వకీల్ సాబ్ 2 మీద పవన్ కు మోజు ఎందుకు?

సినిమాలు చేయడం తనకు బతుకు తెరువు అని, సినిమాలు చేసి అక్కడ వచ్చిన డబ్బు తీసుకువచ్చి తాను రాజకీయాల్లో ప్రజలకోసం ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటారు. Advertisement రాజకీయాలకు పూర్తి సమయం…

సినిమాలు చేయడం తనకు బతుకు తెరువు అని, సినిమాలు చేసి అక్కడ వచ్చిన డబ్బు తీసుకువచ్చి తాను రాజకీయాల్లో ప్రజలకోసం ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటారు.

రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఈ నాయకుడు.. తనకు కన్వీనియెంట్ గా మాటతప్పి, బతుకుతెరువు అనే వాదన తెరపైకి తెచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్‌లలో మాత్రమే జనం మధ్యకు వస్తూ రాజకీయం నడిపిస్తున్నారు. అలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉబలాటపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేతినిండా సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. సగం పూర్తయిన సినిమాలకే శుభ్రంగా డేట్స్ ఇవ్వకుండా వాటి డిలేకు కారణం అవుతున్నారు. మరొకవైపు ఎన్నికలకు ఏడాది దూరంలోకే వచ్చేశాయి. పోయిన ఏడాది విజయదశమి నాటికి ప్రారంభిస్తానని, రాష్ట్రంలో ఊరూరూ తిరుగుతానని ప్రకటించిన బస్సుయాత్రఇప్పటిదాకా జరగనేలేదు. సిద్ధమైన వారాహి వాహనం అధిరోహించనేలేదు. 

ఇలాంటి సమయంలటో ఇప్పుడున్న సినిమాలు పూర్తిచేయడానికే సమయం చాలదు. మళ్లీ కొత్త సినిమాలు ఒప్పుకుంటే రాజకీయాలకు, ఆయన దృష్టిలో ప్రజలకోసం టైం ఎక్కడ ఉంటుంది? అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఇది నిజమేకానీ.. పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్టుల కోసం ఆరాటపడుతున్నారు. వకీల్ సాబ్ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉత్సాహపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కథాచర్చలు నడుస్తున్నాయని ఒక దశకు చేరుకున్నాయని కూడా అంటున్నారు. 

వకీల్ సాబ్ మీద మాత్రమే పవన్ కు ఎందుకంత కోరిక. హిందీ పింక్ సినిమాతో పోలిస్తే.. తెలుగు వకీల్ సాబ్ గొప్ప పేరు తెచ్చుకోలేదు. పవన్ కల్యాణ్ పైత్యంతో కథను కంగాళీగా మార్చేసి నానారకాలుగా భ్రష్టు పట్టించి, అసలు సినిమాలో ఉండే ఆత్మను చంపేశారనే విమర్శలున్నాయి. పవన్ గ్యాప్ తర్వాత వచ్చినందున కొంత కమర్సియల్ సక్సెస్ అయింది. అయినా దానికి సీక్వెల్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. 

గతంలో గబ్బర్ సింగ్ హిందీ రీమేక్ గా చేసి, కథ రీమేక్ హక్కుల కొనుగోలు ఖర్చు తగ్గించుకుని, గబ్బర్ సింగ్ హిట్ టాక్ ను మరోసారి క్యాష్ చేసుకోవడానికి దానికి సొంతంగా వండుకున్న కథతో సీక్వెల్‌గా సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు. అదెంత ఘోరంగా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పింక్ హక్కులు కొని చేసిన రీమేక్ వకీల్ సాబ్ హిట్ టాక్ ను క్యాష్ చేసుకోవడానికి, లేని సీక్వెల్ ను వండి.. ఇంకో సినిమా చేస్తే అదే ఫలితం తప్పదని పవన్ అభిమానులే అంటున్నారు. 

వకీల్ సాబ్ కు సీక్వెల్ మీద పవన్ మోజు పడ్డానికి కొన్ని కారణాలున్నాయి. వకీలుగా తనను ప్రొజెక్టు చేయడంలో.. తానొక దీనజన బాంధవుడిగా.. ప్రజలకు ఎక్కడ ఏ కష్టాలున్నా వాటిని పరిష్కరించేసే మహానుభావుడిగా పింక్ కథను కంగాళీగా మార్చారు. ఇప్పుడు ఎన్నికలలోగా విడుదల చేసేట్లయితే.. అందులో అనేకానేక ప్రజాసమస్యలను చిటికెలో పరిష్కరించే కథానాయకుడిగా తనను ప్రొజెక్టు చేసుకోవచ్చుననేది పవన్ కోరిక. పైగా వకీల్ సాబ్ సీక్వెల్ అయితే.. హీరో లాయరు గనుక.. సగానికి పైగా సినిమాను కోర్టు డ్రామాగా నడిపించినా సరిపోతుంది. ఇదంతా ప్రొడక్షన్ పరంగా చవకగా అయిపోతుంది.

రోజుకు నాలుగు కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ.. సినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ తో ఇలాంటి కోర్టు డ్రామా కథలకైతే పది, ఇరవై రోజుల కాల్సీట్లు సరిపోతాయి. ఇలాంటి వన్నీ దృష్టిలో ఉంచుకుని.. సీక్వెల్ వకీల్ సాబ్ కే చేయాలని పవన్ ఉబలాటపడుతున్నట్టు తెలుస్తోంది.