కర్ణాటకలో రేగిన హిజాబ్ వ్యవహారంలో తమ వాదాన్ని వినిపించుకునేందుకు అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు ముస్లిం యువతులు. హిజాబ్ తమ వ్యక్తిగత ఛాయిస్ అని వారు వాదిస్తున్నారు. కర్ణాటక హైకోర్టుకు చేరింది ఈ వ్యవహారం. విచారణ కొనసాగుతూ ఉంది. సుప్రీం కోర్టులో కూడా పలు పిటిషన్లు పడ్డా.. ఈ అంశంపై కర్ణాటక హైకోర్టు ఏదో ఒకటి తేల్చే వరకూ తాము విచారణ చేపట్టబోమని సుప్రీం కోర్టు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనేది ఆసక్తిదాయకంగా మారింది సర్వత్రా. ఒకవేళ పాఠశాలల్లో హిజాబ్ లను నిషేధిస్తూ కోర్టు తీర్పును ఇస్తే.. ఇతర మత పరమైన అంశాలు కూడా చర్చకు తెరతీసినట్టే. అందులో ముఖ్యమైనది సిక్కుల తలపాగా. సిక్కు అబ్బాయిలు తలపాగా ధరించే స్కూళ్లకు వస్తారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం, కర్ణాటక హైకోర్టు నిర్ణయం అక్కడి వరకే అయినా… అక్కడా సిక్కులు ఉండకుండా పోరు!
ఇక రెండో అంశాన్ని ముస్లిం యువతుల కోర్టు వద్ద ప్రస్తావిస్తున్నారు. తమతో పాటు స్కూళ్లకు హాజరయ్యే హిందూ యువతులు.. చేతులకు గాజులతో వస్తారని, అవి కూడా మత సంబంధమైనవే కదా అనే లాజిక్ ను వారు లాగుతున్నారు. మరి హిజాబ్ మాత్రమే మతపరమైన అంశమా, అది విద్యాలయాల్లో కనపడకూడదా, గాజులు హిందూ సంస్కృతి లో భాగం కాబట్టి, గాజులను కూడా కోర్టు నిషేధిస్తుందా? అనేది తేలాల్సిన అంశం.
ఒకవేళ హిజాబ్ మాత్రమే నిషేధం. సిక్కుల తలపాగా, హిందూ సంస్కృతిని ప్రతిబింబించే గాజులూ, తలలో ధరించే పూలు వంటివి స్కూళ్లలో బాలికలు ధరించవచ్చు అని కోర్టు తీర్పును ఇస్తే.. ఈ అంశంపై సుప్రీం తలుపును కూడా తట్టే వారు బోలెడంత మంది ఉంటారు. మరి కర్ణాటక హైకోర్టు తీర్పు, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టేలా ఉంటుందా, సమర్థనగా ఉంటుందా.. అనే హీట్ క్రమంగా పెరుగుతోంది!