ఎమ్బీయస్‍: కర్ణాటకలో బిజెపి బలం తగ్గలేదా?

కర్ణాటక ఫలితాలు వచ్చాక బిజెపి నాయకులు సామూహికంగా పాడుతున్న పాటేమిటంటే, మా ఓటింగు శాతం పెద్దగా తగ్గలేదు. 2018లో అది 36.2 ఉంటే యిప్పుడు 36 అయిందంతే. దాని అర్థం ప్రభుత్వ వ్యతిరేకత లేదు…

కర్ణాటక ఫలితాలు వచ్చాక బిజెపి నాయకులు సామూహికంగా పాడుతున్న పాటేమిటంటే, మా ఓటింగు శాతం పెద్దగా తగ్గలేదు. 2018లో అది 36.2 ఉంటే యిప్పుడు 36 అయిందంతే. దాని అర్థం ప్రభుత్వ వ్యతిరేకత లేదు అంటున్నారు. టీవీ చర్చల్లో చాలామంది తటస్థ పరిశీలకులు కూడా యీ శాతం మీదనే ఎక్కువగా మాట్లాడారు. నాకు అర్థం కానిదేమిటంటే 2018 అంకె ఎందుకు తీసుకోవాలి? 17 మందిని ఫిరాయింపు చేసుకున్న తర్వాత ఆ ఫిగర్‌తో పోల్చాలి తప్ప 2018 ఫిగర్స్‌తో పోలిస్తే ఎలా? ఉపయెన్నికలలో 15 మందిని గెలిపించుకుంది. కనీసం ఆ ఫిగరైనా కలపాలి కదా!

2019 పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చమని అడగడం సబబు కాదు. దేశం వేరు, రాష్ట్రం వేరు అని భారతీయ ఓటరు యిప్పటికే గుర్తించాడు. పార్లమెంటు అనగానే మోదీ కరిజ్మా గట్రా లెక్కలోకి వస్తాయి. అందువలన అసెంబ్లీ ఫలితాలతోనే పోల్చి చూడాలి. కానీ ఎన్నికలకు వెళ్లబోయే ముందు ఉన్న ఓట్ల శాతం ఎంత? ఎన్నికల తర్వాత వచ్చిన ఓట్ల శాతం ఎంత అనేదే పోల్చాలి. అలా చూస్తే 0.2% కంటె ఎక్కువే తగ్గి ఉంటుంది కదా, అదెందుకు చెప్పరు అని అనుకుంటూ వచ్చాను. ఎన్నికల తర్వాత వచ్చిన విశ్లేషణల్లో కూడా ఆ విషయం ఎవరూ ప్రస్తావించలేదు. కాంగ్రెసుకు 135 సీట్లు (2018లో 80), 42.9% ఓట్లు (38.0) బిజెపికి 66 సీట్లు (104) 36.0% ఓట్లు (36.2), జెడిఎస్‌కు 19 సీట్లు (37), 13.3% (18.4) ఓట్లు వచ్చాయనే అందరూ రాసి ఊరుకుంటున్నారు.

నెట్‌లో బాగా వెతగ్గా ఈ ఆర్టికల్ కనబడింది. దానిలో యిచ్చిన అనేక గణాంకాలను యీ వ్యాసరచనకు ఉపయోగించు కున్నాను. పైన చెప్పిన అంశంపై (ఉపయెన్నికల తర్వాత పెరిగిన బిజెపి బలంతో, యిప్పటి ఫలితాలను పోల్చి చూడడం) ఆ వ్యాసంలో ఓటింగు శాతాలు యివ్వలేదు కానీ సీట్ల పరంగా వచ్చిన తేడా చెప్పారు. ఆ వివరాలు ప్రాంతాల వారీగా యిస్తాను. ఈ ప్రాంతాల పరిధి విషయంలో నిర్దిష్టత లేదు. ఒక్కో సర్వే సంస్థ, ఒక్కో పరిశీలకుడు ఒక్కోలా పరిగణిస్తున్నారు. ఉదాహరణకు పాత మైసూరు ప్రాంతంలో 59 నియోజకవర్గాలున్నాయని ఒకరంటే, 50 ఉన్నాయని మరొకరు అంటారు. ఏది ఏమైనా మనకు ఒక ఐడియా రావడానికి యిది ఉపకరిస్తుంది.

