సినిమాల్లో స్టార్ హీరోలు సమకాలీన రాజకీయాలపై పదునైన డైలాగులు సంధిస్తూ ఉంటారు. రాజకీయ నేతల పట్ల వ్యంగ్యంగా స్పందిస్తూ ఉంటారు. తక్కువ చేసే డైలాగులు బోలెడన్ని ఉంటాయి.
అదే సినిమా హీరోలు రాజకీయాల్లోకి వెళితే.. వీళ్ల రాజకీయం మరింత దారుణంగా ఉంటుంది. వీళ్ల సినిమాల్లో విలన్లు ప్రదర్శించే రాజకీయ అవకాశవాదాన్ని మించి ఈ హీరోలు రాజకీయం చేస్తూ ఉండటాన్ని అనేక సందర్భాల్లో చూడవచ్చు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళనాడు రాజకీయ నేతలకు అలాగే దొరుకుతున్నాడు. రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని ప్రకటించిన రజనీకాంత్ ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.
పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగును పూర్తి చేసి డైరెక్టుగా రాజకీయ వేదికపైకి వెళ్లాలని రజనీ ప్లాన్ లో ఉన్నట్టున్నారు. తమిళనాడు ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం కూడా లేకపోయినా.. రజనీ నెలన్నర పాటు షూటింగుతో బిజీ కానున్నారు. యూనిట్లో కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో.. ఆ షూటింగ్ కూడా వాయిదా పడినట్టుగా ఉంది.
మరి రజనీకాంత్ ఎప్పుడు షూటింగును పూర్తి చేసి, తన పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తారో కానీ, ఈ షూటింగుపై తమిళనాడు రాజకీయ నేతలు అప్పుడే సెటైర్లు మొదలుపెట్టారు.
కాంగ్రెస్ వాళ్లు.. పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి, రజనీకాంత్ సినిమా షూటింగుకు వెళ్లారంటూ ఎద్దేవా చేస్తూ ఉండగా, స్టాలిన్ కూడా ఈ వ్యవహారంపై పంచ్ లు వేశారు. కొందరు పార్టీ పెట్టి రాత్రికి రాత్రి అధికారాన్ని పొందాలని చూస్తున్నారంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు.
గతంలో అన్నాదురై ఎన్నో యేళ్లు శ్రమించి రాజకీయ పార్టీని అభివృద్ధి చేశారని, ఆయనకే అధికారాన్ని అందుకోవడానికి చాలా యేళ్లు పట్టాయని స్టాలిన్ ప్రస్తావించారు. అయితే ఇప్పుడు పార్టీ పెట్టిన 24 గంటల్లోనే అధికారాన్ని సొంతం చేసుకోవాలని కొంతమంది కలలు కంటున్నారని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
రజనీ పేరు ఎత్తకుండానే స్టాలిన్ ఆయనపై ఈ పంచ్ లేశారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా తమ వాడు కాదని డీఎంకే బలంగా ఫిక్సయ్యింది. అందుకే ఆ హీరోపై విమర్శలకు ఆ పార్టీ వెనుకాడుతున్నట్టుగా లేదు.
ఏదేమైనా ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూడా సినిమాలను వదులుకోకుండా, పోలింగ్ కే ఐదు నెలల సమయం ఉన్న నేపథ్యంలో.. ఇంకా కనీసం నెల పాటు షూటింగ్ స్పాట్స్ లోనే ఉండబోతూ.. రజనీకాంత్ ఆదిలోనే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చారు.
సరిగ్గా ఆరు నెలల పాటు కూడా రజనీకాంత్ జనం మధ్యకు వెళ్లకపోతే.. ఆయన పార్టీపై జనాల్లో అయితే ఎంతో కొంత నమ్మకం ఎలా ఏర్పడుతుంది? అభిమానుల ఓట్లు పడితే చాలా? వాటితో సీఎం అయిపోతారా?