదుటపడ్డారు.

కేసీఆర్‌ కూడా చిత్రపరిశ్రమ ప్రముఖులతో సమావేశాలు జరిపి భారీ ఫిలిం సిటీ నిర్మిస్తామని, భూములు ఇస్తామని చెప్పారు. సినిమా పరిశ్రమ పట్ల కేసీఆర్‌, ఆయన కుమారుడు కేసీఆర్‌ సానుకూల వైఖరి ప్రదర్శించడంతో టాలీవుడ్‌ ప్రముఖులు ఏపీని మర్చిపోయారు. 

ఏపీలో సినిమా పరిశ్రమ స్థిరపడాలని చంద్రబాబు అంతో ఇంతో తాపత్రయపడినా వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆ ఆలోచన మరుగున పడిపోయింది. ఇక టాలీవుడ్‌ ప్రముఖుల్లో కూడా రాజకీయంగా జగన్‌ కంటే కేసీఆర్‌ను, కేటీఆర్‌ను అభిమానించేవారు ఎక్కువగా ఉన్నారు. 

కేసీఆర్‌ విధానాలను, ఆలోచనలను ప్రశంసించేవారు అనేకమంది కనబడుతున్నారు. ఇక కేటీఆర్‌ సీనియర్‌ హీరోలతోపాటు ఈ తరం వారితోనూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనకు చాలామందితో సన్నిహిత సంబంధాలన్నాయి. సినిమా ఫంక్షన్‌లలో పాల్గొంటూ ఉంటారు. 

గతంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన కొందరు నటీనటులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు కనబడుతోంది. ఒకప్పుడు తామరతంపరగా చాలామంది టాలీవుడ్‌ ప్రముఖులు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

కాని ఏపీ పరిణామాలపై స్పందించేవారెవరూ లేరు. ఒకప్పుడు దిగ్గజ నటుడు మోహన్‌ బాబు వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతుగా మాట్లాడేవారు. కాని ఇప్పుడు మౌనంగా ఉన్నారు. జగన్‌ పథకాల గురించి కూడా ఎవరూ మాట్లాడటంలేదు. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ జగన్‌కు సన్నిహితంగా ఉన్నందుకు ఎస్వీబీసీ చానెల్‌ చైర్మన్‌ పదవిని అలంకరించాడు. కాని ఆయన తన స్వయం కృతాపరాథంతో పదవిని పోగొట్టుకున్నాడు. 

తరువాత జగన్‌కు దూరమవడమే కాకుండా, చిత్ర పరిశ్రమలోనూ అవకాశాలను కొల్పోయాడు. ఒకప్పుడు వైసీపీలో ఉన్న జీవితా రాజశేఖర్‌ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. విశాఖలో సూడియోలు కట్టాలని గతంలో చిరంజీవి, అల్లు అరవింద్‌ ప్లాన్‌ చేశారు. కాని అల్లు అరవింద్‌ ఇప్పుడు హైదరాబాద్‌లోనే భారీ స్టూడియో నిర్మాణానికి సిద్ధమయ్యాడు. ఏపీలోనూ ఏదో చేయాలనే

ఆలోచనలు టాలీవుడ్‌ ప్రముఖులకు ఉన్నప్పటికీ అక్కడి కుల రాజకీయాలు వారిని భయపెడుతుండొచ్చు. ఏపీలో ఉన్నంత భయంకరమైన వాతావరణం తెలంగాణలో లేదు. ఏది ఏమైనా టాలీవుడ్‌ జనం హైదరాబాద్‌నే సేఫ్‌ ప్లేస్‌గా భావిస్తున్నారు. అదీగాక ఇక్కడ ఉన్నంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏపీలో లేదు. 

తెలుగు సినిమా ప్రముఖులు తరతరాలుగా హైదరాబాదులో స్థిరపడిపోయారు. ఈ వాతావరణానికి, పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఇప్పుడున్న చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారు. తాము ఆంధ్రా ప్రాంతంవారిమన్న స్పృహ కూడా వారిలో లేదు.

-నాగ్‌ మేడేపల్లి 

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

గెరిల్లా యుద్దమే చేయాలి