చాన్నాళ్ల తర్వాత ఒక శ్రీలంకన్ ఆటగాడికి ఐపీఎల్ లో అవకాశం లభించడమే కాదు, భారీ ధర కూడా పలికింది! ఐపీఎల్ ఆరంభ సీజన్లలో లంకన్ ప్లేయర్లకు మంచి అవకాశలే లభించేవి. అయితే శ్రీలంక క్రికెట్ ప్రమాణాలు క్రమంగా పడిపోవడంతో ఐపీఎల్ వేలం పాట వరకూ వచ్చే లంక ఆటగాళ్ల జాబితా కూడా క్రమంగా తగ్గిపోయింది.
మురళీ, సంగకార, జయవర్దనే వంటి వాళ్లకు ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్లలో మంచి ధరలు పలికాయి. అయితే ఆ తర్వాత మాత్రం లంకన్ ప్లేయర్ల ఊపు లేకపోయింది. మళ్లీ పై ముగ్గురే కోచ్ లుగా అవకాశాలు పొందుతూ వచ్చారు. వీళ్లు వివిధ జట్ల కోసం పని చేస్తూ వచ్చారు. అయితే లంక ఆటగాళ్లు మాత్రం అవకాశాలు అంతగా పొందలేకపోయారు.
ఈ పరిస్థితికి భిన్నంగా ఈ సారి హసరంగకు రికార్డు ధర పలికింది. ఈ బౌలర్ కు ఏకంగా పది కోట్ల పై ధర పలకడం విశేషం. నాన్ ఇండియన్ స్పిన్నర్ల విషయంలో ఇదే అత్యధిక ధర!
ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాట విషయంలో కూడా రికార్డుల సవరణ జరిగింది. ఇప్పటి వరకూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని అవేష్ ఖాన్ కు పది కోట్ల పై ధర పలకడం సెన్షేషనల్ రికార్డు. వేలంలో చాలా వరకూ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లకే ఎక్కువ డిమాండ్. ఇలాంటి వారే కాకుండా రంజీలు, వేర్వేరు టోర్నీల్లో సత్తా చాటిన వారికీ డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ ఇప్పటి వరకూ ఎవరి విషయంలోనూ ఎప్పుడూ పది కోట్ల రూపాయల ధర వరకూ రాలేదు! అవేష్ ఖాన్ ఆ రికార్డును సృష్టించాడు.
ఇక దక్షిణాఫ్రికా అండర్ 19 ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్ కు మూడు కోట్ల రూపాయల ధర దక్కడం మరో విశేషం. జూనియర్ ఏబీ అంటూ డివిలియర్స్ తో పోల్చబడుతున్నాడు ఈ కుర్రాడు. ఇటీవలి అండర్ 19 ప్రపంచకప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే మూడు కోట్లతో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ టికెట్ పొందాడు ఈ కుర్రాడు. అండర్ 19 ప్రపంచకప్ సాధించిన భారతీయ క్రికెటర్ల కన్నా.. ఈ సౌతాఫ్రికన్ కు మంచి డిమాండ్ రావడం విశేషం.
ఇక బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్, ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ స్మిత్ లాంటి వాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజ్ ల నుంచి అనాసక్తి వ్యక్తం అయ్యింది. వీళ్ల స్టార్ డమ్, రికార్డులు ఏవీ కూడా వీరిపై ఆసక్తిని పెంపొందించలేకపోయాయి!