దక్షిణ కర్ణాటక (పాత మైసూరు) ప్రాంతంలో బిజెపికి గతంలో 11, యిప్పుడు 5 వచ్చాయి కాబట్టి 6 తగ్గాయంతే అంటున్నారు. కానీ అక్కడ ముగ్గుర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 14కి పెంచుకుంది కాబట్టి 9 సీట్లు పోగొట్టుకుంది అని లెక్క వేయాలి. అలాగే కిత్తూరు కర్ణాటకలో గతంలో 30, యిప్పుడు 16 వచ్చాయి కాబట్టి 14 తగ్గాయంతే అంటున్నారు. కానీ అక్కడ ఐదుగుర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 35కి పెంచుకుంది కాబట్టి 19 సీట్లు పోగొట్టుకుంది అని లెక్క వేయాలి. కల్యాణ కర్ణాటకలో గతంలో 12, యిప్పుడు 9 వచ్చాయి కాబట్టి 3 తగ్గాయంతే అంటున్నారు. కానీ అక్కడ ఇద్దర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 14కి పెంచుకుంది కాబట్టి 5 సీట్లు పోగొట్టుకుంది అని లెక్క వేయాలి.

మధ్య కర్ణాటకలో గతంలో 24, యిప్పుడు 6 వచ్చాయి కాబట్టి 18 తగ్గాయంతే అంటున్నారు. కానీ అక్కడ ఒకర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 25కి పెంచుకుంది కాబట్టి 19 సీట్లు పోగొట్టుకుంది అని లెక్క వేయాలి. కోస్తా కర్ణాటకలో గతంలో 16, యిప్పుడు 13 వచ్చాయి కాబట్టి 3 తగ్గాయంతే అంటున్నారు. కానీ అక్కడ ఒకర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 17కి పెంచుకుంది కాబట్టి 4 సీట్లు పోగొట్టుకుంది అని లెక్క వేయాలి. బెంగుళూరులో గతంలో 11, యిప్పుడు 17 వచ్చాయి కాబట్టి 6 పెరిగాయి అంటున్నారు. కానీ అక్కడ నలుగుర్ని ఫిరాయింప చేసుకుని బలాన్ని 15కి పెంచుకుంది కాబట్టి 2 సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకుంది అని లెక్క వేయాలి. ఈ సీట్లను ఓట్ల పరంగా తర్జుమా చేసి చూస్తే బిజెపి 0.2% కంటె ఎక్కువ ఓట్లు పోగొట్టుకుందని అర్థమౌతుంది. కచ్చితమైన అంకెలు నాకు దొరకలేదు.

బిజెపి వారు దీన్ని విస్మరించి, 2018తోనే పోల్చి ‘రాష్ట్రం మొత్తం మీద 0.2% తగ్గింది కాబట్టి, బిజెపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, మేం ఓడలేదు. జెడిఎస్ నుంచి 5% ఓట్లు కాంగ్రెసుకి పడడంతో వాళ్లు నెగ్గారంతే’ అని వాదిస్తున్నారు. ఆ 5% కూడా ముస్లిములవే, వాళ్లే మా మీద కక్ష గట్టి ఓడించారు అని కూడా కొందరంటున్నారు. ఆ మాట నిజమే అనుకుంటే ముస్లిములు తలచుకుంటే తమను గద్దె దింపగలరు అని ఒప్పుకుని యిప్పట్నుంచైనా వాళ్లతో సవ్యంగా వ్యవహరించి, నాలుగైదు సీట్లు వాళ్లకీ యిస్తే మంచిదని బిజెపి గ్రహించాలి.

ఏ పార్టీ ఐనా సరే మైనారిటీలను చంకనా వేసుకోనక్కరలేదు, పాదాల కింద పడేసి తొక్కనూ అక్కరలేదు. వాళ్ల బతుకు వాళ్లని బతకనిస్తే చాలు. టిప్పు జయంతి చేయనూ అక్కరలేదు, మాననూ అక్కరలేదు. ఆ పేరు చెప్పి ఓట్లడిగితే ఎలా? శతాబ్దాల క్రితం నాటి చరిత్ర ఎవడికి కావాలి? ఈరోజు నాకు భుక్తి గడుస్తుందా లేదా అన్నదే సామాన్యుడి గోల. గుడి కడతా, మసీదు కడతాం అంటే అవేమీ అక్కరలేదు, యింటికి దగ్గర్లో బడి కట్టండి, ఆసుపత్రి కట్టండి, ఫీజులు లేకుండా చూడండి అనే చెప్తారు. అందరి సంక్షేమమూ చూస్తే అందరితో పాటు మైనారిటీలు బాగు పడతారు. ఏ మతం వారి కోసమూ ప్రత్యేకంగా జయంతులు, వర్ధంతులు, ఉత్సవాలూ, పేర్లు మార్చడాలూ చేయనక్కర లేదు. సిద్ధరామయ్య టిప్పు జయంతి మళ్లీ ప్రారంభిస్తాడేమోననే సందేహంతో యిది ప్రత్యేకంగా రాస్తున్నాను.

