ఊర్ల పేర్లే.. కేండేట్లు లేరు: బేరాలకు సంకేతాలు!

మొత్తానికి జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. తెలంగాణలోని మొత్తం 32 నియోజకవర్గాల్లో బరిలోకి దిగబోతున్నట్టుగా పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు…

మొత్తానికి జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. తెలంగాణలోని మొత్తం 32 నియోజకవర్గాల్లో బరిలోకి దిగబోతున్నట్టుగా పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆ 32 స్థానాల జాబితాను కూడా ప్రకటించారు. ప్రధానంగా హైదరాబాద్ నగరం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే వారు ఎక్కువగా పోటీచేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కూడా నిర్వహిస్తారట. ఇప్పటిదాకా పొత్తుల మీద నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన వెల్లడించారు.

తమాషా ఏంటంటే.. ఎన్డీయేలో ఇప్పటికీ తాము భాగస్వామిగా ఉన్నామని, మోడీ తనకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడని చెప్పుకునే పవన్ కల్యాణ్.. తెలంగాణలో ఒంటరిగా పోటీచేయడం ఏమిటో ఎంతకూ అర్థం కాని సంగతి. ఎందుకంటే.. భాగస్వామి పార్టీ అంటే అర్థం.. కలిసి పోటీచేయాలి. అయితే తెలంగాణలో జనసేనను బిజెపి తమ సమీపానికి కూడా రానివ్వడం లేదు. అంటరాని పార్టీలాగా దూరం పెడుతోంది. ఆ నేపథ్యంలో జనసేన ఏకంగా 32 స్థానాల్లో సొంతంగా పోటీకి సిద్ధం కావడం చిత్రంగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్, మెగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారంతా తమకు మద్దతు ఇస్తారని, గెలిచే పరిస్థితి లేకపోయినప్పటికీ, గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి జనసేనకు ఉన్నదని.. పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ మాటలకు అర్థం ఏమిటో ఎవ్వరికైనా సులువుగా తెలిసిపోతుంది. 

తాము పోటీచేసే నియోజకవర్గాల్లో గెలవదలచుకున్న అభ్యర్థులు ముందుగా తమను ప్రసన్నం చేసుకోవాలని, తమతో సఖ్యంగా ఉండాలని వారు సంకేతాలు ఇస్తున్నారన్నమాట. అంటే ఆయా నియోజకవర్గాల్లో బేరాలకు వారు సంకేతాలు ఇస్తున్నారు.

ప్రస్తుతానికి కేవలం 32 నియోజకవర్గాల ఊర్ల పేర్లు మాత్రం ప్రకటించారు. సర్వేలు చేయించిన తర్వాత గెలుపు గుర్రాలను ఎంచుకుని కేండిడేట్ల పేర్లు ప్రకటిస్తారట. ఇదంతా లావాదేవీలకోసం చేస్తున్న ప్రకటనలాగా కనిపిస్తోంది. ఇందులో రెండు రకాల బేరాలకు అవకాశం కనిపిస్తోంది. జనసేన వంటి గుర్తింపు ఉన్న పార్టీ తరఫున పోటీచేయడం అంటే.. ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు వారికి భారీగా తాయిలాలు అందించే అవకాశం ఉంటుంది. 

తాయిలాలు, నజరానాలు ఆశించేవాళ్లు పార్టీకి ముడుపులు సమర్పించుకుని, విరాళాలు అందించి.. తమ పేర్లను అభ్యర్థులుగా ప్రకటింపజేసుకోవచ్చు. అలాగే రెండో బేరం ఏంటంటే.. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఆశ ఉండే ప్రధాన పార్టీల బలమైన అభ్యర్థుల నుంచి పార్టీ ఏకంగా డీల్ మాట్లాడుకుని అక్కడ బలహీనమైన అభ్యర్థులను పోటీలోకి దించవచ్చు.

జనసేనకు ఉండే ప్యాకేజీల క్రెడిబిలిటీని బట్టి.. ఇంకో విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆ పార్టీ ప్రకటించిన 32 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా.. అధికార భారాస గట్టిపోటీ ఎదుర్కొంటున్న నియోజకవర్గాలేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే జనసేన అక్కడ రంగంలోకి దిగి, కేసీఆర్ కు మేలు చేయడానికి నిర్ణయించుకున్నదని.. ఇందుకోసం భారాసతో భారీగా డీల్ మాట్లాడుకున్నదని ఒక వాదన వినిపిస్తోంది. 

ఏదేమైనా.. గెలిచే ఊసు లేనప్పుడు.. పవన్ కల్యాణ్ తగుదునమ్మా అంటూ పార్టీలోని బరిలోకి దించడం ఇలాంటి ఊహలకే అవకాశం ఇస్తుంది.