ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించాలన్న ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వరసగా రెండో రోజు కూడా ఆ అవకాశం లభించలేదు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి ఆ కార్యక్రమం ఉంటుందని నిన్ననే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఆ సమావేశానికి నిన్న కలెక్టర్లు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఆ కార్యక్రమం రద్దు అయ్యింది.
అయితే గురువారం ఆ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. కానీ ఈ రోజు కూడా ఆ కార్యక్రమం రద్దు అయినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో ఈ సమావేశం వరసగా రెండోసారి రద్దు అయ్యింది. అధికారులతో సమీక్ష నిర్వహించాలన్న ఆయన ప్రయత్నం నెరవేరలేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఇప్పటికే ఎస్ఈసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే అలా లేఖ రాయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఎస్ఎంఎస్ పెట్టారట. ఆ తర్వాత నిమ్మగడ్డ గవర్నర్ తో వెళ్లి సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఆయన ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారిపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారట నిమ్మగడ్డ. మంత్రి కొడాలి నాని తనపై చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.