ముస్లిము ఓటర్లలో మాత్రమే కాదు, అన్ని కులాల ఓటర్లలోనూ బిజెపి బలం క్షీణించింది. దానికి ఏమంటారు? రాజకీయంగా ప్రధాన కులమైన లింగాయతులు యీసారి కాంగ్రెసు పట్ల విముఖతను తగ్గించుకున్నట్లు కనబడుతోంది. 34 (2018లో 16) మంది కాంగ్రెసు ద్వారా, 18 (2018లో 38) మంది బిజెపి ద్వారా గెలిచారు. వొక్కళిగ ప్రాబల్యం ఉన్న 51 స్థానాల్లో 27 కాంగ్రెసుకు, పాత మైసూరులో బిజెపికి గతంలో 9 వస్తే యీసారి 6 వచ్చాయి. ఈ రెండు వర్గాలకూ రిజర్వేషన్ పెంచడం ఎన్నికలలో లాభించలేదు.  రిజర్వ్‌డ్ విషయానికి వస్తే ఎస్సీ సీట్లు మొత్తం 36 ఉంటే 22 (గతంలో 12) కాంగ్రెసుకి, ఎస్టీ మొత్తం 15 ఉంటే 14 (గతంలో 8) కాంగ్రెసుకి వెళ్లాయి. దేశమంతటా గిరిజనుల్లో బిజెపి బలం పెరుగుతూ వస్తూ ఉంటే యిక్కడ అది రివర్స్ అయింది.

ఇండియా టుడే-ఏక్సిస్ వారి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం (వీళ్ల సర్వే అంచనా వాస్తవ ఫలితాలకు అతి దగ్గరగా వచ్చింది) లింగాయతుల్లో 64% బిజెపికి, 20% కాంగ్రెసుకు, 10% జెడిఎస్‌కు వేశారు. వొక్కళిగల్లో 25% బిజెపికి, 24% కాంగ్రెసుకు, 46% జెడిఎస్‌కు వేశారు. ఒబిసిలలో 45% బిజెపికి, 31% కాంగ్రెసుకు, 15% జెడిఎస్‌కు వేశారు. కురుబ (సిద్ధరామయ్య కులం)లలో 22% బిజెపికి, 63% కాంగ్రెసుకు, 10% జెడిఎస్‌కు వేశారు. ఎస్సీలలో 22% బిజెపికి, 60% కాంగ్రెసుకు, 14% జెడిఎస్‌కు వేశారు. ఎస్టీలలో 33% బిజెపికి, 44% కాంగ్రెసుకు, 14% జెడిఎస్‌కు వేశారు. ఒబిసిలలో 45% బిజెపికి, 31% కాంగ్రెసుకు, 15% జెడిఎస్‌కు వేశారు. జనరల్ కేటగిరీలో వాళ్లలో 60% బిజెపికి, 19% కాంగ్రెసుకు, 11% జెడిఎస్‌కు వేశారు. క్రైస్తవుల్లో 17% బిజెపికి, 68% కాంగ్రెసుకు, 5% జెడిఎస్‌కు వేశారు. ముస్లిముల్లో 2% బిజెపికి, 88% కాంగ్రెసుకు, 8% జెడిఎస్‌కు వేశారు.

