తొలి ఇన్నింగ్స్ లో పై చేయి సాధించినట్టుగానే సాధించి.. అడిలైడ్ టెస్టులో దారుణ ఓటమిని, చెత్త రికార్డును మూటగట్టుకుంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో గొప్ప పోరాట పటిమను చూపిన టీమిండియా బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో చరిత్రలోనే అతి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.
ఆ చేదు అనుభవం నుంచి టీమిండియా వేగంగా బయటపడక తప్పని పరిస్థితి. క్రిస్మస్ మరుసటి రోజు బాక్సిండ్ డే టెస్టుకు టీమిండియా రెడీ అవుతుంది. తొలి మ్యాచ్ తో పోలిస్తే రెండో మ్యాచ్ కు చాలా మార్పులు అనివార్యం అయ్యాయి.
ప్రత్యేకించి టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తదుపరి టెస్టులకు దూరం అయ్యాడు. భార్య ప్రసవం నేపథ్యంలో కొహ్లీ ఇండియాకు తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో.. రెండో టెస్టు నుంచి తదుపరి మ్యాచ్ లకు రహనే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఇక కొహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ ఫైనల్ ఎలెవన్ లో చోటు సంపాదించుకోనున్నాడు. వన్డే సీరిస్, టీ20ల్లో రాహుల్ మంచి ఫామ్ ను కనబరిచాడు. ఇప్పుడు టెస్టు జట్టులో జట్టుకు గొప్ప ప్రత్యామ్నాయాలు కూడా లేని నేపథ్యంలో.. రాహుల్ కు అవకాశం లభించడం లాంఛనమే.
ఇక తొలి టెస్టులో దారుణంగా విఫలం అయిన పృథ్వీ షా పై వేటు తప్పేలా లేదు. రెండో టెస్టుకు షా స్థానంలో శుభమన్ గిల్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక కీపర్ సాహాపై కూడా వేటు తప్పేలా లేదు. సాహా స్థానంలో రెండో టెస్టులో పంత్ కు అవకాశం లభించే అవకాశాలున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. సాహా మంచి ఫామ్ లోనే కనిపించినా తొలి టెస్టులో బ్యాటింగ్ విషయంలో విఫలం అయ్యాడు.
ఇక గాయంతో షమీ దూరం కావడంతో.. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ కు అవకాశం లభించనుందని తెలుస్తోంది. ఇలా రెండో టెస్టుకు ఏకంగా నలుగురు ఆటగాళ్ల రీప్లేస్ మెంట్ తో టీమిండియా బరిలోకి దిగనుంది. డిసెంబర్ 26న రెండో టెస్టు ప్రారంభం కానుంది.