మీడియా అనే ముసుగు తగిలించుకున్న వెంటనే ప్రపంచంలో ఎవరికీ లేని హక్కులు, అధికారాలు, ప్రత్యేకత తమకు వచ్చేస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. తమ వాహనం మీద ‘ప్రెస్’ అనే స్టికర్ అతికించుకోగానే.. దారిలో తాము ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా పోలీసు వాడు తమను ప్రశ్నించకూడదు అని కలగంటూ ఉంటారు.
ఇలాంటి పెడపోకడలు శృతిమించిన తరువాత.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టుగా అవతారం ఎత్తుతున్నాడు. కాస్త డిటిపి తెలిసిన ప్రతి ఒక్కడూ ఒక ఈ పేపర్ నడిపేసి సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు కోరుకుంటున్నాడు. ఇలాంటి అవకతవకల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఈ-పత్రిక అనే ముసుగులో అసత్యాలను కట్టుకథలను ప్రచారం చేయడానికి తెగబడటం వింతేమీ కాదు. అలాంటి ప్రయత్నం చేసినందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిఐడి నోటీసులను ఎదుర్కొంటుంది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఈసీకి సమర్పించిన ఆస్తుల అఫిడవిట్ ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో అనేక మార్పు చేర్పులు చేసి తప్పుడు పత్రాలు సృష్టించడం, వాటిని తెలుగుదేశం పార్టీ అధికారిక ఈ పత్రిక చైతన్య రథంలో ప్రచురించడం జరిగింది. దీనిపై బుగ్గన ఫిర్యాదు చేయడంతో ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. పత్రాలను ఫోర్జరీ చేసి తప్పుడు వివరాలతో దుష్ప్రచారం సాగించడం మాత్రమే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలో పెట్టడం ఈ కేసులో నేరం.
పత్రిక అనే ముసుగు తగిలించుకున్నంత మాత్రాన వదిలిపెట్టేదేమీ లేదని ఏపీ సీఐడీ నిరూపిస్తోంది. అసలు ఈ పత్రిక నిర్వాహకులు ఎవరో.. ఏ ఆధారాలతో ఈ కల్పితకథలను ప్రచురించారో.. వివరాలు తెలియజేయాలంటూ తాజాగా తెలుగుదేశం పార్టీకి నోటీసులు ఇచ్చింది.
ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే.. ఇలాంటి అవకతవక దుర్మార్గపు పనులకు కేవలం రాజకీయ పార్టీలు నడుపుతున్న ఈ పత్రికలు పాల్పడడం మాత్రమే కాదు. ప్రధాన స్రవంతిలో ఉన్న పత్రికలు కూడా ఇదే తప్పులు చేస్తున్నాయి. అయితే మీడియా అనే రక్షణ కవచం వారికి మరికొంత దృఢంగా ఉంది. ఆ కవచాన్ని అడ్డుపెట్టుకొని అనేక తప్పుడు రాతలతో తాము కక్ష కట్టిన వారి మీద దుష్ప్రచారం సాగిస్తూ బతుకుతున్నారు. వారి కథనాల మీద కూడా ముందు ముందు ఏపీ సి ఐ డి పోలీసు వ్యవస్థలు కేసులు నమోదు చేసి నిజాలను రాబట్టే అవకాశం ఉంది.
ప్రధాని స్రవంతి మీడియా అనే మొహమాటం ఏమాత్రం లేకుండా నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తే కనుక తప్పుడు ప్రచారాలకు రాజకీయ దుర్బుద్ధితో సాధించే కుతంత్రాలకు తెరపడుతుంది.