త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా ప్రకారం జనరల్ సీట్లలో బిజెపికి 36.8%, కాంగ్రెసుకు 42.1% జెడిఎస్‌కు 13.2% ఓట్లు పడగా, ఎస్సీ సీట్లలో బిజెపికి 32.7%, కాంగ్రెసుకు 44.6% జెడిఎస్‌కు 15.2% ఓట్లు పడగా, ఎస్టీ సీట్లలో బిజెపికి 34.8%, కాంగ్రెసుకు 47.7% జెడిఎస్‌కు 9.9% ఓట్లు పడ్డాయి. ఈ అంకెలు చూస్తే ఏ వర్గాల అండతో బిజెపి 36% తెచ్చుకుందో, కాంగ్రెసు 43% తెచ్చుకుందో అర్థమౌతుంది. కేవలం ముస్లిము ఓట్లు జెడిఎస్ నుంచి బదిలీ కావడం చేతనే కాంగ్రెసు నెగ్గింది అనే వాదన పొరపాటని అర్థమౌతుంది.  కాంగ్రెసుకు బిజెపి కంటె 27 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయనేది గమనార్హం.

బిజెపి అనుకూల వాట్సాప్ వీరులు చలామణీలో పెట్టిన యింకో వాదన ఉంది. 2 వేల ఓట్ల తేడాతో బిజెపి కోల్పోయిన సీట్లు 58, వెయ్యి ఓట్ల తేడాతో కోల్పోయినవి 41 అని. ‘చునావ్’ అనే సర్వే సంస్థ యిచ్చిన పట్టిక ప్రకారం వెయ్యి కంటె తక్కువ తేడాతో కాంగ్రెసు 5 గెలిస్తే, బిజెపి 7 గెలిచింది. ఒక సీటును బిజెపి 16 ఓట్ల తేడాతో గెలిచింది. ఈ 58, 41 ఎక్కణ్నుంచి వచ్చాయో తెలియదు. ఇక 2001-5000 తేడాతో కాంగ్రెసు గెలిచినది 17 కాగా, బిజెపి గెలిచినది 10. 5001-10000 తేడాతో కాంగ్రెసు 15 గెలవగా, బిజెపి 10 గెలిచింది. 10001-25000 తేడాతో కాంగ్రెసు 49 గెలవగా, బిజెపి 18 గెలిచింది. 25001-50000 తేడాతో కాంగ్రెసు 37 గెలవగా, బిజెపి 15 గెలిచింది. 5000 కంటె ఎక్కువ తేడాతో కాంగ్రెసు 12 గెలవగా, బిజెపి 6 గెలిచింది. అంటే 2 వేలకు పై బడిన వ్యత్యాసంతో కాంగ్రెసు 130 సీట్లు గెలవగా, బిజెపి 59 మాత్రమే గెలవగలిగింది.

త్రివేది సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా మరోలా విశ్లేషించింది. 5% కంటె తక్కువ మార్జిన్‌తో గెలిస్తే తక్కువ తేడాతో గెలిచినట్లు లెక్క, కర్ణాటకలో 61 సీట్ల ఫలితాలు ఆ మాత్రం తేడాతో నిర్ణయించబడ్డాయి అని చెప్పింది. ఈ 61లో బిజెపి నెగ్గినది 26టిలో, కాంగ్రెసు నెగ్గినది 30టిలో. సరాసరి విన్నింగ్ మార్జిన్లను ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా యిచ్చింది కూడా. బెంగుళూరులో బిజెపి సరాసరి విన్నింగ్ మార్జిన్ శాతం 16.5 కాగా కాంగ్రెసుది 16.6, జెడిఎస్‌ది 0.5, కిత్తూరు కర్ణాటకలో బిజెపిది 13.3, కాంగ్రెసుది 23, జెడిఎస్‌ది 0.7, సెంట్రల్ కర్ణాటకలో బిజెపిది 1, కాంగ్రెసుది 10.3, జెడిఎస్‌ది 0.4, కోస్తా కర్ణాటకలో బిజెపిది 8, కాంగ్రెసుది 2.3, జెడిఎస్‌ది 0, కల్యాణ కర్ణాటకలో బిజెపిది 1.1 కాంగ్రెసుది 6.8, జెడిఎస్‌ది 0.7, దక్షిణ కర్ణాటకలో బిజెపిది 0.8, కాంగ్రెసుది 23.3, జెడిఎస్‌ది 5.7. దీన్ని బట్టి బిజెపి అనేక ప్రాంతాల్లో కాంగ్రెసుతో పోటీ పడలేక పోయిందని తెలుస్తోంది.

