ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం కంపు కొడుతోంది. అధికార పార్టీ వైసీపీని రెడ్ల పార్టీగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీని కమ్మ పార్టీగా, అలాగే జనసేనను కాపు, బలిజల పార్టీగా పిలుస్తుంటారు. రాజకీయంగా ప్రత్యర్థులు కులం కోణంలో విమర్శిస్తూ, ఇతర కులాల మనసులు చూరగొనేందుకు ఆయా పార్టీల ప్రతినిధులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికి వస్తే… తన సామాజిక వర్గానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తుంటారు.
అయితే అధికార పక్షాన్ని ప్రత్యర్థి పార్టీల నేతలు రెడ్ల పార్టీగా విమర్శించడంలో తప్పేమీ లేదని అనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా వైసీపీ కీలక నేత, ఆ పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జ్ నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలను చెప్పుకోవచ్చు. మరీ ఇంత బరి తెగింపుతో పార్టీ వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలెవరో తెలుసుకుందాం.
పార్టీ కేంద్ర కార్యాలయ పర్య వేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సంఘాల నేతలు మేరుగ నాగార్జున (ఎస్సీ సెల్), జంగా కృష్ణమూర్తి (బీసీ సెల్), గౌతం రెడ్డి (ట్రేడ్ యూనియన్), ఎంవీఎస్ నాగిరెడ్డి (రైతు విభాగం), చల్లా మధుసూదన్‌రెడ్డి (ఐటీ విభాగం), శివభరత్‌రెడ్డి (డాక్టర్స్ విభాగం), అంకంరెడ్డి నారాయణ మూర్తి (గ్రీవెన్స్‌సెల్), మనోహర్‌రెడ్డి (లీగల్‌సెల్), ఎ.హర్షవర్ధన్‌రెడ్డి (ఎన్ఆర్ఐ విభాగం), చిల్లపల్లి మోహన్ రావు(చేనేత విభాగం), కె.సుధాకర్‌రెడ్డి (పోలింగ్‌బూత్ విభాగం), డి.వేమారెడ్డి (పంచాయితీరాజ్ విభాగం) తదితరులు పాల్గొన్నారు.
మొత్తం 13 మంది నాయకులు పాల్గొన్న సమావేశంలో 9 మంది జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిగిలిన నలుగురు రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా అనివార్యంగా నియమితులయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ, బీసీ, చేనేత విభాగాల నేతలుగా, ఆయా సామాజిక వర్గాల వారిని మాత్రమే నియమించక తప్పని పరిస్థితి. గ్రీవెన్స్‌సెల్‌కు మాత్రం దయతలచి ఇతర సామాజిక వర్గం నేతను నియమించినట్టు, ఇందులోని పేర్లను బట్టి అర్థమవుతోంది.
గతంలో చంద్రబాబు ఏ విధమైన తప్పు చేశారో, అదే తప్పును ప్రస్తుత అధికార పార్టీ చేస్తోందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా నియమితులైన వెంటనే వారితో విజయసాయిరెడ్డి సమావేశం కావడం శుభపరిణామం. ఇదే సందర్భంలో పార్టీలో అన్ని కులాలు, మతాల వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి దృష్టి పెట్టాలి.
సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ, మిగిలిన వారిని కరివేపాకులా వాడుకుంటే మాత్రం ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ, ప్రభుత్వ పెద్దలు గ్రహిస్తే మంచిది.