నమ్మకం లేదు.. షాకిచ్చిన ఫేస్ బుక్ ఉద్యోగులు

దశలవారీగా మెటాలో భారీగా ఉద్యోగుల్ని తొలిగించిన ప్రభావం, ఆ కంపెనీ సీఈవో జుకర్ బర్గ్ పై గట్టిగా పడింది. తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేలో, జుకర్ బర్గ్ కు షాకిచ్చారు ఉద్యోగులు. Advertisement మెటా…

దశలవారీగా మెటాలో భారీగా ఉద్యోగుల్ని తొలిగించిన ప్రభావం, ఆ కంపెనీ సీఈవో జుకర్ బర్గ్ పై గట్టిగా పడింది. తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేలో, జుకర్ బర్గ్ కు షాకిచ్చారు ఉద్యోగులు.

మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలో కేవలం 26 శాతం మంది మాత్రమే జుకర్ బర్గ్ నాయకత్వంపై విశ్వాసం చూపించారు. మిగతా ఉద్యోగులంతా జుకర్ బర్గ్ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని కుండబద్దలుకొట్టారు.

మెటా ఆర్థికపనితీరును మెరుగుపరచడానికి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపట్టారు జుకర్ బర్గ్. బడ్జెట్స్ తగ్గించడంతో పాటు, వేలమంది ఉద్యోగుల్ని తొలిగించారు. కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రాధాన్యత కలిగిన అనేక ప్రాజెక్టుల్ని రద్దుచేయడంతో పాటు, నియామకాల్ని కూడా పూర్తిగా తగ్గించేసింది.

దీంతో మెటాపై ఉద్యోగులకు నమ్మకం పోయింది. గతేడాది ప్రారంభంతో పోలిస్తే, ఈ ఏడాది మెటాపై ఉద్యోగుల్లో ఉన్న నమ్మకం అదనంగా మరో 5 శాతం క్షీణించింది.

కృత్రిమ మేధపై ఎక్కువగా దృష్టిపెట్టింది మెటా. ఎక్కువగా నిధులు దానికే కేటాయిస్తోంది. మరోవైపు యాడ్ రెవెన్యూ కూడా తగ్గిపోవడంతో.. ప్రాధాన్యాల క్రమాన్ని మార్చుకుంది, ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంది. ఇకపై తాము నిదానంగా వృద్ధి చెందుతామంటూ జుకర్ బర్గ్ చేసిన ప్రకటన చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా సంస్థపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారనే విషయాన్ని తాజా సర్వే బయటపెట్టింది.