బిజెపి వాళ్లు పూర్తిగా దాచేస్తున్న విషయం మరొకటి ఉంది. 240523 హిందూలో వచ్చిన వ్యాసం ప్రకారం పోటీ చేసిన స్థానాల్లో 29.5% సీట్లు మాత్రమే గెలిచిన బిజెపి 31 స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. దక్షిణ కర్ణాటకలో పోటీ చేసిన 38% స్థానాల్లో, సెంట్రల్ కర్ణాటకలో 20%, బెంగుళూరులో 11% కల్యాణ కర్ణాటకలో 6% స్థానాల్లో డిపాజిట్లు పోయాయి. నాలుగేళ్ల పాలన తర్వాత సగటున 14% సీట్లలో డిపాజిట్లు పోగొట్టుకోవడమంటే అది ప్రజావ్యతిరేకత కాదా?  ఇంతకీ బిజెపి వాళ్లు అంటున్నట్లు జెడిఎస్ 5% ఓట్లు అటు వెళ్లడమే కొంప ముంచిందా? రాష్ట్రం మొత్తం మీద వచ్చిన సరాసరి అంకె తీసుకుని చర్చిస్తే అసలు పరిస్థితి అర్థం కాదు. ప్రాంతాల వారీగా బిజెపికి వచ్చిన ఓట్లు చూస్తేనే సమగ్రచిత్రం బయల్పడుతుంది.

ముందుగా జెడిఎస్‌కు బలమున్న దక్షిణ కర్ణాటక (పాత మైసూరు) ప్రాంతమే తీసుకుందాం. జెడిఎస్‌కు 9.4% తగ్గితే కాంగ్రెసుకు 6.5% ఓట్లు పెరిగాయి. కానీ బిజెపికి కూడా 3.4% ఓట్లు పెరిగాయని గమనించాలి. జెడిఎస్‌కు బలమున్న మరో ప్రాంతం బెంగుళూరు ప్రాంతం చూదాం. అక్కడ జెడిఎస్‌కు 7.9% ఓట్లు తగ్గితే కాంగ్రెసుకు పెరిగినవి 2.4% మాత్రమే. కానీ బిజెపికి పెరిగినది 5.3%! దీని అర్థమేమిటి? జెడిఎస్ బలక్షీణత వలన బిజెపి కూడా ఆరిటిలో రెండు ప్రాంతాల్లో లాభపడింది అని. ‘నిజమే కానీ నాలుగిట్లో మా కంటె కాంగ్రెసే ఎక్కువ లాభపడింది’ అని బిజెపి వాళ్లు అనేసి ఊరుకోవచ్చు. కానీ అలా ఎందుకు జరగాలి? ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే అవన్నీ అధికారపక్షానికే రావాలి కానీ మరో ప్రతిపక్షానికి ఎందుకు వెళ్లాలి?

పైగా కాంగ్రెసు పెరుగుదల జెడిఎస్ క్షీణత కంటె ఎక్కువగా ఉంటే దాని అర్థమేమిటి? సెంట్రల్ కర్ణాటకలో జెడిఎస్‌కు 4.1% తగ్గాయి. కానీ కాంగ్రెసుకు పెరిగినది 7.3%! అంటే యిక్కడ కాంగ్రెసు యితరులతో పాటు బిజెపి నుంచి కూడా ఓట్లు లాక్కున్నట్లేగా! అందుకే బిజెపికి 8.9% ఓట్లు తగ్గాయి. కోస్తా కర్ణాటకలో జెడిఎస్‌కు 1.2% తగ్గాయి. కానీ కాంగ్రెసుకు పెరిగినది 2.2%! బిజెపికి 3.1% తగ్గాయి. కిత్తూరు కర్ణాటకలో జెడిఎస్‌కు 3.4% తగ్గాయి. కానీ కాంగ్రెసుకు పెరిగినది 4.5%! బిజెపికి 2.4% తగ్గాయి. కళ్యాణ కర్ణాటకలో జెడిఎస్‌కు 2.5% తగ్గాయి. కాంగ్రెసుకు 2.4% పెరగగా బిజెపికి 1.8% తగ్గాయి. బెంగుళూరు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో తప్ప తక్కిన అన్ని చోట్ల బిజెపి ఓటుశాతం తగ్గింది అని గుర్తు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో యీ మూడు పార్టీల ఓటింగు శాతాలను పోల్చి చూస్తే బిజెపి కాంగ్రెసు కంటె ఎంత వెనకబడిందో ఒక అంచనా వస్తుంది. బెంగుళూరులో బిజెపికి 41.8, కాంగ్రెసుకు 41.3, జెడిఎస్‌కు12.5. కిత్తూరు కర్ణాటకలో బిజెపికి 41.9, కాంగ్రెసుకు 44, జెడిఎస్‌కు 4.9. సెంట్రల్ కర్ణాటకలో బిజెపికి 34.4, కాంగ్రెసుకు 45.4, జెడిఎస్‌కు 9.3. కోస్తా కర్ణాటకలో బిజెపికి 43.5, కాంగ్రెసుకు 42.4, జెడిఎస్‌కు 3.8. కల్యాణ కర్ణాటకలో బిజెపికి 36.8, కాంగ్రెసుకు 44.6, జెడిఎస్‌కు 11.8, దక్షిణ కర్ణాటకలో బిజెపికి 22.6, కాంగ్రెసుకు 40.6, జెడిఎస్‌కు 26.3. ఇది చూసినప్పుడు చాలా చోట్ల జెడిఎస్ ఉనికి నామమాత్రమేనని (3 ప్రాంతాల్లో 10% కంటె తక్కువ, రెండిటిలో 12% దరిదాపుల్లో) అర్థమై జెడిఎస్ కారణంగానే మేము ఓడిపోయామని బిజెపి చెప్తే అది కహానీయే అని అర్థమౌతుంది. 73.2% ఓటింగు జరిగింది కాబట్టి యీ ఫలితాలు మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నట్లే అనుకోవాలి. ఎందుకిలా జరిగింది అనేది మరో వ్యాసంలో చర్చిద్దాం.

