ఓవైపు భారీగా ప్రచారం చేస్తున్నప్పటికీ, మరోవైపు ఖిలాడీ యూనిట్ లో అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయి. వీళ్ల అనుమానం ఏ స్థాయిలో ఉందనే విషయం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో జనాలకు కూడా తెలిసిపోయింది. ఆ అనుమానాలే నిజమయ్యాయి.
ఖిలాడీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రస్తుతం థియేటర్లలో ఉన్న గ్యాప్ ను ఖిలాడీ క్యాష్ చేసుకుంటుందని మేకర్స్ భావించారు. పుష్ప, అఖండ హవా ముగిసిన వేళ.. ఖిలాడీ తప్ప ఆడియన్స్ కు మరో ప్రత్యామ్నాయం ఉండదని, వసూళ్లకు ఢోకా ఉండదని అనుకున్నారు.
కానీ టిల్లూ వచ్చాడు. ఖిలాడీకి ఆమాత్రం అవకాశం కూడా లేకుండా చేశాడు. అవును.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా అంచనాల్ని మించి ఆకట్టుకుంది. హిలేరియస్ స్టఫ్ తో వచ్చిన ఈ సినిమా ఖిలాడీ సినిమాకు దాదాపు చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది.
విడుదలైన మొదటి రోజు, మొదటి ఆటకే 'టిల్లూ'కు సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. లాజిక్స్ లేకుండా తీసినప్పటికీ సినిమాలో కామెడీతో చేసిన మేజిక్ వర్కవుట్ అయింది. దీంతో నిన్నటితో పోలిస్తే, ఈరోజు ఈ సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ వీకెండ్ ఖిలాడీ కంటే, టిల్లూనే ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ గా మారింది.
టిల్లు దెబ్బ ఖిలాడీపై ఏ రేంజ్ లో పడిందో తెలియాలంటే, ఈ వీకెండ్ పూర్తవ్వాలి. సోమవారం నుంచి డీజే టిల్లూకు మరిన్ని థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు ఖిలాడీ సినిమా కొన్ని కీలక సెంటర్లను కోల్పోయే ప్రమాదం ఉంది.