పైత్యం తలకెక్కిన హామీలు ఇవి

పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. ఇప్పుడు రాజకీయాలలో నాయకులు కురిపిస్తున్న హామీల వర్షం కూడా ఈ ప్రబుద్ధుడి తీరుకు భిన్నంగా ఎంత మాత్రమూ కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ…

పిచ్చి ముదిరితే రోకలి తలకు చుట్టమన్నాడట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. ఇప్పుడు రాజకీయాలలో నాయకులు కురిపిస్తున్న హామీల వర్షం కూడా ఈ ప్రబుద్ధుడి తీరుకు భిన్నంగా ఎంత మాత్రమూ కనిపించడం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కొంత ప్రభావం చూపగలిగి, ఎన్నో కొన్ని సీట్లను సాధించగలిగితే చాలు.. ముఖ్యమంత్రి పీఠం తమకే దక్కే విధంగా చక్రం తిప్పగలం అని ఆశలు పెంచుకుంటున్న కుమారస్వామి ఒక విచిత్రమైన హామీని ప్రకటించారు. ఈ వాగ్దానం ద్వారా అన్నదాతల కుటుంబాల్లో తనకు అనల్పమైన ఆదరణ దక్కుతుందని, ఓట్లు వెల్లువెత్తుతాయని కుమారస్వామి కలగంటున్నట్టుగా ఉంది.

ఇంతకూ ఆయన కన్నడ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే కనుక రైతుబిడ్డలను పెళ్లి చేసుకునే వారికి 2 లక్షల రూపాయల కానుక అప్పనంగా ఇస్తారట. రైతు కుటుంబాల్లోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు.. ఎవరూ వారికి పిల్లనివ్వడం లేదు అనే సమస్య వినతిపత్రం రూపంలో ఆయన దృష్టికి వచ్చిందట! దానికి స్పందించిన కుమారస్వామి రైతు కుటుంబాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకునే వారికి రెండు లక్షలు ఇస్తానంటూ కొత్త హామీ తెరపైకి తెచ్చారు. 

ఇలాంటి విచిత్రమైన వాగ్దానం చేయవచ్చుననే ఆలోచన కుమారస్వామి కి ఎలా వచ్చిందో తెలియదు. ఈ వాగ్దానంతో ఆయన నవ్వుల పాలయ్యే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది.

కన్నడ రాజకీయ సంగ్రామంలో పోటీ ప్రధానంగా అధికారంలో ఉన్న బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య మాత్రమే ఉంది. ఈ రెండు పార్టీలు ముఖాముఖి బలంగా తలపడుతున్నాయి. ఆటలో అరటి పండు లాగా జెడిఎస్ సారథి కుమారస్వామి కూడా అధికారం మీద ఆశ పెట్టుకుంటున్నారు. 

తమ పార్టీకి నేరుగా అధికారంలోకి రాగలిగినన్ని సీట్లు దక్కుతాయనే నమ్మకం ఆయనకు ఎటూ లేదు. కనీసం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలనే కోరిక కూడా ఆయనకు లేదు. తన పార్టీకి ఏ కొన్ని సీట్లు దక్కినా చాలునని అనుకుంటున్నారు. అయితే ఆయన కోరికల్లా ఏంటంటే.. తన మీద ఆధారపడిన సంకీర్ణ ప్రభుత్వం మాత్రమే ఏర్పడాలని! అలాంటప్పుడు తనకే ముఖ్యమంత్రి పదవి కావాలని బేరం పెట్టి అధికార పీఠం ఎక్కాలని కలగంటున్నారు.

ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టుగా పరిస్థితులలో అలా సంకీర్ణానికి అవసరమైనంత బలం కూడా తన పార్టీకి దక్కదనే భయం కుమారస్వామి లో ఉన్నట్టుంది. అందుకే రైతు కుటుంబాలలో పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు లాంటి అలవిమాలిన హామీలు ఇస్తున్నారు. 

రైతు పుత్రులకు పెళ్లి కావడం లేదు.. అని వినతులు రాగానే ఈ వాగ్దానం ప్రకటించిన కుమారస్వామి రైతు పుత్రికల కోసం ఏం చేస్తారు? రైతు కుటుంబాలలో కూతుళ్లకు అసలు పెళ్లిళ్లు చేయడానికి గత్యంతరం లేక, డబ్బు లేక అలమటిస్తున్నారని ఆయనకు ఒక వినతిపత్రం వస్తే గనుక రైతు  కుటుంబంలోని ప్రతి కూతురికి ఓ 10 లక్షలు కానుక ప్రకటిస్తారా? అని జనం నవ్వుకుంటున్నారు.

అధికారం కోసం పార్టీలు అరచేతిలో వైకుంఠం చూపించడం చాలా మామూలు విషయమే కానీ.. కుమారస్వామి వాగ్దానం మరీ ఎగతాళికి గురయ్యేలా ఉన్నదని విమర్శలు వస్తున్నాయి.