పోటీ చేసినవాటిలో ఎన్ని గెలిచారు అనే అంశంపై (స్ట్రయిక్ రేట్) బట్టి కూడా పార్టీ పెర్‌ఫామెన్స్‌ను గణిస్తారు. బెంగుళూరులో బిజెపి స్ట్రయిక్ రేట్ 47.2 (2018లో అది 36.6) కాంగ్రెసుది 50 (46.3) కిత్తూరు కర్ణాటకలో బిజెపి స్ట్రయిక్ రేట్ 32.0 (61.7) కాంగ్రెసుది 66 (33.3). సెంట్రల్ కర్ణాటకలో బిజెపి స్ట్రయిక్ రేట్ 16.7 (67.5) కాంగ్రెసుది 75 (32.4). కోస్తా కర్ణాటకలో బిజెపి స్ట్రయిక్ రేట్ 68.4 (85) కాంగ్రెసుది 31 (15). కల్యాణ కర్ణాటకలో బిజెపి స్ట్రయిక్ రేట్ 29 (41.2) కాంగ్రెసుది 61.3 (47.1). దక్షిణ కర్ణాటకలో బిజెపి స్ట్రయిక్ రేట్ 9.6 (25.5) కాంగ్రెసుది 62.7 (26.3). ఈ ఎన్నికలలో 113 స్థానాలు చేతులు మారాయి. అంటే ఉన్న పార్టీకి బదులు మరో పార్టీని గెలిపించా యన్నమాట. పైన యిచ్చిన మ్యాప్ చూస్తే 2018 నుంచి 2023కు రంగులు ఎలా మారాయో అర్థమౌతుంది. అలాటి స్థానాలు కాంగ్రెసుకు 77 రాగా, బిజెపికి 23,  జెడిఎస్‌కు 11 వచ్చాయి.

ఇలా ఎన్ని రకాలుగా చూసినా బిజెపికి కర్ణాటకలో వ్యతిరేక పవనాలు వీచాయని స్పష్టమౌతోంది. కాదని వారు వాదిస్తే దబాయింపే అనుకుని ఊరుకోవాలి తప్ప సత్యాన్ని చూడడానికి బిజెపి నిరాకరిస్తోందని మనం అనుకోకూడదు. దానికి నిదర్శనం కర్ణాటక ఫలితాల తర్వాత అమిత్ షా చంద్రబాబును పిలిచి మాట్లాడడం! దాని గురించి మరో వ్యాసంలో మాట్లాడుకుందాం. (ఫోటో – ప్రాంతాల వారీ ఫలితాలు చూపే మ్యాప్, బెంగుళూరులో మోదీ రోడ్ షో, ఫలితాల అనంతరం కుమారస్వామి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)

mbsprasad@gmail.com