ఏపీ భారతీయ జనతా పార్టీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ పార్టీకి అధికారం ఇస్తే.. యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామంటూ ఆయన ప్రజాగ్రహ సభలో ప్రకటించారు! ప్రస్తుత ప్రభుత్వం లిక్కర్ రేటును విపరీతంగా పెంచిందని, ఏపీలో కింగ్ ఫిషర్ బీరు దొరకలేదని వాపోయిన సోము వీర్రాజు.. తాగుబోతులంతా బీజేపీకే ఓటేయాలని పిలుపును ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో తాగే వారి సంఖ్యను కూడా ప్రకటించారు. ఏపీలో కోటి మంది తాగుతున్నారని, వారంతా బీజేపీకే ఓటు వేయాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. వారంతా బీజేపీకి ఓటేస్తే.. డెబ్బై ఐదు రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని ఈ కాషాయ పార్టీ నేత బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇంకా ఆదాయం పెరిగితే.. యాభై రూపాయలకే చీప్ లిక్కర్ అని కూడా సోము వీర్రాజు ప్రకటించేశారు!
అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగితే, చీప్ లిక్కర్ రేట్లను తగ్గిస్తారనమాట! బీజేపీ అంటే ఏదో కాషాయ వాదం అని అంతా అనుకున్నారు. అయితే బీజేపీది చీప్ లిక్కర్ వాదం లాగుంది సోము వీర్రాజు మాటలను బట్టి. బీజేపీ అంటే గోమూత్రం తాగమని చెప్పే పార్టీ అని అంతా అంటుంటే… సోము వీర్రాజు మాత్రం చీప్ లిక్కర్ తాగమని చెబుతున్నారు. అది కూడా తక్కువ రేటుకే ఇస్తారట!
పేరులోనే చీప్ అని ఉన్న చీప్ లిక్కర్ ను ఇలా ఎన్నికల హామీ కోసం సోము వీర్రాజు వాడుకోవడం విశేషం. ఒకవైపు బీజేపీని ప్రస్తుతం శాసిస్తున్న నరేంద్రమోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ మద్యనిషేధాన్ని అమలు చేస్తూ ఉంది. అన్నింటికీ గుజరాత్ మోడల్ అని కమలనాథులు చెబుతుంటారు. అయితే సోము వీర్రాజు మాత్రం చీప్ లిక్కర్ మోడల్ అంటున్నారు. కనీసం చెప్పేదైనా.. మంచి మంచి బ్రాండ్లను ఎంఆర్పీకే అమ్ముతామని కూడా చెప్పలేదు! చీప్ లిక్కర్ ను చీప్ రేటుకు అమ్ముతారట ఇదీ కమలనాథుల అజెండా!