చంద్రబాబు ఖర్మ ఏంటో కానీ.. అనవసరంగా అన్నిసార్లు అడ్డంగా బుక్కైపోతుంటారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాలతో చర్చించేందుకు కేంద్రం కొన్ని పాయింట్లు ప్రకటించడం, అందులో ప్రత్యేక హోదా హామీని ఉంచినట్టే ఉంచి తీసేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు బాధితుడిగా మారడమే ఇక్కడ విచిత్రం.
గతంలో చంద్రబాబు హోదా కావాలని, ఆ తర్వాత ప్యాకేజీయే ముద్దు అని దోబూచులాడిన వీడియోలన్నీ మళ్లీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. బాబు బండారాన్ని మరోసారి బయటపెట్టాయి.
ఇటీవల రాజ్యసభలో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన మోదీ అందరికీ టార్గెట్ అయ్యారు. అటు తెలంగాణ వారు తిట్టుకున్నారు, ఇటు ఏపీ నాయకులు, ప్రజలు హోదాపై బీజేపీ చేసిన మోసాన్ని ఎత్తి చూపారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఈనెల 17న తొలి సమావేశం అంటూ 9 అంశాలతో అజెండా ప్రకటించింది. అందులో ఏపీ ప్రత్యేక హోదా అనే పాయింట్ కూడా ఉంది.
అయితే అంతలోనే ఏం జరిగిందో ఏమో.. గంటల వ్యవధిలో కొత్త అజెండా వచ్చింది. అందులో 'హోదా' మిస్ అయింది. హోదా అంశం ఉండటంతో వైసీపీ దాన్ని తమ విజయంగా ప్రకటించుకోవడాన్ని జీర్ణించుకోలేని కేంద్రం వెంటనే ప్లేటు ఫిరాయించింది. జగన్ కు ఆ క్రెడిట్ దక్కకూడదని జీవీఎల్ లాంటివారు చేసిన ప్రయత్నాలు ఫలించి కేంద్రం ఆ ప్రస్తావనే లేకుండా చేసింది. ఇక్కడి వరకు ఇది బీజేపీ వర్సెస్ వైసీపీ లాగానే కనిపించినా.. మధ్యలో బాబు నరం లేని నాలుక వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యం అంటూ వైసీపీ వాళ్లు చంద్రబాబు పాత వీడియోలను బయటకు తీశారు. హోదా కావాలి, కాదు ప్యాకేజీయే కావాలి, కాదు కాదు హోదాయే కావాలి అంటూ బాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వీడియోలన్నీ మళ్లీ హైలెట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే పాయింట్ రావడం, చంద్రబాబుని దోషిగా నిలబెట్టడం రెండూ వెంట వెంటనే జరిగిపోయాయి.
అసలు ప్రత్యేక హోదా అనే అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా… చంద్రబాబు తెగ ఇబ్బందిపడిపోతారు. మరోసారి అలాగే ఇబ్బంది పడ్డారు. అయితే ఇక్కడ బాబు కావాలని చేసిందేమీ లేదు, బీజేపీ, వైసీపీ ఆధిపత్య పోరులో బాబు నలిగిపోయారంతే.
ఎవరు చేసిన పాపం అయినా ఏదో ఒక రూపంలో కడిగేసుకునే అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు హోదా విషయంలో చేసిన పాపం ఆయన్ని జీవితాంతం వెంటాడేలా ఉంది. ఏపీని విభజించి కాంగ్రెస్ ఎలా తన గొయ్యి తానే తీసుకుందో, హోదా విషయంలో ఏపీ ప్రజల్ని మోసం చేసి, ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టి, చంద్రబాబు అలా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా బాబు మాత్రం జీవితాంతం ఆ శిక్ష అనుభవించాల్సిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బయటకొస్తున్న వీడియోలు బాబు శిక్షను అలా గుర్తుచేస్తుంటాయి.