ధర్నా చేసే దమ్ము లేదా?

అన్యాయం అని తెలిసీ ఎదిరించకపోతే అంతకన్నా అన్యాయం మరొకటి వుండదు. ఆంధ్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారి సినిమాలకు ఓ మాదిరిగా తమకు నచ్చని వారి సినిమాలకు మరో మాదిరిగా వ్యవహరిస్తోంది. ఇది కళ్లకు…

అన్యాయం అని తెలిసీ ఎదిరించకపోతే అంతకన్నా అన్యాయం మరొకటి వుండదు. ఆంధ్ర ప్రభుత్వం తమకు నచ్చిన వారి సినిమాలకు ఓ మాదిరిగా తమకు నచ్చని వారి సినిమాలకు మరో మాదిరిగా వ్యవహరిస్తోంది. ఇది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. 

బంగార్రాజు సినిమా టైమ్ లో కరోనా ఆంక్షలు విధించి వున్నాయి. కానీ అర్ఙెంట్ గా వాటిని వాయిదా వేస్తూ అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి కన్నబాబు సోదరుడు ఆ సినిమాకు దర్శకుడు. అలాగే ముఖ్యమంత్రి జ‌గన్ సన్నిహితుడు నాగార్ఙున ఆ సినిమా హీరో, నిర్మాత. 

అందుకని ఆ ఆదేశాలు ఇచ్చారని జ‌నం బాహాటంగానే అనుకున్నారు. అంతే కాదు సినిమా టికెట్ లు ఎలా అమ్మకున్నా ఒక్క ఎమ్మార్వో కానీ ఒక్క వీఆర్వో కానీ థియేటర్లకు నోటీసులు ఇచ్చిన పాపాన పోలేదు.

కట్ చేస్తే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. ప్రభుత్వం ఒంటి కాలి మీద లేస్తోంది. థియేటర్లకు నిబంధనలు గుర్తు చేస్తోంది. రేట్ల గుర్తు చేస్తోంది. కళ్లెర్ర చేస్తోంది. ఇది పక్కా అన్యాయం. పక్షపాత వైఖరికి నిదర్శనం. అందులో సందేహం లేదు.

కానీ దీన్ని పవన్ అభిమానులు, జ‌నసేన కార్యకర్తలు ఎందుకు సహిస్తున్నట్లు? ఈ పక్షపాత వైఖరికి నిరసనగా ఎందుకు ఉద్యమించడం లేదు? ఎందుకు ధర్నా చేయడం లేదు. ప్రభుత్వానికి తాము చేస్తున్న తప్పు లేదా తమ అధికారులు చేస్తున్న తప్పు తెలియాలి కదా? రేపు రాధేశ్యామ్ సినిమా వస్తుంది అప్పుడు ఇలాగే అంక్షలు పెడతారా? చిరంజీవి ఆచార్య సినిమా వస్తుంది ఇలాగే వ్వవహరిస్తారా? అని నిలదీయాలి కదా?

పోరాడితే పోయేది ఏమీ లేదు. కనీసం ప్రభుత్వం చేస్తున్న పక్షపాత వైఖరి పాలన జ‌నాలకు తెలుస్తుంది.